Horticulture

గోరుచిక్కుడు సాగులో పాటించవలసిన యాజమాన్య పద్దతులు....

KJ Staff
KJ Staff

శరీరానికి ఎన్నో పోషకాలు, మరియు ఫైబర్ అందిచే కూరగాయల్లో గోరుచుక్కుడు ఒకటి. గోరుచిక్కుడు నుండి సేకరించే జిగురుకు వాణిజ్య పరంగా కూడా మంచి డిమాండ్ ఉంది. గోరు చిక్కుడు అధిక ఉష్ణోగ్రతలను సైతం తట్టుకొని నిలబడగలిగే పంట. నీటి లభ్యత తక్కువగా ఉన్న, కరువు ప్రాంతాల్లో కూడా గోరుచిక్కుడు పెరుగుతుంది. గోరుచిక్కుడును కేవలం కూరగాయగానే కాకుండా, పశువులకు మెతగాను, మరియు గింజలను పశువులకు దాణాగా వాడతారు.గోరుచిక్కుడు మొక్కలను పచ్చిరొట్ట ఎరువుగా మరియు కొన్ని ఔషధాల్లోనూ విరివిగా వినియోగిస్తారు. గోరుచిక్కుడు గింజల నుండి జిగురు తయారుచేస్తారు, దీనిని బట్టలు, పేపర్ పరిశ్రమలో వినియోగిస్తారు.

ప్రపంచం మొత్తంలో 7-10 లక్లల టన్నుల జిగురు గోరుచిక్కుడు గింజల నుండి తయారుచేయబడుతుంది. కావలసిన గోరు చిక్కుడు గింజలు ఎక్కువగా భారతదేశం నుండి ఉత్పత్తి అవుతోంది. అమెరికాలో పెట్రోల్‌ పరిశ్రమలో సుమారుగా 40 వేల టన్నుల జిగురును వాడుతున్నారు. ఎందుకంటే ఈ జిగురును వాడడం వల్ల వాతావరణం, నీరు కలుషితం కాకుండా ఉంటుంది. 2012,2013 లో అమెరికా భారతదేశం నుండి సుమారుగా 60 శాతం జిగురును దిగుబడి చేసుకున్నారు. దీన్ని అనుసరించి అన్ని దేశాల గోరు చిక్కుడు జిగురును దిగుమతి చేసుకుంటున్నాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న గోరుచిక్కుడు సాగు వివిధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గోరుచిక్కుడు సాగుకు, ఒండ్రునేలలు, ఇసుక నేలలు అనుకూలంగా ఉంటాయి. నీరు నిలిచిపోయే నేలలు, మరియు అధిక సాంద్రత కలిగిన బరువైన నేలలు పనికిరావు. నేల ఉదజని సూచిక 7.0-8.0 మధ్యలో ఉండేలా చూసుకోవాలి. విత్తుకునే ముందు, నేలను బాగా చదును చేసుకోవాలి, నేలమెత్తబడే విధంగా ఒకటి 4-5 సార్లు బాగా దున్నుకోవాలి. గోరుచిక్కుడు బోదె మరియు సాళ్ల పద్దతిలో నాటుకునేందుకు అనువుగా ఉంటుంది. 60 సెంటీమీటర్ల దూరంలో దూరంలో ప్రతి మొక్కకు మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. విత్తనాలు ఎంపిక విషయానికి వస్తే పూసా మౌసమి ఇది ఖరీఫ్‌ పంటకు అనువైనది. గింజ విత్తిన 70 -80 రోజులకు మొదటికోతకు వస్తుంది.

