Kheti Badi

ప్రొద్దుతిరుగుడు సాగులో మేలైన సస్యరక్షణ చర్యలు....

KJ Staff
KJ Staff

మన తెలుగు రాష్ట్రాల్లో నూనె గింజల సాగులో వేరుశెనగ తర్వాత అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న పంటల్లో ప్రొద్దుతిరుగుడు పంట సాగు ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. అన్ని కాలాల్లో సాగుకు అనుకూలంగా ఉండి, తక్కువ పెట్టుబడి, తక్కువ కాలపరిమితి ఉండడంతో చాలామంది రైతులు పొద్దు తిరుగుడు సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రొద్దుతిరుగుడు సాగులో గింజ ఏర్పడే దశలో చీడపీడల సమస్య, పక్షుల సమస్య అధికంగా ఉన్నప్పటికీ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు. ప్రధానంగా ప్రొద్దుతిరుగుడు సాగులో ఎదురయ్యే చీడపీడలు,నివారణ చర్యలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బూడిద తెగులు: తేము ఎక్కువగా ఉండి వేడి వాతావరణంలో బూడిద తెగులు ఎక్కువగా కనిపిస్తుంది. బూడిద తెగులు ఆకులపైన, ఆకుల అడుగుభాగాన బూడిద వంటి పొడితో కప్పబడి ఉంటాయి.తెగులు ఉధృతి ఎక్కువైతే ఆకులు పచ్చబడి రాలిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రాములు నీటిలో కరిగే గంధకపు పొడి లేదా 1 మి.లీ, డైనోకాప్ లేదా 2 మి.లీ, హెక్సాకొనజోల్ కలిపి పిచికారి చేయాలి

రసం పీల్చే పురుగులు: మొక్క 5 నుంచి 6 ఆకుల దశ నుంచి రసం పీల్చే పురుగులు ఆశించే అవకాశం ఉంది.పురుగులు ఆకులలో రసం పీల్చి మొక్కలు గిడసబారి పోయేలా చేస్తాయి.వీటి నివారణకు థయోమిథాక్సామ్ 0.5 గ్రా, 5 మి.లీ. వేప నూనెను లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. అలాగే ఇమిడాక్లోప్రిడ్‌ 8 గ్రా. కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా నాటిన 20-30 రోజుల వరకు రసంపీల్చే పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు

పొగాకు లద్దెపురుగు: పైరు మొదటి దశలో ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయడం వల్ల ఉధృతిని తగ్గించవచ్చు. పురుగు ఉదృతి ఎక్కువగా ఉన్న యెడల నొవాల్యూరాన్ 1 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి లేక విషపు ఎరను 5 కి. తౌడు + 1/2 కిలో బెల్లం + 1/2 లీ. మోనోక్రోటోపాస్ లేక క్లోరిపైరిఫాస్ ఉండలుగా తయారుచేసి సాయంత్రం వేళల్లో పొలంలో అక్కడక్కడ వేయాలి.

నెక్రోసిస్ తెగులు: ఈ తెగులు తామర పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే వ్యాప్తి చెందుతుంది.
తెగులు సోకిన మొక్కల పువ్వులు విచ్చుకోకుండా మెలిక తిరిగి వంకరగా మారుతాయి. వీటి నివారణలో పార్టీనియం కలుపును తీసివేయుట మరియు ఇమిడాక్లోప్రిడ్ 0.4 మి.లీ లేదా థయోమిథాక్సామ్ 0.5 గ్రా. లీటరు నీటికి కలిపి రెండు సార్లు పిచికారి చేసుకున్నట్లయితే తెగులును అదుపులో ఉంచవచ్చు.

శనగపచ్చ పురుగు: మొక్కలు పుష్పించే దశలో పురుగు ఎక్కువగా ఆశిస్తుంది . శనగపచ్చ పురుగు లార్వాలు పువ్వులు, గింజల మధ్య చేరి వాటిని తింటూ తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తాయి. ఈ పురుగు నివారణకు ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను అమర్చాలి. పురుగు యొక్క ఉధృతిని బట్టి ధయోడికార్బ్ 1గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే పురుగు ఉధృతిని సమూలంగా నిర్మూలించవచ్చు.

Share your comments

Subscribe Magazine