రైతులు పండించే ప్రతి పంటకు కనీస మద్దతు ధర కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం
రైతులు ఎంత విస్తీర్ణంలో ఏ పంటను సాగు చేస్తున్నారు, అనే సమాచారాన్ని పక్కాగా సేకరించాలని రాష్ట్రాల వ్యవసాయ శాఖ ముఖ్య అధికారులకు ఆదేశించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే సాగు విస్తీర్ణం కోటి ఎకరాలు దాటడంతో పంటల వారీగా గణాంకాల సేకరణలో వ్యవసాయశాఖ కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి నుంచి రెవెన్యూశాఖ వద్ద భూముల సర్వే నంబర్ల ఆధారంగా ఏ పంట ఎంత విస్తీర్ణంలో రైతులు సాగు చేస్తున్నారు అన్న విషయాలను వచ్చేనెల 5వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని జిల్లా వ్యవసాయాధికారులను ఆదేశించడం జరిగింది. ఇప్పటికే ఈ సర్వేలో కొన్ని జిల్లా అధికారులు నిమగ్నమై ఉన్నారు.రెవెన్యూశాఖ వద్ద ఉన్న సర్వే నంబర్ల ప్రకారమే భూముల్లో సాగు విస్తీర్ణం లెక్కలుండాలని తేడా వస్తే సహించేది లేదని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది.
రైతుల వారీగా పంట వివరాలను సేకరించడం తో గతేడాది అనేక తప్పులు దొర్లడంతో పంటల కొనుగోలులో ఇబ్బందులు ఏర్పడ్డాయి. అప్పట్లో ఆన్‌లైన్ పోర్టల్‌లో పంట సాగు విస్తీర్ణం, తమ పేరు నమోదు చేసిన రైతుల నుంచి మాత్రమే మొక్కజొన్న కొనాలని మార్క్‌ఫెడ్‌ను ప్రభుత్వం ఆదేశించింది. చాలామంది రైతుల పేర్లు ఆన్‌లైన్‌లో లేవు. కొందరు ఏఈఓలు చేసిన తప్పిదాల కారణంగానే ఈ సమస్య తలెత్తినట్లు అధికారులు గుర్తించారు.
ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికి ఈ సీజన్ నుంచి గ్రామస్థాయిలో ఉండే రెవెన్యూ సహాయకుల నుంచి భూముల సర్వే నంబర్ల సేకరించి గ్రామ స్థాయిలో సర్వే నెంబర్ల వారీగా ఏ రైతు ఎంత విస్తీర్ణంలో ఏ పంటను సాగు చేస్తున్నారు,రైతులు సాగు చేస్తున్న అంతర పంటలను కూడా విడిగా నమోదు చేయాలని అగ్రికల్చర్ ఆఫీసర్స్ కు వ్యవసాయ శాఖ నుంచి ఉత్తర్వులు అందినట్టు తెలుస్తోంది. ఈ విధానం వల్ల రైతులు పండించే ప్రతి పంటకు కనీస మద్దతు ధర లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.
Share your comments