ఉద్యాన పంటల సాగులో సపోటాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మిగిలిన ఉద్యాన పంటల్లాగా కాకుండా సపోటా తక్కువ ఖర్చుతో అధిక లాభాలను అందిస్తుంది. సపోటసాగు రైతులకు మంచి ఆదాయ వనరుగా నిలుస్తుంది. అయితే సపోటా చెట్లను కొన్ని రకాల చీడపీడలు పట్టి పిడిస్తాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సపోటా సాగు రైతులకు ఎంతో లాభదాయకం. ఎందుకంటే సపోటాను ఒక్కసారి నాటితే సుమారు 50-60 సంవత్సరాల పాటు దిగుబడి వస్తుంది. సపోటా ఏడాదికి రెండుసార్లు దిగుబడినిస్తుంది. గోధుమ రంగులో ఉండే సపోటాను తినడానికి ఎంతోమంది ఇష్టపడతారు కాబట్టి వీటికి మార్కెట్లో డిమాండ్ కూడా ఎక్కువుగానే ఉంటుంది. సపోటాలో అనేక రకాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి, వాటిలో కాలిపత్తి రకం, క్రికెట్ బాల్ రకం, కీర్తి బర్తీ రకం, ద్వారాపూడి రకం, పికెయం3, డిహెచ్ఎస్1, డిహెచ్ఎస్2తోపాటు సింగపూర్, విరుధ్, తగరంపూడి, గుత్తి, గువరయ్య వంటి రకాలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. నీరు నిల్వ ఉండని తేలికపాటి నేలలు సపోటా సాగుకు అనుకూలం. ఒక ఎకరంలో సుమారు 40-45 మొక్కలవరకు నాటుకోవచ్చు. సపోటా నుండి మంచి దిగుబడి పొందాలంటే మంచి యజమాన్య పద్దతులు అవసరం.
సపోటాను ఎక్కువుగా ఆశించే పురుగుల్లో మొగ్గతొలచు పురుగు ఒకటి. గులాబీ రంగులో ఉండే ఈ పురుగు, మొక్క పూతపూసిన తరువాత వాటిమీద చేరి పూతను నాశనం చేస్తాయి. లేత మొగ్గలపై చేరి వాటిని తినేసి, ఎంతో నష్టం కలిగిస్తుంది. దీనితోపాటు ఆకు అల్లే పురుగు కూడా సపోటాలో ఎక్కువ నష్టం కలిగిస్తుంది. ఈ పురుగు లేత మరియు ముదురు ఆకులను గుళ్ళుగా చేసుకొని వాటిని తినేస్తాయి. ఆకుల నుండి బయటకి వచ్చిన తల్లిపురుగు, తిరిగి మల్లి గుడ్లను పెట్టి పంటకు నష్టం కలిగిస్తాయి. ఈ పురుగులు పూతతో పాటు కాయలకు కూడా హాని కలిగించి నష్టం కలిగిస్తాయి.
వీటితోపాటు, పిండినల్లి కూడా సపోటాలో ఎక్కువుగా హానికలిగిస్తుంది. పిండినల్లి మొక్క ఎదిగే సమయంలో మొక్కలను ఆశించి, ఎదుగుదల లేకుండా చేస్తుంది. పిండినల్లి ఆకుల మరియు పిందెలను ఆశిస్తాయి దీనివలన అవి రాలిపోతాయి. పిండినల్లి, ఆకులపై విసర్జించడం ద్వారా ఆకులు నల్లగా మారడం గమనించవచ్చు. దీనితోపాటు కాయతొలుచు పురుగులు, కాయలుతొలచి, వాటిలోని గింజలను తిని మొక్కలకు నష్టం కలిగిస్తాయి.
ఈ పురుగులు రాకుండా నివారించడానికి, కొన్ని రక్షణ చర్యలు పాటించవలసి ఉంటుంది. వీటిని నివారించడానికి 2 మిల్లిలీటర్ల ఎండోసల్ఫాన్, లేదా 1.6 మిల్లిలీటర్ల మోనోక్రోటోఫాస్, లేదంటే 3 గ్రాముల కార్బెన్డిజిమ్, ఒక లీటర్ నీటికి కలిపి ఆకులు అన్ని తడిచేలా పిచికారీ చెయ్యాలి. ఈ మందులను మర్చి మర్చి పిచికారీ చెయ్యడం ద్వారా ప్రయోజనం ఉంటుంది. పురుగులతోపాటు తెగుళ్లు కూడా సపోటా సాగులో ఎక్కువ నష్టం కలిగిస్తాయి.
సపోటాలో వచ్చే తెగుళ్లలో ఆకుమచ్చ తెగులు ఒకటి. ఆకులపై వలయాకారంలో చిన్న చిన్న మచ్చలు ఏర్పడి అవి క్రమంగా పెద్దవై ఆకుమొత్తం వ్యాపిస్తాయి. ఈ తెగులు వచ్చిన మొక్కల ఆకులు క్రమంగా రాలిపోతాయి. దీనిని నివారించాడనికి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చెయ్యాలి.
సపోటాలో ప్రధానంగా వచ్చే మరొక్క తెగులులో చెక్క తెగులు ఒకటి. ఈ తెగులు సోకిన మొక్కల కొమ్మలు వంకరగా పెరుగుతాయి, ఇటువంటి కొమ్మల మీద ఆకులకు నీరు అందక ఎండిపోయి రాలిపోతాయి. కొమ్మలు ఎండిపోయి చెక్కలుగా మారతాయి. ఈ తెగులును ముందుగానే గుర్తించి అవసరమైన చికిత్స అందించాలి, దీనిని నివారించడానికి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2.5 గ్రాముల మాంకోజెబ్ ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చెయ్యాలి. ఈ విధంగా అన్ని చీడపీడలకు సరైన యాజమాన్య పద్దతులు సరైన రీతిలో పాటిస్తే మొక్కలు బాగా ఎదిగి మంచి దిగుబడినిస్తాయి.
Share your comments