దేశంలో వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే రైతులకు పెట్టుబడి సహాయం అవసరం ఉంది. రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలులోకి తీసుకువచ్చింది, పంటలకు పెట్టుబడి సాయం, పంట భీమా మరియు రైతులకు పెన్షన్ వంటి ఎన్నో పథకాలను రైతులకు అందిబాటులోకి తీసుకువచ్చారు. ప్రతి పథకానికి ఒక్కో విధమైన ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కిసాన్ క్రెడిట్ కార్డు:
రైతులకు ఉపయోగకరమైన పథకాల్లో కిసాన్ క్రెడిట్ కార్డు స్కీం ప్రధానమైనది. సాధారణంగా రైతులు పెట్టుబడి రుణాల కోసం ఎక్కువుగా వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడతారు. బ్యాంకు రుణాలు పొందడం కాస్త కఠినతరమనే చెప్పవచ్చు. ఈ పరిస్థితిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డు ప్రవేశపెట్టింది, రైతులకు వారి సాగు మరియు ఇతర అవసరాల కోసం ఒకే విండోలో అవసరమైన రుణాన్ని ఈ స్కీం ద్వారా సకాలంలో అధిస్తుంది. వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి పశువులు, చేపల పెంపకం, యంత్రాల కొనుగోలుకు, స్ప్రేయర్లు ఇలా అన్ని అవసరాలకు రుణాలను ఇస్తారు. భూ యజమానులైన రైతులకు మరియు కౌలు రైతులకు ఈ లోన్ పొందే వీలుంటుంది. అంతేకాకుండా మార్కెటింగ్ మరియు ఇంటి అవసరాలకు కూడా రైతులు లోన్స్ తీసుకునే సౌకర్యం ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా లభిస్తుంది.
ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన:
వ్యవసాయంలో అధిక నష్టం రావడానికి వాతావరణం అనుకూలించకపోవడం ఒక కారణం. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు రైతులు పెట్టిన పెట్టుబడి రాని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సమయాల్లో రైతులను ఆదుకునేందుకు 2016 లో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఫసల్ యోజనను(PMFBY) ప్రారంభించారు, ప్రకృతి నష్టాల నుండి పంటను కాపాడుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. ఈ పథకానికి ఇప్పటివరకు దాదాపు 36 కోట్ల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. పంటలకు ప్రీమియం చెల్లించిన రైతులకు, విత్తడానికి ముందు మరియు పంట తరువాత కలిగే నష్టాలకు రైతులకు భీమా అందిస్తారు.
ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్-ధన్ యోజన:
ఇది ఒక స్వచ్చంధ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం, కేంద్ర ప్రభుత్వం ఈ స్కీంను 2019 లో ప్రవేశ పెట్టింది. 2019 ఆగష్టు 31 నాటికి భూరికార్డులలో పేరు కలిగిన రైతులు అందరూ ఈ స్కీంకు అర్హులే. 18-40 సంవత్సరాల వయసున్న రైతులు ఈ స్కీం పొందేందుకు అర్హులే. రెండు హెక్టర్ల లోపు భూమికలిగి ఉన్న చిన్న మరియు సన్నకారు రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు. రైతులు వారి వయసును బట్టి రూ.55 నుండి రూ. 200 వరకు పెన్షన్ ఫండ్ జమ చెయ్యవలసి ఉంటుంది, ఇలా కనీసం 20 ఏళ్ల పాటు చెల్లిస్తే రైతులకు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత నెలకు రూ.3000 పెన్షన్ వస్తుంది.
ప్రధాన మంత్రి కృషి సించాయి స్కీం:
కేంద్ర ప్రభుత్వం 2015 లో ఈ పథకాని ప్రవేశపెట్టింది. వ్యవసాయానికి నీరు ప్రాణాధారం, అయితే ప్రతి సంవత్సరం ఎంతో నీరు వృధా అవుతుంది. నీటి వృథాను తగ్గించడంలో మైక్రోఇరిగేషన్ పద్దతులు ఎంతగానో దోహదపడతాయి. నీటి వినియోగ సామర్ధ్యం పెంచి నీటి వృథాను అరికట్టే లక్ష్యంతో ప్రధాన మంత్రి కృషి సించాయి స్కీం పనిచేస్తుంది. ఈ పధకం ద్వారా 2021-22 సంవత్సరానికి 10 లక్షల హెక్టార్ల పైగా ఎకరాల్లోని భూమిలో మైక్రోఇరిగేషన్ ద్వారా సాగు చేస్తున్నారు.
ప్రధాన్ మంత్రి కృషి సమ్మాన్ నిధి (PM Kisan):
రైతులకు పెట్టుబడి సహాయం అందిచాలన్న లక్ష్యంతో 2018లో మొట్టమొదటి సారి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా సంవత్సరానికి మూడు వాయిదాలుగా రూ.6000 రైతులకు అందిస్తారు. ప్రతి నాలుగు నెలలకు రూ.2000 రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేస్తారు. ఈ స్కీం మొదలుపెట్టిన ఏడాది 2 హెక్టర్ల లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే నగదు ఇచ్చేవారు అయితే 2019 జూన్ 1 నుండి ఈ స్కీం పరిధిని భూమి ఉన్న రైతులందరికీ వర్తింపచేస్తున్నారు.
Share your comments