News

నిన్న ఏపీ సీఎం జగన్.. నేడు ప్రధాని మోదీ.. అన్నదాతలకు తీపి కబురు.

KJ Staff
KJ Staff

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం-కిసాన్‌) కింద ఎనిమిదో విడత పెట్టుబడి సాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం విడుదల చేయనున్నారు. ఈ విడతలో రూ. 19,000 కోట్లను 9.5కోట్ల మందికి పైగా రైతులకు అందించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సాయాన్ని మోదీ విడుదల చేస్తారని పేర్కొంది. ఈ కార్యక్రమంలో భాగంగా కొంత మంది లబ్ధిదారులతో ప్రధాని మాట్లాడుతారని తెలిపింది.

ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ కూడా పాల్గొననున్నారు. రైతులు సాగుచేసే పంటలకు పెట్టుబడి సాయం కోసం 2019లో కేంద్రం పీఎం-కిసాన్‌ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ. 6000 పెట్టుబడి సాయాన్ని మూడు విడతల్లో అందిస్తోంది. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ. 2వేల చొప్పున ఈ సాయాన్ని ఇస్తున్నారు.

ఈ మొత్తం నేరుగా రైతుల ఖాతాల్లోకే బదిలీ చేస్తోంది. కిసాన్‌ సమ్మాన్‌ ద్వారా ఇప్పటివరకు రూ. 1.15 లక్షల కోట్లను అన్నదాతలకు అందించింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి తొలి విడత ఏప్రిల్ నుంచి జులై మధ్య, రెండో విడత ఆగస్టు నుంచి నవంబరు మధ్య, మూడో విడత డిసెంబరు నుంచి మార్చి మధ్య చెల్లిస్తారు. పీఎం కిసాన్ యోజన స్కీమ్ 2019లో ప్రారంభించగా.. తర్వాత దీనిని కొనసాగిస్తూ వస్తున్నారు. పంటల వేసే సమయంలో పెట్టుబడులకు ఇబ్బంది పడకుండా.. రైతుల ఆదాయం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు భరోసా పథకం నిధులను గురువారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒక్కో రైతు ఖాతాకు రూ.5,500 జమ చేసింది. తొలి విడతగా 52.38 లక్షల రైతుల ఖాతాల్లో రూ.3,882.23 కోట్లు జమ చేయనున్నారు. కరోనా కష్టకాలంలోనూ అన్నదాతలకు అండగా ఉండాల‌ని సీఎం జగన్ నిర్ణయించారు.

Share your comments

Subscribe Magazine

More on News

More