Agripedia

పోషకాలు గనిగా ఈ ఫలం.. రైతులకు లాభాలు కురిపిస్తున్న కివి!

KJ Staff
KJ Staff

అధిక పోషకాల గనిగా పిలువబడుతున్న కివి ఫ్రూట్ ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొంది ప్రపంచవ్యాప్తంగా అధిక మొత్తంలో వినియోగిస్తున్నారు. దీనిని చైనీస్ గూస్బెర్రీ అని కూడా అంటారు. కివి యొక్క శాస్త్రీయ నామం ఆక్టినిడియా చినెన్సిస్.కివి ఫ్రూట్ సాధారణంగా చైనా అడవుల్లో సహజసిద్ధంగా పండుతుంది. అయితే కివి ఫ్రూట్స్ ను పండ్ల తోటల సాగులో న్యూజిలాండ్ దేశం అధిక విస్తీర్ణంలో సాగు చేస్తోంది. ప్రస్తుత కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వీటి సాగు చేస్తున్నారు ఇటీవల కాలంలో భారతదేశంలో కూడా కొన్ని అనుకూలమైన ప్రాంతాల్లో కివి ఫ్రూట్ సాగు చేస్తూ అధిక లాభాలను పొందుతున్నారు.

కివి ఫ్రూట్ సాగుకు సమశీతోష్ణ వాతావరణంలో తగినంత తేమ మరియు వేడి కలిగిన ప్రాంతాలు అనుకూలమైనవి. కివి ఫ్రూట్స్ మొక్కలు సముద్ర మట్టానికి 1200 నుంచి1600 మీటర్ల ఎత్తులో భారతదేశంలోని చల్లగా ఉండే పర్వత ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. కివీ సాగులో ఎటువంటి ప్రమాదకర క్రిమిసంహారక మందులు వాడవలసిన అవసరం ఉండదు. వీటిపై వ్యాధుల ప్రభావం చాలా తక్కువ అనే చెప్పాలి.వీటికి అనుకూలమైన వాతావరణం లభిస్తే దాదాపు 25 సంవత్సరాల పాటు అధిక దిగుబడి నిస్తాయి. పైగా కివి ఫ్రూట్ నిల్వ సామర్థ్యం 8 వారాలు ఉండడంతో దాదాపు ప్రపంచ దేశాలన్నింటికీ ఎగుమతి చేయవచ్చు.

కివి ఫ్రూట్ ప్రత్యేకమైన రుచినీ కలిగి అధిక రసంతో తీపి మరియు పుల్లగా ఉండి నారింజ , బత్తాయి పండ్ల కంటే అధిక మొత్తంలో విటమిన్ సి లభించడంతో దీనిని ఆహారంగా తీసుకుంటే వ్యాధినిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు తద్వారా సీజనల్ గా వచ్చే వ్యాధులతో పాటు అనేక రకాల వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చు.కావున రోజువారి ఆహారంలో కివి ఫ్రూట్ ను ఆహారంలో తీసుకోవడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు.

Share your comments

Subscribe Magazine