Horticulture

సిరులు కురిపిస్తున్న అనంత పంటలు.. ఎలా అంటే?

KJ Staff
KJ Staff

రాయలసీమ అంటే కరువు, కాటకాలకు నిలయం. రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం జిల్లా తీవ్రమైన కరువు కాటకాలు ఎదుర్కొంటుందని చెప్పవచ్చు. అయితే కరువు కాటకాలకు నిలయంగా మారిన అనంతపురం జిల్లాలో గత రెండు సంవత్సరాల నుంచి ఉద్యానవన పంటలు సిరులు కురిపిస్తున్నాయి. తీవ్ర కరువు కాటకాలతో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఈ జిల్లాలో రైతులు వ్యవసాయ పనులను కొనసాగిస్తూ తీవ్రంగా నష్ట పోయే వారు.అయితే ప్రభుత్వం నుంచి రైతులకు సహాయ సహకారాలు అందడంతో పాటు సబ్సిడీ కింద వ్యవసాయ పరికరాలను అందించడంతో రైతులు ఉద్యానవన పంటల బాట పట్టారు.

యాపిల్, కివి వంటి పండ్లు మినహా జిల్లాలో అన్ని రకాల పండ్లు, పువ్వులు, కూరగాయల సాగులను ఉత్పత్తి చేస్తూ రాష్ట్రంలోనే మొదటి జిల్లాగా పేరు పొందింది. ఉద్యాన శాఖ గణాంకాల ప్రకారం ప్రతి ఏటా 50 నుంచి 52 లక్షల టన్నుల వరకు ఫలసాయం వస్తుండగా. ప్రతి సంవత్సరం 10 వేల కోట్లకు పైగా టర్నోవర్ అవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. అనంతపురం జిల్లాలో చీనీ, ద్రాక్ష , దానిమ్మ, బొప్పాయి, చింత, రేగు, బెండ, గులాబీ, కనకాంబరం తోటల విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఉండగా అరటి, మామిడి, కర్బూజా, కళింగర , మిరప, టమాటా, వంగ, ఉల్లి, బంతి తదితర తోటల సాగులో రెండో స్థానంలో ఉంది.

గత కొన్ని నెలల నుంచి అనంతపురం జిల్లా నుంచి మేలిరకం అరటి పండ్లు గల్ఫ్ దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. ఈ క్రమంలోనే అరటికి మంచి గిట్టుబాటు ధర ఉండడంతో రైతులు కూడా అరటి పంట సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. అదేవిధంగా ఉద్యానవన పంటలను సాగు చేయడానికి ఇక్కడ వాతావరణం నేలలు ఎంతో అనుకూలమని, ఇక్కడ పండించే పండ్లు కూరగాయలు రుచి, నాణ్యత, పోషకాలు అధికంగా ఉండటంతో వీటిని దూర ప్రాంతాలకు ఎగుమతి చేయడానికి కూడా వీలుగా ఉంటుందని ఉద్యాన శాఖ అధికారులు సతీష్, చంద్రశేఖర్ తెలిపారు.

Share your comments

Subscribe Magazine