Horticulture

బొప్పాయి నారుమల్లో పెంచే రైతులు పాటించవలసిన జాగ్రత్తలు....

KJ Staff
KJ Staff

మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బొప్పాయి పంటను విరివిగా సాగుచేస్తున్నారు, ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో దీని సాగు లాభదాయకం. మేలైన యజమాన్య చర్యలు మరియు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటను పండిస్తే మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. బొప్పాయిని సాగు చెయ్యడానికి అన్ని కాలాలు అనుగుణమే కాబట్టి సంవత్సరం మొత్తం దిగుబడి పొందే అవకాశం ఉంటుంది.

బొప్పాయి సాగు విస్తీర్ణంలోనూ మరియు దిగుబడిలోనూ బొప్పాయి భారత దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. మన దేశంలో బొప్పాయిని పండించే రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిస్సా, మధ్య ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, అస్సాం వంటి రాష్ట్రాలు ప్రధానమైనవి. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 25 వేల ఎకరాల్లో బొప్పాయి సాగవుతోంది.

సరైన యజమాన్య పద్దతులు పాటిస్తే ఏడాది మొత్తం ఫలసాయాన్ని అందించి రైతులకు నికర ఆదాయం అందిస్తుంది. బొప్పాయి నారుమడిని నాటేందుకు ప్రస్తుతం మంచి సమయం, అయితే మొక్క ఎదిగే సమయంలో పిండి నల్లి మరియు వేరు కుళ్ళు తెగులు ఎక్కువుగా ఉంటుంది. ప్రధాన పొలంలో మరియు నర్సరీల్లో కూడా నారుకుళ్ళు తెగులు ఎక్కువుగా ఆశించి రైతులకు నష్టాన్ని మిగులుస్తుంది. ఈ తెగులు ఆశించిన మొక్కలు మొదళ్ళు మెత్తగా మారి, వేర్లు కుళ్లిపోతాయి. ఒక సంవత్సరం లోపు వయసున్న మొక్కలకు ఈ తెగులు ఉదృతి ఎక్కువ.

నారుమొక్కల్లో నారుకుళ్లు తెగులును నివారించడానికి కొన్ని పద్దతులున్నాయి. ముందుగా పైరు పెంచడానికి ఉపయోగించే మట్టిని జాగ్రత్తగా ఎంచుకోవాలి. చాలా మంది రైతులు కేవలం నల్ల మట్టినే కవర్లలో నింపి నారును పెంచుతారు, దీని వలన మొక్కల మొదళ్ళ వద్ద నీరు నిలిచి ఈ వ్యాధికి కారణమవుతుంది. పైరు పెంచేందుకు ఎర్ర మట్టి, నల్ల మట్టి మరియు పశువులు ఎరువును వీటన్నిటిని కలిపి ఉపయోగించడం ద్వారా మట్టి గుల్లబారి నీరు నిలవకుండా ఉంటుంది. నారుకుళ్లు తెగులు ఎక్కువుగా ఉన్న ప్రాంతాల్లో 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేప పిండి, ట్రైకోడెర్మా వీరిది 1 కిలో మరియు 10 కిలోల యూరియా కలిపినా మిశ్రమాన్ని మొక్కల పెంపకానికి వినియోగించాలి, దీని ద్వారా వ్యాధిని నియంత్రించవచ్చు. నారుకుళ్లు ఆశించిన సమయంలో ఫోస్టయిల్ ఏఎల్ 2 గ్రాములు లేదా రీడొమిల్ 2 గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి, మొక్క మొదళ్ళు బాగా తడిచేలా పిచికారీ చెయ్యాలి.

బొప్పాయి నారుని పెంచే రైతులు ఎదుర్కునే సమస్యల్లో పిండి నల్లి కూడా ప్రధానమైనది. మొక్క ఎదిగే సమయంలో పిండి నల్లి ఆశించి ఆకుల్లో రసాన్ని పీల్చి ఆకులు ముడుచుకుపోయేలా చేస్తుంది. దీనివలన మొక్కలో ఎదుగుదల లోపం కనిపిస్తుంది. పిండి నల్లి ఆశించినప్పుడు దాని శరీరం నుండి తేనే వంటి ద్రవాన్ని విడుదల చేస్తుంది, ఈ ద్రవం చీమల్ని మరియు కొన్ని రకాల సిలింద్రల్ని ఆకర్షిస్తుంది. పిండి నల్లి శరీరంపై పిండి వంటి జిగట పదార్ధం ఉండటం వలన పురుగుమందులతో నివారించడం సాధ్యం కాదు. కాబట్టి ముందుగా 10 లీటర్ల నీటికి ఒక ఐదు షాంపూ ప్యాకెట్లు కలిపి పిచికారీ చేసినట్లైతే ఈ జిగురువంటి పదార్ధం తొలగిపోతుంది దీని తరువాత డైమిథోయేట్ 2 మిల్లిలీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే పిండి నల్లి సమస్య తొలగిపోతుంది. దీనితోపాటుగా 5 మి.లి వేపనూనెను ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేస్తే పిండినల్లిని సమగ్రవంతంగా నివారించవచ్చు.

Share your comments

Subscribe Magazine