మన తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశంలోని అన్ని ప్రాంతాల్లో వరిని అధిక విస్తీర్ణంలో పండిస్తున్నారు. భారతీయులు వరి ధాన్యాన్ని ప్రధాన ఆహారంగా స్వీకరిస్తారు. రానున్న ఖరీఫ్ సీసన్ కోసం రైతులు తమ పొలాలను వరి సాగుకోసం సిద్ధంచేస్తున్నారు. అధిక విస్తీర్ణంలో పండించే వరి పంటకు చీడపీడల సమస్య అధికంగా ఉంటుంది. చీడపీడలు వరి దిగుబడిని దెబ్బతియ్యడమే కాకుండా, రైతులకు ఆదనపు భారాన్ని కూడా కలిగిస్తున్నాయి. తెగుళ్లు పంటను ఆశించక ముందే పంట రక్షణ చర్యలు చేపట్టడం మంచిది. ఇలా చెయ్యడం ద్వారా రైతులకు పెట్టుబడి భారం కూడా తక్కువవుతుంది.
మార్కెట్లో నాణ్యమైన వడ్లకు మంచి డిమాండ్ ఉంది. చీడ పీడలు ఆశించిన పంట దిగుబడితో పాటు, నాణ్యత కూడా తగ్గిపోయి తక్కువ ధరకే ధాన్యం విక్రయించవలసి వస్తుంది. చాల మంది రైతులు మంచి దిగుబడులతో కూడిన నాణ్యమైన పంటను పొందడం కోసం విచక్షణ రహితంగా ఎరువులను, పురుగుమందులను వాడుతున్నారు. రసాయన ఎరువులను వాడటం మూలంగా భూమిలో సారం తగ్గిపోతూ వస్తుంది. రసాయన పురుగుమందులు మనం తీసుకునే ఆహారంలో కలిసి కాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణం అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో రసాయన మందులు పంట రోగాల మీద సమర్ధవంతంగా పనిచేయక చీడపీడల బాధ అధికమవుతూవస్తుంది. ఈ పరిస్థితిని నియంత్రించడానికి సమగ్ర సస్య రక్షణ చర్యలు పాటించడం చాల కీలకం.
వరి పంటను నాటే ముందు భూసార పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి, కనీసం రెండేళ్లకు ఒకసారైనా భూసార పరీక్ష జరిపించాలి. భూసార పరీక్షలు జరిపించడం ద్వారా మట్టి ఉన్న పోషకాలు, మరియు లోపాలను గుర్తించడానికి వీలుగా ఉంటుంది. ఈ రిపోర్ట్ ఆధారంగా వరి పంట యాజమాన్య పద్దతులకు ప్రణాళిక సిద్ధం చెయ్యవచ్చు. వరి పండిస్తున్న రైతులు రసాయన ఎరువులు అధిక వినియోగించడం వలన మన నెలల్లో కార్బన్ శాతం చాల తగ్గిపోయింది అని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. భూమిలో కార్బన్ శాతాన్ని పెంచేందుకు, పశువుల ఎరువులు కానీ పచ్చి రొట్ట ఎరువులు వినియోయోగించాలి. ఈ వేసవి సమయంలో లోతు దుక్కులు దున్ని, పంట అవశేషాలను నిర్ములించడం ద్వారా, పంట రోగాలను తగ్గించవచ్చు.
వరి చేలల్లో పెరిగే కలుపు మొక్కలు కొన్ని రకాల పురుగుల్ని, శిలింద్రాలను ఆకర్షిస్తాయి కనుక, సమగ్ర కలుపు నివారణ చర్యలను చేపట్టాలి. కేవలం పొలంలోనే కాకుండా పొలం గట్లపై పెరిగే కలుపు మొక్కలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చీడపీడలకు తట్టుకునే మేలు వరి రకాలను ఎంచుకోవడం ఉత్తమం. వరి ప్రధానంగా పట్టి పీడించే సుడి దోమ, అగ్గితెగులు వంటి వాటిని తట్టుకుని నిలబడగలిగే రకాలను ఎంచుకోడం ద్వారా రైతులపై అదనపు భారం తగ్గుతుంది. స్వల్పకాలిక రకాలను సాగుచేసే రైతులు, నాట్లు ఆలస్యం కాకుండా జాగ్రత్త వహించాలి.
Share your comments