Agripedia

మునగ సాగులో తప్పకుండా పాటించాల్సిన సస్యరక్షణ చర్యలు....!

KJ Staff
KJ Staff

మునగకాయలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ప్రస్తుతం మార్కెట్లో వీటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. దానికి అనుగుణంగానే రైతులు వాణిజ్య శైలిలో మునగ సాగు చేపట్టి స్వల్ప కాలంలో అధిక లాభాలను ఆర్జిస్తున్నారు.మునగ సాగును రైతులు అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు అయితే ఎక్కువగా నీరు నిలిచే పరిస్థితులను తట్టుకోలేదు.సాధారణంగా మునగ చెట్లు జనవరి నెలలో పూతకు వచ్చి, ఫిబ్రవరి మాసం నుంచి కాయ కోతకు వస్తుంది.

భూమి స్వభావం, వాతావరణ పరిస్థితులను బట్టి మొక్కలు పెరిగే దశలో వారం నుంచి పది రోజుల వ్యవధిలో పేరు పెట్టాల్సి ఉంటుంది. కాయలు కాసే సమయంలో 4 నుంచి 5 రోజుల కొకసారి ఖచ్చితంగా నీరు పెడితే నాణ్యమైన కాయ దిగుబడి పొందవచ్చు. మునగ సాగు చేపట్టినప్పటి నుంచి వివిధ దశల్లో వాతావరణ పరిస్థితులను బట్టి చీడపీడల సమస్య అధికంగా ఉన్నందున రైతులు ఎప్పటికప్పుడు గమనిస్తూ సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడులను పొందవచ్చు.

సస్యరక్షణ:

కాండం కుళ్లు మరియు వేరు కుళ్లు తెగులు :

నీరు ఎక్కువగా నిలిచే భూముల్లో మరియు వర్షాకాలంలో ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది.
ఈ తెగులు వేరుకు వ్యాపిస్తే వేర్లు కుళ్లిపోయి చెట్టు చనిపోతుంది.అదే కాండానికి వ్యాపిస్తే కాండం చుట్టూ ఉన్న బెరడు కుళ్లిపోయి చెట్టు విరిగిపోతుంది. నివారణకు లీటరు నీటిలో 1గ్రాము కార్బండైజిమ్‌ లేదా 3గ్రాముల డైథేన్‌ ఎం-45 కలిపిన ద్రావణం కానీ లేదా 1శాతం బోర్డోమిశ్రమాన్ని మొక్కల మొదలు దగ్గర పోసి వ్యాధిని నివారించవచ్చు.

గొంగళి పురుగు : మునగ పంటను అన్ని దశల్లోనూ తీవ్ర నష్టం కలిగిస్తాయి.రాత్రి వేళల్లో గొంగళి పురుగులు ఆకులను తింటూ బెరడును కూడా గీకి నష్టపరుస్తాయి. గొంగళి పురుగు నివారణకి తల్లి రెక్కల పురుగు పెట్టిన గుడ్ల సముదాయాలను, గొంగళి పురుగు సమూహాలను ఏరి నాశనం చేయాలి.పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే 2 మి.లీ క్వినాల్ ఫాస్ ఒక లీటరు నీటిలో కలిపి15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి . చెట్టుచుట్టూ కార్బోఫ్యురాన్ 3 జి గుళికలు 15-30 గ్రా , వేసి మట్టితో కప్పడం వల్ల కోశస్థ దశలో ఉన్న గొంగళి పురుగును నివారించవచ్చు .

తామర పురుగులు : మొక్కలు లేత దశలో ఉన్నప్పుడు మొక్క చిగుళ్ళ నుంచి రసం పీల్చడం వల్ల కొత్త చిగుర్లు సరిగ్గా రాక మొక్కలు గిడసబారి పూత ,కాయ ఏర్పడదు. ఈ పురుగు నివారణకు 2 మి.లీ మెటాసిస్టాక్స్ లేదా 1 గ్రా . ఎసిఫేట్ లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి

కాయతొలిచే ఈగ : కాయ దశలో ఈగ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. సరైన సమయంలో నివారణ చర్యలు చేపట్టకుండా పిందె దశలో కాయలోనికి ప్రవేశించి, లోపలి పదార్థాన్ని తిని నాశనం చేస్తాయి. దీంతో కాయల ఆకారం మారిపోయి వంకరగా అవుతాయి. కాయతొలిచే ఈగ నివారణకు పూత దశలో లీటరు నీటికి 2 మి.లీటర్ల ఫాసలన్‌ కలిపి పిచికారీ చేయాలి. పిందె దశలో లీటరు నీటికి 1మి.లీటరు డైక్లోరోవాస్‌ కలిపి మళ్లీ పిచికారీ చేయాలి. ఈగ ఉద్ధృతి మరీ ఎక్కువగా ఉంటే 20 రోజులకు
మరోసారి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది.

Share your comments

Subscribe Magazine