Horticulture

అధిక దిగుబడిని అందించడంతోపాటు, తెగుళ్లను కూడా తట్టుకునే "ఆర్కా రక్షక్" టమాటా

KJ Staff
KJ Staff

కూరగాయల సాగులో టమోటా సాగు అగ్రగామిగా ఉందని చెప్పుకోవచ్చు. మన దేశంలోని ఎన్నో వేల ఎకరాల్లో టమాటో సాగు జరుగుతుంది. మన వంటకాల్లో కూడా టొమాటకు విడదియ్యలేని బంధం ఉంది. అయితే టమాటా ఈ దేశానికి చెందినది కాదు, పైగా ఇది ఒక కూరగాయకుడా కాదు. దక్షిణ అమెరికాలో పుట్టిన ఈ టమాటాను, దానియొక్క లక్షణాలు బట్టి పండుగా పరిగణిస్తారు. టొమాటలో పోషకవిలువలు కూడా అధికంగా ఉన్నాయి.

టమోటాను మార్కెట్లో లభించే ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించిన్నపటికి రైతులు టమాటా పంటను సాగు చెయ్యడానికి మొగ్గు చూపుతారు. టమాటా పంట తరచు చీడపీడల భారిన పడే పంట కాబట్టి, రైతులు రకాలను ఎంపిక చేసుకోవడంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. ఆర్కా రక్షక్ టమాటను, ఉత్తమమైన రకంగా పరిగణిస్తారు. ఆర్కా రక్షక్ హైబ్రిడ్ రకం సాగు చెయ్యడం ద్వారా రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆర్కా రక్షక్ టమాటాను బెంగుళూరు లోని జాతీయ ఉద్యాన సంస్థ విడుదల చేసింది. ఈ రకం టమాటా అధిక దిగుబడులు ఇవ్వడంతోపాటు, చీడపీడలను కూడా సమగ్రవంతంగా తట్టుకోగలదు.

ఆర్కా రక్షక్ హైబ్రిడ్ రైతులకు ఒక వరం వంటిది అని చెప్పుకోవచ్చు. ఈ రకం విత్తనం ఎకరానికి 25-30 గ్రాములు సరిపోతుంది. విత్తనాలను ముందుగా ట్రేలలో పెంచి తరువాత ప్రధాన పొలంలో నాటుకుంటే, ఎన్నో రకాల చీడపీడలను తట్టుకోగలదు. పంట నాటిన 140-150 రోజుల మధ్యలో పంట చేతికి వస్తుంది. ఒక్కొక్క చెట్టు నుండి 18-20 కేజీల వరకు దిగుబడి సాధించేందుకు అవకాశం ఉంటుంది, ఈ విధంగా ఎకరానికి సుమారుగా 40-50 టన్నుల వరకు వస్తుంది. మిగిలిన రకాలతో పోలిస్తే ఆర్కా రక్షక్ నిల్వ సామర్ధ్యం ఎక్కువ. కోత కోసిన తరువాత 15 రోజుల వరకు కాయ నిల్వ ఉంటుంది, కాబ్బటి సుదూర ప్రాంతాల్లోని మార్కెట్లోకి కూడా సులభంగా తరలించవచ్చు.

అయితే ఆర్కా రక్షక్ హైబ్రిడ్ రకం సాగు చేసే రైతులు కొన్ని రకాల మెళుకువలు పాటిస్తే ఆశించిన రతిలో నాణ్యమైన దిగుబడి పొందేందుకు అవకాశం ఉంటుంది. డ్రిప్ విధానంలో సాగు చెప్పటడం ద్వారా నీటి వృథాను తగ్గించవచ్చు. అంతేకాకుండా డ్రిప్ సహాయంతో ఫెర్టిగేషన్ పద్దతి ద్వారా ఎరువులను అదించవచ్చు, దీని మూలంగా దిగుబడులు పెరుగుతాయి. టమాటాలో ఎక్కువగా వచ్చే ఎండు తెగులు, ఆకు ముడత తెగులు, బ్యాక్తీరియా తెగుళ్ళని ఈ రకం సమగ్రవంతంగా తట్టుకోగలదు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ రకాన్ని మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులతోపాటు, పంజాబ్, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లో కూడా విస్తృతంగా సాగు చేస్తున్నారు.

Share your comments

Subscribe Magazine