Horticulture

వక్క సాగుతో రైతులకు అధిక లాభాలు

KJ Staff
KJ Staff

కిళ్ళీ,తాంబూలంలో వినియోగించే వక్కసాగు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో రైతులు అధికంగా సాగు చేస్తారు. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం, గోదావరి జిల్లాల రైతులు వక్కసాగును చేపడుతున్నారు. వక్క తోటకు శ్రమ, చీడపీడలు, పెట్టుబడులు, కూలీల సమస్య చాలా తక్కువ కావటంతో రైతులు దీని సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. కోబ్బరి, కోకో తోటల్లో వక్కను చాలా మంది రైతులు అంతరపంటగా సాగు చేస్తున్నారు. ఒకసారి పెట్టుబడి పెడితే వక్క తోట సిరులు కురిపిస్తోంది

ఎకరానికి 500 వందల వక్క చెట్లను నాటవచ్చు. ఐదేళ్ళ తరువాత కాపుకు వస్తాయి. చెట్లకు అవసరమైన మేరకు నీరు, పేడ, మట్టిని అందిస్తే చాలు. పెద్దగా ఖర్చు చేయాల్సింది లేదు. ధరలు నిలకడగా ఉండటంతో రైతులు నిశ్చింతగా ఉండొచ్చు. ఒక్కసారి పంట సాగు చేస్తే 45 సంవత్సరాల వరకు అదాయం వస్తూనే ఉంటుంది.

బోరుబావులు కలిగిన కొందరు రైతులు, వక్క తోటలపై మక్కువ చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో వక్క క్వింటాలు ధర రూ.48 వేల నుంచి రూ. 52 వేల వరకు పలుకుతోంది. తక్కువ ఖర్చుతో ఎక్కవ అదాయం వస్తుండటంతో రైతులు వక్కసాగు చేపడుతున్నారు.

తక్కువ పెట్టుబడితో ఎక్కవ దిగుబడి వస్తుండటంతో కర్ణాటక నుండి రైతులు వక్కమొక్కలను తెచ్చుకుని సాగు చేస్తున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా రైతులు వక్క సాగువైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు వక్క సాగు చేపట్టారు. వేరుశనగ పంటను సాగు చేసే రైతులు ప్రస్తుతం నెలకొన్నఅతివృష్టి, అనావృష్టి పరిస్థితుల కారణంగా వక్కసాగువైపు మొగ్గు చూపుతున్నారు. 

ప్రస్తుతం అనంతపురం రైతులే స్వయంగా వక్క మొక్కల నారు పెంపకాన్ని చేపడుతున్నారు. సాగు చేయడానికి ముందు ఎండిన ఒలిసిన వక్కను రైతులు తీసుకొచ్చి నారు పోస్తారు. పాలిథిన్‌ కవర్‌ తీసుకుని అందులో విత్తనం వేసి నీరు పోస్తారు. పది రోజుల తరువాత వక్క విత్తనం నుంచి మొక్క బయటికి వస్తుంది. ఇలా సంవత్సరం, రెండు సంవత్సరాల వరకు నీరు, ఎరువు అందించి మొక్కను తోటలో పెంచుతారు. వక్క మొక్క రెండేళ్ల వయసుకు వచ్చిన తరువాత రైతులు తమ పొలాల్లో 5 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పులో నాటుతారు. ఒక ఎకరా తోట నుంచి ఎండబెట్టిన వక్కలు ఆరు క్వింటాళ్ల వరకూ వస్తాయి

వక్క పంట కోత సాధారణంగా జూలై నెలలో ప్రారంభమవుతుంది. డిసెంబర్‌ ఆఖరు వరకు కోస్తారు. నెలకు ఒక సారి పంట కోత ఉంటుంది. పచ్చి గెలలను కోసిన తరువాత వాటి నుంచి వక్కను వేరు చేస్తారు. వక్క వలిచే యంత్రాల సహకారంతో చిప్పను, వక్క ఉండలను వేరు చేస్తారు. అనంతరం నీళ్లలో ఉడకబెట్టి తరువాత 8 రోజుల పాటు ఎండకు ఆరబెట్టి సంచుల్లో నింపి నిల్వ చేస్తారు. మార్కెట్లో మంచి ధర ఉన్నపుడు అమ్మకాలు చేస్తారు. మార్కెటింగ్ విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకపోవటంతో వక్కసాగు బాగుందని రైతులు అంటున్నారు. పెద్దగా ఎరువులు వేయాల్సిన అవసరంలేకపోవటంతో పెట్టుబడులు పెట్టాల్సిన పనిలేదంటున్నారు. వ్యాపారులే తోటల వద్దకు వచ్చి పండించిన వక్కలను కొనుగోలు చేస్తున్నారు. దేశీయంగా వక్కకు మంచి డిమాండ్ ఉండటంతో రైతుకు ఇది లాభసాటి పంటగా చెప్పవచ్చు.

Share your comments

Subscribe Magazine