గత నాలుగు దశాబ్ధాల నుండి వ్యవసాయంలో, రసాయన ఎరువులు పురుగుమందులు వినియోగం పెరుగుతూ వస్తుంది. హరిత విప్లవం, దేశ జనాభాను ఆకలి చావుల నుండి తప్పించగలిగింది కానీ, మన ఆహారంలో హానికారక రసాయనాలను కూడా తీసుకువచ్చింది. నేడు ప్రపంచ జనాభాలో అధిక శాతం కాన్సర్ వ్యాధితో భాదపడటానికి ఈ రసాయన ఎరువులు, మరియు పెరుగుమందులు ఒక కారణం. వీటిని ఉపయోగిస్తున్న రైతులు కూడా తీవ్ర అనారోగ్యసమస్యలను ఎదురుకుంటున్నారు. అనేక దేశాలు కొన్ని రకాల పురుగు మరియు కలుపు మందులను ఇప్పటికే వ్యవసాయంలో వాడేందుకు నిషేధిస్తున్నాయి, అయినా సరే రైతులు వాటిని వినియోగిస్తూ, తీవ్ర పరిణామాలను చవి చూస్తున్నారు.
2017 లో మహారాష్ట్రకు చెందిన 63 మంది రైతులు బ్లడ్ కాన్సర్ తో మరణించారు, దీనికి మూలకారణం, దైఫెంతీరున్ అనే పురుగుమందు ప్రభావమేనని కనుగొన్నారు. చాల యురోపియన్ దేశాల్లో ఈ మందును ఇప్పటికే బ్యాన్ చేసారు కానీ మన దేశంలో దీని వినియోగం కొనసాగుతుంది. విచక్షణ రాహిత్యంగా వినియోగిస్తున్న పురుగు మరియు కలుపు మందులు, పర్యావరణంపై, మనుషుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. అయితే ప్రకృతి వ్యవసాయం చెయ్యడం ద్వారా ఈ పరిస్థితిని ఆధిగమించొచ్చని నిపుణులు చెబుతున్నారు.
మన పూర్వికులు రసాయన మందులు అందుబాటులో లేని రోజుల్లోనే, సస్యరక్షణ పద్దతుల ద్వారా చాల రకాల పంటలను పండించేవారు, ఆహారంలో కలుషితం లేకపోవడం మూలాన అప్పట్లో ఆరోగ్య సమస్యలు ఉండేవి కావు. రసాయన మందులు వాడకంలోకి వచ్చాక వాటి వినియోగం పెరిగి మనిషి జీవితకాలం తగ్గిపోతూ వస్తుంది. ఇప్పటికైనా స్పందించి వీటి వినియోగాన్ని తగ్గించకపోతే, భవిష్యత్తు తారల, జీవనం అస్తవ్యస్తమవుతుంది.
ప్రకృతి మనకు అందించిన సహజసిధమైన వనరులను ఉపయోగిస్తూ చేసేది ప్రకృతి వ్యవసాయం. ప్రకృతి వ్యవసాయం, మనిషి ఆరోగ్యంతో పాటు, మట్టికి వాతావరణానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రకృతి వ్యవసాయం రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా వాడే, పశువుల ఎరువు, గోమూత్రం, పంటకు అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా, మట్టిలోకి నీటిని గ్రహించుకునే శక్తిని పెంపొందిస్తుంది. అధికంగా వర్షాలు వచ్చినప్పుడు, మాటి ఈ నీటిని అంత పీల్చుకుని, పంట నష్టపోకుండా చేస్తుంది.
ప్రకృతి వ్యవసాయాన్ని పెంచడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేయవలసి ఉంటుంది. మనిషి ఆరోగ్యానికి, పర్యావరణానికి హాని కలిగించే రసాయన మందులను నియంత్రించడంతో పాటు, ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు పారితోషకం అందించాలి. రైతులుకు ప్రకృతి వ్యవసాయం మీద అవగాహనా కల్పించేందుకు, వివిధ కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రకృతి చేసేందుకు అవసరమైన శిక్షణ కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా అందించాలి. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు ప్రోత్సహాకాలను అందించడం ద్వారా రైతుల్లో చైత్యనం పెరిగి మరింత ఎక్కువ మంది రైతులు ఈ బాటలో నడిచేందుకు వీలుంటుంది.
Share your comments