News

రైతు రుణమాఫీ పథకానికి రూ.63.05 కోట్లు..!

KJ Staff
KJ Staff

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి వ్యవసాయంలో అండగా నిలవాలని రైతు బంధు, రైతు బీమా ,వ్యవసాయ రుణాల మాఫీ వంటి పథకాలను అమలు చేస్తూ వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 సార్వత్రిక ఎన్నికల సమయంలో రైతు రుణాల మాఫీ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ ప్రకటనకు అనుగుణంగా మొదటి దశలో 25 వేలలోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేయడం జరిగింది. దీంతో దాదాపు 3 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చిన విషయం తెలిసిందే.

ఇటీవలే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రెండో దశలో 50వేల లోపు రుణాలు తీసుకున్న దాదాపు 6 లక్షల మంది రైతులకు 2,006 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు ఆగస్టు చివరి నాటికి పంటల రుణమాఫీ పథకం ప్రక్రియ పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు రైతుల రుణమాఫీ ప్రక్రియ పకడ్బందీగా వేగంగా సాగుతోంది.

తాజాగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి
నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రుణమాఫీ ప్రక్రియ లో భాగంగా ఆరో రోజు రూ.63.05 కోట్లు రైతుల ఖాతాలో జమచేసినట్టు ప్రకటనలో తెలిపారు. అలాగే రెండో దశ రుణమాఫీ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 20,663 మంది రైతుల ఖాతాలకు రుణమాఫీ నిధులు అందినట్టు తెలియజేస్తూ ఇప్పటి వరకూ 94,695 మంది రైతుల ఖాతాలలో రూ.275.31 కోట్లు జమ చేసినట్టు ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆజ్ఞల మేరకు ఈ నెల 30 వరకు 6.08 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తెలియజేశారు.

మంత్రి నిరంజన్ రెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ చిన్న సన్నకారు రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే తెలంగాణ ప్రభుత్వం ముఖ్య లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. రైతులు కూడా సంప్రదాయ పంటలకు స్వస్తి చెప్పి డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తూ అధిక లాభాలను పొందాలని ఆయన సూచించారు.కరోనా విపత్తులో ప్రపంచం విలవిలలాడుతుంటే ధైర్యంగా వ్యవసాయం చేసి ప్రపంచానికి ఆహారం అందించింది అన్నదాతలేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.

Share your comments

Subscribe Magazine