Agripedia

చామంతి పూల సాగులో సస్యరక్షణ చర్యలు....!

KJ Staff
KJ Staff

తక్కువ పెట్టుబడి ,తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలను సమకూర్చే చామంతి పూల సాగును రాష్ట్ర వ్యాప్తంగా రైతు సోదరులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తూ నిలకడైన ఆదాయాన్ని సంవత్సరం పొడవునా ఆర్జిస్తున్నారు. చామంతి పూల సాగు విషయానికొస్తే అధిక సేంద్రియ పదార్థం గల అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. మురుగు నీటి వసతి గల ఒండ్రు నేలలు ఈ పంటకు చక్కటి అనుకూలంగా చెప్పవచ్చు. అధిక వెలుతురు కలిగి ఉష్ణోగ్రతలు సమానంగా ఉన్నప్పుడు చామంతి మొక్కలు ఏపుగా పెరిగి అధిక దిగుబడులను ఇస్తాయి.

సాధారణంగా చామంతి సాగు మే, జూన్ నెలలో చేపడితే ఆగస్టు, అక్టోబర్ నెలల్లో పూలు కోతకు వచ్చి అధిక లాభాలను పొందవచ్చు. చామంతి ముక్కలను ఆరోగ్యంగా ఉన్న తల్లి మొక్క నుంచి పిలకలను లేదా కొమ్మలను సేకరించి వ్యాప్తి చేసుకోవచ్చు. దాదాపు ఎకరాకు 65000 పిలకలు నాటడానికి సరిపోతాయి. అయితే వాతావరణాన్ని బట్టి చామంతి సాగులో వివిధ రకాల తెగుళ్లు అధికంగా వ్యాపిస్తాయి. సరైన సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చు.

సస్యరక్షణ చర్యలు:

ఆకుమచ్చ తెగులు: ఆకులమీద గోధుమ రంగు మచ్చలు వలయాకారపు రింగులుగా ఏర్పడతాయి. సెర్కోస్పొరా ఆకుమచ్చ వలన ఆకుల మీద ముదురు గోధుమ రంగులో గుండ్రని మచ్చలు ఏర్పడి చుట్టూ ఎరుపు వర్ణం కల్గి మధ్యభాగం తెల్లగా వుంటుంది. తెగుళ్ళ నివారణకు లీటరు నీటికి 2.5 గ్రా.మంకోజెబ్ లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటరు నీటికి 3గ్రా. చొప్పున15రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి.

వేరు కుళ్ళు తెగులు: భూమిలో తేమ అధికంగా వున్నపుడు ఈ తెగులు పైరు అన్ని దశలలో కనపడుతుంది.లేత మొక్కలు అర్ధాంతరంగా ఎండిపోయి చనిపోతాయి. ఈ తెగులు నివారణ కి కిలో విత్తనానికి 2గ్రా.ట్రైకోడేర్మా విరిడితో విత్తనశుద్ది చేసి విత్తుకోవాలి.కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా.లేదా కార్బ౦డిజిమ్ 1గ్రా.లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని తెగులు సోకిన మొక్కల పాదుల చుట్టూ నేలపై పోయాలి.

తుప్పు తెగులు : చలికాలంలో తెగులు తీవ్రత ఎక్కువగా ఉండి అధిక నష్టం కలుగ జేస్తుంది.ఆకులపై తుప్పు రంగులో చిన్న చిన్న మచ్చలు ఏర్పడి తర్వాత పై ఆకులకు ,పువ్వులోని పచ్చని భాగాలకు వ్యాపించి ఎరుపు రంగుకు మారి ఎండిపోతాయి.తెగులు నివారణకు మాకోజెబ్ 2గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

Share your comments

Subscribe Magazine