Agripedia

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు.... ఇప్పుడు ఇండియాలోనూ సాగు....

KJ Staff
KJ Staff

వేసవి కాలం వచ్చిందట అందరు ఎదురుచూసేది మామిడి పళ్లకోసమే. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు మామిడిపళ్ళను ఇష్టపడనివారు ఎవరు ఉండరు. అయితే మనం తినే మామిడి పళ్ళ ధర 100-200 రూపాయిల లోపై ఉంటుంది, అల్ఫోన్సో వంటి మేలు రకాలైతే ఈ ధర 500 రూపాయిల వరకు చేరే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైనా మామిడి పళ్ళ ధర లక్షల్లో ఉండడటం విన్నారా, అవును నిజమే జపానుకు చెందిన మియాజాకీ మామిడి ఒక కిలో అక్షరాలా 3 లక్షల రూపాయిలు. వీటిని ప్రపంచంలోనే అత్యంత ఖరీదిన మామిడి పళ్ళుగా పరిగణిస్తారు.

మామిడిని పళ్లలో రారాజుగా భావిస్తారు. వీటి కాలానుగుణమైన లభ్యత, పోషకవిలువలు మరియు రుచి ఆధారంగా మామిడి పళ్ళును పళ్లలో రారాజుగా పరిగణిస్తున్నారు. మామిడి పళ్ళ ఖరీదు మిగిలిన ఫలాలతో పోలిస్తే కాస్త ఎక్కువ, దేశీయ రకాలకంటే విదేశాల నుండి దిగుమతి చేసుకున్న వాటికి డిమాండ్ ఎక్కువ ఉండటంతో వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇలా విదేశల నుండి దిగుమతి చేసుకున్న మామిడి పళ్లలో మియాజాకి రకం మామిడి పళ్ళు, ఒక కిలో ధర అక్షరాలా మూడు లక్షల రూపాయిలు, వీటి రుచి, ఆకృతి మరియు వీటికున్న అమోఘమైన సువాసన వీటికి అత్యుత్తమ ఘనతను సంపాదించిపెట్టాయి.

మియాజాకి రకం మామిడిని, జపాన్ లోని మియాజాకి నగరంలో పండించడం వలన వీటికి ఆ పేరు వచ్చింది. ఇక్కడి మట్టికి ఉండే ప్రత్యేక గుణం మరియు ఇక్కడి వాతావరణంలో మాత్రమే ఈ రకం మామిడిని పెంచడం సాధ్యపడుతుంది. మియాజకి రకం మామిడిని ఇతర రకాలు లాగా ఆరుబయట కాకుండా పోలీహౌస్ లో ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ సాగుచేస్తారు. మొక్క నాటిన దగ్గరనుండి ఎదిగేంతవరకు, వాతావరం మరియు ఇతర ప్రమాణాలను నిర్విస్తూ జాగ్రత్త పాటిస్తారు.

పిందె ఏర్పడిన దగ్గర నుండి కాయ పండేవరకు ఎన్నో జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది, కాయలు చిన్నగా ఉన్నపుడే వీటికి ఎటువంటి హాని తలెత్తకుండా క్యూషన్ మెటీరియల్ తో కప్పేస్తారు. కాయ పెద్దదై, చెట్టు మీదే పండి కిందకి రాలేంతవరకు ఎదురుచూడటం తప్ప వీటిని చేతితో సాగుచేసేందుకు వీలు లేదు. దీని వల్లే వీటికి ప్రత్యేక రుచి లభిస్తుంది. ప్రతి మామిడి ఫలం సుమారు 350 గ్రాముల వరకు బరువు తూగుతుంది.

ఇలా తయారయిన మామిడి పళ్ళను ప్రత్యేక ప్యాకేజింగ్ లో ప్యాక్ చేసి పంపిస్తారు. వీటి రుచితోపాటు వీటి రంగు ఎరుపు రంగులో కూడా విభిన్నంగా ఉంటుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు కనుక వీటి ధర చాల ఎక్కువ ఉంటుంది. వీటిని కొన్ని ప్రత్యేక సందర్భాలు జరుపుకునేందుకు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు.

భరత దేశంలోనూ సాగు:

ఈ రకం మామిడి పళ్ళు కేవలం జపాన్ లోని మియాజాకి ప్రాంత వాతావరణ పరిస్థితులు అనుకూలించడం మూలాన అక్కడ మాత్రమే పెరుగుతాయి, దీని వలన వీటికి ప్రత్యేకమైన రుచి లభించడంతో పాటు, వీటికి అధిక ధర లభిస్తుంది. అయితే ప్రస్తుతం ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో కొంత మంది రైతులు వీటిని పండిస్తున్నారు. వెస్ట్ బెంగాల్ కు చెందిన ఒక రైతు మియాజాకి రకం మొక్కలను బాంగ్లాదేశ్ నుండి దిగుమతి చేసుకొని వాటిని పెంచి, ఒక్కో మామిడి పండును సుమారు పది వేల రూపాయిలుకు విక్రయించడం జరిగింది.

ఇటీవల ఒడిశాలోని, కలహండి జిల్లాకు చెందిన ఒక రైతు, 2023 లో రాష్ట్ర వ్యవసాయ ఉద్యాన విభాగం సహాయంతో ఈ రకం మొక్కలను దిగుమతి చేసుకొని విజయవంతంగా పండిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. ప్రస్తుతం మన దేశంలో ఈ రకం మామిడి పళ్ళ సాగు కొన్ని ప్రాంతాలకే పరిమితమైన, భవిష్యత్తులో విస్తృతంగా సాగుచేసే అవకాశం ఉంది.

Share your comments

Subscribe Magazine