భారతీయ వంటకాల్లో మునగకాయకు ఇప్పడు కాదు ఎప్పటినుండో ఒక ప్రత్యేక స్థానం ఉంది. మునగ చెట్టులో దాదాపు అన్ని భాగాలకు ఏదొక ప్రయోజనం ఉండనే ఉంది. మన వంటకాల్లో భాగమైన మునగకాడల్లో మరియు ఆకుల్లో ఎన్నో పోషకవిలువలు నిక్షిప్తమై ఉన్నాయి. ఇదివరకటి రోజుల్లో కేవలం క్షేత్రస్థాయిలో మాత్రమే గుర్తింపు ఉన్న ఈ పంటకు ఇప్పుడు దేశం మొత్తం ఆధరణ లభిస్తుంది. రైతులు కూడా ఈ పంటను సాగు చెయ్యడానికి మొగ్గు చూపడంతో, ప్రస్తుత కాలంలో మునగ వాణిజ్య పంటగా రూపుదిద్దుకుంది. రైతుల్లో ఆధరణ పెరగడం మరియు మార్కెట్లో కూడా డిమాండ్ పెరగడంతో మునగలో ఎన్నో కొత్త రకాలు అందుబాటులోకి వచ్చాయి, వాటిలో కొన్ని ప్రామాణికమైన రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పీకెఎం-1:
ప్రస్తుతం మార్కెట్లో అధిక దిగుబడినిచ్చే పంటల్లో పీకెఎం-1 రకం ఒకటి. ఈ రకాన్ని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసింది. ఈ రకం ప్రత్యేకత ఏమిటంటే, నాటిన 90-100 రోజుల్లోనే పూతకు రావడం దీని యొక్క ప్రత్యేకత, ఈ రకం మొక్కలు సుమారు 6-7 మీటర్ల ఎత్తు పెరుగుతాయి. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే నాటిన 160 రోజుల్లోగా మొదటికోత లభిస్తుంది. ప్రతి చెట్టుకు సుమారు 220 కాయలు కాస్తాయి, కాయపొడవు సుమారు 75 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది, ఈ రకం నుండి హెక్టారుకు సుమారు 50 టన్నుల దిగుబడి పొందవచ్చు. కాయలతో పాటు ఆకులను కూడా మార్కెట్ చేసుకునేందుకు వీలుగా వార్షిక మునగాకు సాగుకు అనుకూలంగా ఈ వెరైటీ ఉంటుంది.
పీకెఎం-2:
ఈ రకం మునగను కూడా తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు అభివృద్ధి చేసారు. ఈ రకం విత్తనం నాటిన ఆరునెలల్లోగా మొదటిపూత పూస్తుంది. అయితే పీకెఎం-1 రకంతో పోలిస్తే పీకెఎం-2 రకం కాయలు పొడవుగా మరింత ఎక్కువ బరువుతో ఉంటాయి. ఈ రకంలో కాయలు 126 సెంటీమీటర్ల పొడవు మరియు 280 గ్రాముల బరువు ఉంటాయి, ఒక హెక్టారు నుండి సుమారు 100 టన్నుల దిగుబడి లభిస్తుంది.
ధనరాజ్:
ఈ రకం విత్తనాన్ని కర్ణాటక కెఆర్సి ఉద్యాన కళాశాల వారు తయారుచేసారు. మిగిలిన రకాలతో పోలిస్తే ధనరాజ్ రకం చెట్లు పొట్టిగా ఉంటాయి దీనిని వలన ఎకరాకు మరిన్ని ఎక్కువ చెట్లను నాటుకోవచ్చు. నాటిన 9 నుండి 10 నెలల్లోగా పూతకు వస్తుంది, ప్రతి చెట్టునుండి 250 నుండి 300 వరకు కాయలు వస్తాయి, కాయ పరిమాణం సుమారు 35-40 సెంటీమీటర్ల పొడవుంటుంది.
జాఫ్న:
ఈ రకం మునగకాయ గుజ్జు మెత్తగావుండే కారణంగా ప్రజలు దీనిని ఇష్టంగా తింటారు, కనుక రైతులు కూడా ఈ రకాన్ని అధికమొత్తంలో సాగుచేస్తున్నారు. అంతేకాకుండా ఇది బహువార్షికా మునగ రకం, నాటిన మొదటిసంవత్సరం ఒక్కో చెట్టుకు 80 నుండి 90 కాయలే కాస్తాయి అయితే నాలుగో సంవత్సరం వచ్చేసరికి 500 నుండి 600 కాయల దిగుబడినిచ్చే సామర్ధ్యం ఈ రకానికి ఉంది.
Share your comments