భారత దేశంలో అరటి పంటకు ఎంతో ప్రాధాన్యత ఉంది, ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో అరటి పంట సాగు విరివిగా జరుగుతుంది. దాదాపు ఏడాది మొత్తం అరటి పంట నుండి దిగుబడి సాదించవచ్చు కాబట్టి రైతులు దీనిని సాగుచేసేందుకు మొగ్గు చూపుతారు. అయితే అరటి పంటలో మెరుగైన యాజమాన్య పద్దతులు పాటించకుంటే భారీగా పంట నష్టం సంభవిస్తుంది. మరీముఖ్యంగా రానున్న వర్షాకాలంలో సమగ్ర యాజమాన్య చర్యలు చేపట్టకుంటే నష్టం సంభవించవచ్చు కాబట్టి రైతులు వర్షాకాలానికి సంసిద్ధం కావాల్సి ఉంటుంది.
అరటి మొక్క కాండం బలహీనమగు ఉంటుంది, వేగంగా వీచే గాలులకు చెట్లు వేర్లతో సహా నేలకొరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి వర్షాకాలం ఆరంభంలోనే అంటే ఈ సమయంలోనే చెట్లకు ఊతం కింద వెదురు కర్రలను ఉపయోగించాలి, వేర్ల వద్ద మట్టిని ఎగదోస్తే చెట్లకు మరింత ఊతం లభిస్తుంది. కోతకు సిద్ధంగా ఉన్న గెలలను ముందుగానే ముందుగానే కోసుకోవాలి. బలమైన గాలులకు ఒరిగిన చెట్ల దగ్గర రెండు పిలకలను వదిలి మిగిలినవి కోసెయ్యాలి, దీని ద్వారా ఆ పిలకలు ఎదిగేందుకు వీలుంటుంది.
సాధారణంగా అరటి చెట్లు ముంపు నెలల్లో పెరగడం చాల కష్టం, ఏ వయసు చెట్టయినా సరే నాలుగు రోజులకంటే ఎక్కువ ముంపునకు గురైతే తిరిగి కోల్కోవడం దాదాపు అసాధ్యమనే చెప్పవచ్చు. ఒకవేళ చెట్లు కోల్కొన్న తిరిగి మామూలుస్థితికి రావడం చాలా కష్టం పైగా దిగుబడి కూడా ఆశించిన రీతిలో ఉండకపోవచ్చు, కనుక అరటి తోటల్లో వర్షపు నీరు నిలవకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చెయ్యాలి , వర్షాలు తగ్గగానే అంతర్ సేద్యం చేస్తే నీరు త్వరగా ఆరిపోయి మొక్కలమీద ప్రభావం తగ్గుతుంది.
రెండు రోజులు నీటమునిగిన తోటల్లో, వీలైనంత తొందరగా నీటిని తీసేసి, చెమ్మ ఆరిన వెంటనే ప్రతి చెట్టుకు 100 గ్రాముల యూరియా మరియు 80 పోటాష్ ఎరువులను అందించాలి, ఇలా చెయ్యడం ద్వారా చెట్లు తొందరగా కోల్కొనేందుకు అవకాశం ఉంటుంది, ఒకవేళ 3 నెలల కంటే తక్కువ వయసున్న పంటలో మూడు అడుగులకంటే ఎక్కువ నీటి ముప్పును గురైతే చెట్లు తిరిగి కోలుకోవడం దాదాపు అసాధ్యం ఇందుకుగాను అటువంటి చెట్లను తీసేసి తిరిగి కొత్త పిలకాలను నాటుకోవాలి.
వర్షం తగ్గినా వెంటనే ఆకులు మరియు గెలలపై 5 గ్రాముల మ్యురేట్ ఆఫ్ పోటాష్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి, కోతకు సిద్దమవుతున్న గెలలను ఆకులతో కప్పిఉంచి 15 రోజుల తరువాత కోసి మార్కెట్ చెయ్యవచ్చు. మట్టిలో తేమ అధికంగా ఉంటె దుంపకుళ్ళు సమస్య తలైతే అవకాశం ఉంటుంది. దీనిని నివారించడానికి 3 గ్రా కాపర్ ఆక్సీక్లోరైడ్ ఒక లీటర్ నీటికి కలిపి మట్టి మొత్తం తడిచేలా పిచికారీ చెయ్యాలి. సిగటొక ఆకుమచ్చ తెగులును అరికట్టడానికి ప్రొపికానోజోల్ 1 మీ .లీ. లేదా మాంకోజెబ్ 2.5 గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి, రెండువారాలకు ఒకసారి మొక్కలపై పిచికారీ చెయ్యాలి. ఈ విధంగా అన్ని యాజమాన్య పద్దతులను సమగ్రవంతంగా పాటిస్తూ మేలైన దిగుబడిని ఆశించవచ్చు.
Share your comments