Kheti Badi

వెర్మికంపోస్ట్ తయారీలో పాటించవలసిన మెళుకువలు....

KJ Staff
KJ Staff

రసాయన ఎరువుల వల్ల మట్టికి కలుగుతున్న నష్టాన్ని గమనించిన రైతన్నలు, సేంద్రియ పద్దతుల మీద ద్రుష్టి పెట్టడం ప్రారంభించారు. సేంద్రియ ఎరువుల వాడకం వలన మట్టికి మరియు పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు. సేంద్రియ ఎరువులు మట్టిలోని కర్బన శాతాన్ని కూడా పెంచుతాయి. వీటిలో మొక్కకు కావాల్సిన పోషకాలని లభించడం ద్వారా మొక్క ఆరోగ్యంగా ఎదిగి, మంచి నాణ్యమైన దిగుబడి అందించడంలో సహాయపడతాయి.

భూమిని సారవంతం చేసి మొక్కకు కావాల్సిన పోషకాలు అన్ని అందించే సేంద్రియ ఎరువుల్లో వెర్మికంపోస్టు ఒకటి. రసాయన ఎరువుల మూలంగా నిర్జీవమైన భూమిని తిరిగి సారవంతం చెయ్యడంలో వెర్మికంపోస్టు ఎంతగానో సహాయం చేస్తుంది. అయితే ఈ వెర్మికంపోస్టు వానపాముల వ్యర్ధాల నుండి తయారవుతుంది. వానపాములను సాగు చేసి వాటి నుండి వెర్మికంపోస్టు తయారుచేసే ఈ పద్దతిని వెర్మికల్చర్ అని పిలుస్తారు. వ్యవసాయ వ్యర్ధాలను కుళ్లబెట్టి వాటి నుండి వెర్మికంపోస్టు తయారుచేస్తారు.

ప్రస్తుతం ఎంతోమంది ఈ వెర్మికల్చర్ ని తమ వ్యాపారంగా మార్చుకొని మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. వెర్మికల్చర్ యూనిట్స్ ఏర్పరచి రైతులకు వెర్మికంపోస్టు లబ్యత పెంచి, సేంద్రియ వ్యవసాయ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. సేంద్రియ ఎరువుల్లో వానపాముల ఎరువులను ముఖ్యమైనవిగా పరిగణిస్తారు, ఎందుకంటే పశువుల ఎరువుతో పోలిస్తే వెర్మికంపోస్టు లో నత్రజని, బాస్ఫరం, పొటాషియం, కాల్షియమ్, మెగ్నీషియం, జింక్, కాపర్ వంటి ఎరువులు అధికంగా ఉంటాయి. ఈ పోషకాల మూలంగా మొక్కల్లో సమగ్రాభివృద్ధి సాధ్యపడుతుంది.

అయితే వెర్మికంపోస్టు తయారీకి అన్ని రకాల వానపాములను వినియోగించారు. బొరియలు చెయ్యని వాటిని మాత్రమే వినియోగిస్తారు. కంపోస్ట్ తయారుకావడానికి అనుకూలమైన వాతావరణం కల్పించడం అవసరం. ఇందుకోసం కాంక్రీట్ తో బెడ్లు తయారుచేసి, వాటిలో వానపాములని, పంట వ్యర్ధాలను ఉంచుతారు. వానపాములు భూమిలోకి చొచ్చుకుపోకుండా అడుగు భాగాన కాంక్రీట్ తో కప్పి ఉంచుతారు. బెడ్ల మీద నేరుగా సూర్యరశ్మి పడకూడదు, ఇందుకోసం షెడ్లు ఏర్పాటుచేసుకోవాల్సి ఉంటుంది. వెర్మికంపోస్టు తయారీకి చెరుకు, కొబ్బరి, అరటి ఆకులు, కుళ్ళిన పశువుల పేడ, మరియు ఇతర వ్యవసాయ వ్యర్ధాలను వినియోగించవచ్చు. వెర్మికంపోస్టు తయారయ్యేందుకు బెడ్లలో సరైన తేమ మరియు ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. బెడ్లపై రెండు వారాలపాటు నీళ్లు చల్లుకుంటూ 40% తేమ నిలిచేలా చూడాలి.

రైతులు కూడా తమ వ్యవసాయ క్షేత్రాల్లో వెర్మికంపోస్టు తయారుచేసుకోవచ్చు. ప్రతి చదరపు మీటర్ కి 1500 వానపాములు ఉండేలా చూసుకోవాలి. వానపాములను వదిలిన తరువాత బెడ్లలో తేమ ఆరకుండా బెడ్లపై నీటిని చిమ్ముకుంటూ ఉండాలి, అలాగని నీరు అధికంగా ఉన్నాకూడా ప్రమాదమే కాబట్టి, బెడ్లలో 40% మాత్రమే నిలిచేలా చూడాలి. తేమ ఆవిరైపోకుండా గోనెసంచులను తడిపి బెడ్లపై ఉంచాలి. ఇలా రెండు పాటు చేసే వెర్మికంపోస్టు తయారవుతుంది, వెర్మికంపోస్టు తయారైన తరువాత బెడ్లపై నీళ్లు చిలకరించడం మానేస్తే వానపాములు అడుగుభాగానికి చేరతాయి, తరువాత జల్లెడతో కంపోస్ట్ సేకరించి ఆరబెట్టి, విక్రయించవచ్చు.

వెర్మికంపోస్టు తయారయ్యే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. వ్యవసాయ వ్యర్ధాల్లో గాజు ముక్కలు, కోడి గుడ్డు పెంకులు, రాళ్ళూ మొదలైనవి లేకుండా చూసుకోవాలి. దీనితోపాటుగా పక్షులు, వానపాములను తినకుండా ఉండేందుకు బెడ్లను వలతో కప్పి ఉంచాలి. అధికంగా నీరు నిలిచిపోకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి, దీనితోపాటుగా పది రోజులకు ఒకసారి బెడ్లపై పేడ నీళ్లు చిలకరించాలి. రైతులు వెర్మికంపోస్టు వినియోగించడం ద్వారా తక్కువ ఖర్చుతో, పర్యావరణ హితంగా పంటలు పండించడానికి వీలుంటుంది.

Share your comments

Subscribe Magazine