Horticulture

పామ్ఆయిల్, కొబ్బరి తోటల్లో తెల్లదోమను నివారించడం ఎలా?

KJ Staff
KJ Staff

కొబ్బరి, ఆయిల్‌ పామ్‌ తోటలకు రూగోస్‌ తెల్లదోమ బెడద రోజురోజుకు తీవ్రతరమౌతుంది. ఇప్పటికే దీని నివారణకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏమాత్రం ఫలితం ఉండటంలేదు. గత కొన్నేళ్లుగా దీనివల్ల తీవ్రపంటనష్టం వాటిల్లుతోంది. రూగోస్ తెల్లదోమ ఆశించకుండా ముందస్తుగా తోటల్లో రెక్కల పురుగులను (బదనికలు) వదలటం ద్వారా వాటి నివారణకు ప్రభుత్వ పరిశోధనా సంస్థల శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ తెల్లదోమ ఉధృతి ఏటా పెరుగుతూనే ఉంది.

తెల్లదోమ వల్ల గడచిన మూడేళ్లలో కొబ్బరిలో సుమారు 30 శాతం దిగుబడి కోల్పోయినట్టు అంచనా. కాయ సైజు కూడా తగ్గింది. తెల్లదోమ ఆశించిన ఆయిల్‌ పామ్, అరటి, పనస తదితర చెట్లు బలహీనపడుతున్నాయి. దిగుబడిలో తగ్గుదల కనిపిస్తున్నది.రూగోస్‌ తెల్లదోమ సోకితే పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. తెల్లదోమ నివారణకు వేపనూనె, గంజి ద్రావణం పిచికారీ చేయడం, పసుపురంగు జిగురు అట్టలు ఏర్పాటు చేయాలని ఉద్యాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇటీవలి కాలంలో రూగోస్‌ కన్నా ప్రమాదకరమైన తెల్లదోమ సంతతికి చెందిన బొండార్స్‌ నెస్ట్‌ ఫ్లై కూడా కొబ్బరి తోటలను ఆశిస్తోంది. తెల్లదోమ కన్నా ఇదే ఎక్కువ ప్రమాదకరమని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. దీని వల్ల తోటల యజమానులకు తీవ్రనష్టం కలుగుతుంది. అరటి, పనస, జామ వంటి చెట్లను మాత్రమే కాకుండా నర్సరీలలోని అలంకరణ మొక్కలను సైతం ఆశిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

రూగోస్‌ తెల్లదోమ సోకిన కొబ్బరి, పామాయిల్‌ చెట్ల ఆకులపై రైతులు పిన్‌ చేసుకోవాలి. ఆ గుడ్ల లో నుంచి వెలువడే బదనికలు తెల్లదోమ గుడ్లను తింటూ ఉధృతిని అరికడతాయి. తోటల్లో తెల్లదోమ ఉధృతిని బట్టి చెట్ల ఆకులపై బదనికల గుడ్లను పెట్టుకోవాలి. ఆకుకు ఐదు నుంచి పది రూగోస్‌ తెల్లదోమ వలయాలు ఉంటే రెండు గ్లుడ్లు చాలు. పది హేను రోజుల వ్యవధిలో రెండుసార్లు పెడితే మంచి ఫలితం ఉంటుంది. ఈ రకం బదనికలు బొప్పాయి, మందార చెట్టు మీద ఆశించే రసం పీల్చే పురుగులు పేనుబంక, పిండినల్లిని కూడా తింటున్నాయి. పాలీహౌస్‌లలో కూడా ఇవి సమర్ధవంతంగా పనిచేస్తున్నాయి. వెయ్యి గుడ్లను రూ.150కు పరిశోధనా స్థానం రైతులకు అందజేస్తుంది.

ఇప్పటికే అంబాజీపేట ఉద్యాన పరిశోధనా స్థానం బయోల్యాబ్‌లో బదనికలను ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ ఏటా 45 లక్షల వరకు బదనికలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిని రైతులకు తక్కువ ధరకు అమ్ముతున్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళలకు చెందిన యూనివర్శిటీలు, ఉద్యాన, వ్యవసాయ శాఖలు, రైతులు ఇక్కడి నుండి రెక్కల పురుగు బదనికలను తీసుకెళ్తున్నారు. వీటికి డిమాండ్‌ అధికంగా ఉండటంతో తాడేపల్లిగూడెం వద్ద వెంకట్రామన్నగూడెంలోని డా. వైఎస్సార్‌ విశ్వవిద్యాలయం ఆవరణలో, శ్రీకాకుళం జిల్లా సోంపేట లోనూ ఈ ఏడాది నుంచి బదనికల ఉత్పత్తిని ప్రారంభించారు.

బదనికల ఉత్పత్తికి బయోల్యాబ్‌ నెలకొల్పిన దేశంలోనే తొలి రైతు ఉత్పత్తిదారుల సంఘంగా ‘గిఫ్ట్‌’ అరుదైన ఘనత సాధించనుంది. ఉద్యాన శాఖ సహకారంతో డిసెంబరు మొదటి వారం నుంచి బదనికలను ఉత్పత్తి చేయనుంది. తెల్లదోమ నివారణకు కోనసీమ రైతులకు నాణ్యమైన వేప నూనె, జీవన ఎరువులు, బదనికలతోపాటు హిస్సారియా కల్చర్‌నూ అందిస్తోంది.

Share your comments

Subscribe Magazine