Agripedia

కొర్ర సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే ఈ సస్యరక్షణ చర్యలు తప్పనిసరి...

KJ Staff
KJ Staff

పోషక విలువలు సమృద్ధిగా ఉన్న కొర్ర చిరుధాన్యానికి ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ పుష్కలంగా ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా మెట్ట సాగు రైతులు, సాగు నీటి వసతి ఉన్న రైతులు
ఖరీఫ్, రబీ సీజన్లలో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో కొర్ర సాగు విస్తీర్ణం 45 వేల ఎకరాల్లో సాగు చేస్తూ దాదాపు 16వేల టన్నులు
దిగుబడిని సాధిస్తున్నారు.

కొర్ర పంట అత్యధిక బెట్ట పరిస్థితులను సైతం తట్టుకొని దిగుబడినిస్తుంది. అందుకే చాలా మంది రైతులు కొర్ర సాగును వర్షాధార ప్రాంతాలల్లో, తక్కువ పెట్టుబడితో సాగు చేస్తూ అధిక లాభాలను పొందుతున్నారు.తొలకరి వర్షాలు పడిన వెంటనే జూన్ మొదటి వారం నుండి జూలై రెండవ వారంలోపు విత్తుకోవాలి. విత్తడం ఆలస్యమైతే అధిక తెగుళ్ళు సోకి పంట దిగుబడి ఆశించినంతగా ఉండదు.కోర్ర పంటకు చీడపీడల సమస్య తక్కువగానే ఉంటుంది. అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా ఒక్కోసారి పంట వివిధ దశల్లో కొన్ని రకాల వ్యాధులు,పురుగులు ఆశించే అవకాశం ఉన్నందున కొన్ని సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది.

కోర్ర సాగులో సస్యరక్షణ చర్యలు:

కాండం తొలుచు పురుగు : పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మొక్క కాండాన్ని తొలచడం వలన మొక్కలు సరిగా ఎదగక చనిపోతాయి.నివారణకు క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. పురుగు ఉధృతిని బట్టి 20 -30 రోజుల ఎవరు మరోసారి పిచికారీ చేయాలి.

గులాబి రంగు పురుగు : లార్వాలు మొవ్వను తొలిచి తినడం వలన మొవ్వ చనిపోతుంది. పూత దశలో ఆశించినట్లైతే వెన్నులు తెల్ల కంకులుగా మారుతాయి. దీని నివారణకు లీటరు నీటికి 1.6 మి.లీ.మోనోక్రోటోఫాస్ కలిపి పిచికారీ చేయాలి.

వెర్రికంకి తెగులు : కొర్ర పంటను అధికంగా నష్టపరిచే తెగుళ్ళలో ప్రధానమైనదిగా చెప్పవచ్చు.వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు లేత మొక్కల ఆకుల అడుగు భాగాన తెల్లని బూజు పెరుగుదల కనిపిస్తుంది. దీని నివారణకు కిలో విత్తనానికి 6.0 గ్రా.. మెటలాక్సిల్తో విత్తనశుద్ధి చేయాలి. విత్తిన 21 రోజులకు తెగులు సోకిన మొక్కలు 5% మించి ఉన్నట్లయితే మెటలాక్సిల్ 8% + మాంకోజెబ్ 64% డబ్ల్యు. పి. 3.0 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేస్తే సరిపోతుంది.

అగ్గితెగులు : ఎదిగిన మొక్కల ఆకులపై నూలు కండే ఆకారంలో మచ్చలు ఏర్పడతాయి. ఇవి ఆకులు అంతటా వ్యాపించి ఆకులు ఎండి రాలిపోతాయి. కంకికాడపై మచ్చలు ఏర్పడినప్పుడు కాండం విరిగి,కంకి లో తాలు గింజలు ఏర్పడతాయి. దీని నివారణకు కాప్టాన్ లేక థైరమ్ (3 గ్రా /కిలో) విత్తనశుద్ది చేయాలి.లీటరు నీటికి కార్బెండజిం 1 గ్రా. లేదా మాంకోజేబ్ 2.5 గ్రా. వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి.

తుప్పు తెగులు: ఈ తెగుళ్ళు ఆశించిన మొక్కల ఆకులపై తుప్పు రంగులో మచ్చలు ఏర్పడి మొక్క మొత్తం వ్యాపిస్తుంది. ఈ తెగులు ఉధృతి మరీ ఎక్కువైతే నివారణకు లీటరు నీటికి 2.5 గ్రా. మ్యాంకోజెబ్ లేదా 1గ్రా. కార్బండాజిమ్ చొప్పున కలిపి పైరుపై పిచికారి చేయాలి.

Share your comments

Subscribe Magazine