కాయలు 10-12 సెం.మీ పొడవుంటాయి. మొక్క కొమ్మతో ఉంటుంది. పూసా సదాబహార్‌ రకం ఖరీఫ్‌, వేసవి పంటకు అనువైనది. గింజ విత్తిన 45-50 రోజులకే మొదటికోతకు వస్తుంది. కాయలు 12-13 సెం.మీ పొడవుంటాయి. మొక్క కొమ్మతో ఉంటుంది. పూసా నవబహార్‌ రకం దీని కాయలు పూసా మౌసమి మాదిరిగా ఉంటాయి. మొక్క కొమ్మలు లేకుండా ఉంటుంది. ఖరీఫ్‌, వేసవి పంటకు అనువైన రకంగా చెప్పవచ్చు. గౌరీ రకం ఖరీఫ్‌, వేసవి పంటకు అనువైనది.ఖరీఫ్‌ పంటగా జూన్‌, జులై మాసాల్లో వేసవి పంటగా జనవరి రెండవ పక్షం నుండి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకోవాలి. విత్తే ముందు ఒక కిలో విత్తనానికి 5 గ్రా. ఇమిడాక్లోప్రిడ్‌, 8 గ్రా. ట్రైకోడెర్మావిరిడి కలిపి విత్తన శుద్ది చేయాలి.

ఖరీఫ్‌ పంట సాగులో 60 x15 సెం.మీ దూరం, వేసవి పంటలో 45 x 15 సెం.మీ దూరం విత్తు కునేందుకు పాటించాలి. వేసవిలో మొక్క సాంద్రత ఎక్కువగా ఉండేటట్లుగా చూసుకోవాలి. ఎకరాకు 8 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ఎకరాకు 12 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 25 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువు వేసుకోవాలి. సగం నత్రజని పూర్తి భాస్వరం, పొటాష్‌నిచ్చే ఎరువును ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. మిగిలిన సగభాగం నత్రజని విత్తిన 30-40 రోజులకు వేసుకోవాలి.కలుపు నివారణకు పెండిమిథాలిన్‌ మందును ఎకరాకు 1.25 లీ., అలాక్లోర్‌ 1 లీ. తేలిక నేలలు 1.25 లీ. (బరువు నేలలు) చొప్పున 200 లీ. నీటిలో కలిపి నాటిన 48 గంటలోపు పిచికారి చేయాలి. తడినేలపై పిచికారి చేయాలి. 30 రోజులకొకసారి గొర్రు తవ్వి అంతరకృషి చేయాలి. గింజలు విత్తగానే నీరు పారించాలి. మూడవ రోజు మరల ఇవ్వాలి.

ఆ తరువాత ప్రతి 4-10 రోజుల కొకసారి నీటి తడులివ్వాలి. చిన్న పెద్ద పురుగు లేత చిగుళ్ళు ఆకు నుండి రసం పీల్చి నష్టం కలిగిస్తాయి. వీటి నివారణకు డైమిథోయేట్‌ లేదా మిథైల్‌డెమటాన్‌ లేదా పాసలోన్‌ లేదా పిప్రోనిల్‌లోని ఏదైనా ఒక మందును 2 మి.లీ లీటరు నీటికి కలిపి మందు మారుస్తూ పిచికారి చేయాలి.ఆకు మీద నల్లని మచ్చలు ఏర్పడి తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు మచ్చలన్నీ కలిసిపోయి ఆకులు మాడిపోయి రాలిపోతాయి. దీని నివారణకు మాంకోజెబ్‌ 3 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఎండు తెగులు సోకితే మొక్కలు నిలువుగా ఎండిపోతాయి.

దీని నివారణకు ట్రైకోడెర్మా విరిడి 8 గ్రా. విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. కిలో ట్రైకోడెర్మావిరిడి, 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలో వేప పిండితో కలిపి వారం రోజులు నీడలో మాగనిచ్చి ఆఖరిదుక్కిలో వేసుకోవాలి. తెగులు ఇతర మొక్కలకు వ్యాప్తి చెందకుండా 3 గ్రా. కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ లీటరు నీటికి కలిపి మొక్క చుట్టూ నే తడిచేలా పొయ్యాలి. పంట మార్పిడి పాటించాలి. లేత కాయలను కోసి మార్కెట్‌కు పంపాలి. ముదిరిన కాయల్లో పీచుశాతం ఎక్కువై కాయ నాణ్యత తగ్గుతుంది. ఒక ఎకరాకు 20-25 క్వింటాళ్ళు వస్తుంది. ఒక శాతం ఉప్పు ద్రావణంలో గోరుచిక్కుడు కాయల మొక్కను ముంచి 10 నిమిషాల తరువాత తీసి ఆరబెట్టాలి.

Share your comments

Subscribe Magazine