Horticulture

వేసవిలో కీరా పంట సాగు... శ్రమ తక్కువ ఆదాయం ఎక్కువ

KJ Staff
KJ Staff

మండుటెండలకు తట్టుకోలేక, ప్రజలు తమ దాహార్తిని తీర్చుకోవడనికి పళ్ళు, కూరగాయలు ఎక్కువగా తింటుంటారు. శరీరానికి అవసరమైన నీటితో పాటు ఇతర పోషకాలను అందించే కూరగాయల్లో కీరా దోషకాయ ముందుటుంది.కీరా వేసవి తాపాన్ని తట్టుకోగలిగే శక్తిని అందిస్తుంది, దీనిని వేసవి సలాడ్ పంటగా పరిగణిస్తారు. వేసవిలో కీరాను సాగుచేయడం రైతులకు అత్యంత లాభదాయకం. ఈ పంట తక్కువ కాలంలోనే చేతికండిరావడంతో పాటు, అధిక లాభాలను సంపాదించి పెడుతుంది.

కీరా పంటను ఆరుబయట పంటల్లో మరియు పోలిహౌస్ లో నాటుకునేందుకు అనువుగా ఉంటుంది. కీరాను దాదాపు అన్ని రకాల నేలల్లో పెరుగుతుంది, ఆమ్లా, క్షార నేలలు మరియు నీరు ఎక్కువుగా నిలువ ఉండే మురుగు నేలలు కీరసాగుకు పనికిరావు. నీరు ఎక్కువ నిలువవుండే నేలల్లో వేరు కుళ్ళు మరియు కాండం కుళ్ళు తెగుళ్లు వచ్చే అవకాశం ఎక్కువ కనుక రైతులు జాగ్రత్త పాటించాలి. కీరా పంట మొదలుపెట్టే ముందు పొలాన్ని 2-3 సార్లు బాగా కలియ దున్నాలి. పంట ఆఖరి దుక్కులో ఎకరానికి 4-5 టన్నుల పశువుల ఎరువు వేసి కలియ దున్నాలి దీని వలన భూమిలో కర్బన శాతం పెరుగుతుంది. పంట నాటుకోవడానికి, సాళ్ళు లేదా బెడ్ల పైన నాటుకోవడం మంచిది, ఇలా చేస్తే మొక్క అడుగు భాగాన నీరు నిల్వ ఉండదు.

వేసవిలో నీటిల్ లభ్యత తక్కువుగా ఉంటుంది కనుక కీరా సాగును డ్రిప్ పద్దతిలో చేపట్టడం మంచిది. డ్రిప్ తో పాటు ప్లాస్టిక్ ముళ్చింగ్ షీట్స్ కూడా ఉపయోగిస్తే ఎండ వేడికి నీరు ఆవిరికాకుండా ఉంటుంది. ఒక ఎకరం కీరా సాగుకు 300-400గ్రాముల హైబ్రిడ్ విత్తనాలు అదే సూటి రకాలైతే 1 కిలో అవసరం. విత్తనాలను నేరుగా విత్తుకోవచ్చు, లేదంటే షేడ్ నెట్ల కింద ట్రేలలో పెంచి మొక్క 10-15 సెంటిమీటర్లు పెరిగిన తరువాత ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. ప్రతి మొక్కకు మధ్య 45-50 సెంటీమీటర్లు మరియు వరుసల మధ్య 1.5 మీటర్ల దూరం ఉండేలా జాగ్రత్తలు చేపట్టాలి. విత్తనాలు మరి దగ్గరగా నాటుకుంటే రోగాలు ప్రబలమయ్యే అవకాశం ఉంటుంది. వేసవి వేడికి తీగజాతి మొక్కలో మగ పూవులు సంఖ్యా ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థిని నియంత్రించేందుకు, మొక్క 3-4 ఆకుల దశలో ఉన్నపుడు ఒక లీటర్ నీటికి 3 గ్రాముల బొరాక్స్ కలిపినా నీటిని పిచికారీ చెయ్యాలి. మొక్కలు పూత దశకు చేరుకునే ముందు 10 లీటర్ల నీటికి 2.5 గ్రాముల సైకోసిల్ కలిపి మొక్కలపై పిచికారీ చెయ్యాలి.

ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే పంట చివరి దుక్కులో ఒక ఎకరానికి 200 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 33.3 కిలోల మ్యురేట్ ఆఫ్ పోటాష్ , పశువుల ఎరువుతో కలియదున్నుకోవాలి. విత్తిన 25-30 రోజుల మధ్య ఎకరానికి 45 కిలోల యూరియా అందించాలి, పూత మరియు కాయ దశలో మరో 45 కిలోల యూరియా మొక్కలకు అందించాలి. ఎండ వేడికి పూత మరియు కాయలు రాలిపోవడం జరుగుతుంది, ఈ పరిస్థితిని అధిగమించడానికి సూక్ష్మధాతు మిశ్రమం 5 గ్రాములు మరియు ప్లానోఫిక్స్ 0.23 మిల్లి లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారి చెయ్యాలి.

కీరా సాగులో ప్రధానంగా కనిపించే తెగుళ్లలో వైరస్ తెగులు ఒకటి. వైరస్ సోకినా మొక్కలు లేత పసుపు రంగులోకి మారి, దిగుబడి తగ్గిపోవడానికి కారణమవుతాయి. పొలంలో వైరస్ తెగుళ్లు కనిపించిన వెంటనే వాటి తీసేసి కాల్చడం లేదా పూడ్చిపెట్టడం చెయ్యాలి, లేదంటే వైరస్ తెగులు మిగిలిన మొక్కలకు కూడా సోకె ప్రమాదం ఉంటుంది. ఈ వైరస్ తామర పురుగులు మరియు ఇతర రసం పీల్చుపురుగుల నుండి వస్తుంది కాబట్టి పొలంలో రసం పీల్చు పురుగుల ఉదృతి పెరగకుండా చర్యలు చేపట్టాలి. పురుగుల సంఖ్య ఎక్కువుగా ఉంటె ఒక లీటర్ నీటికి 0.40 మిల్లి లీటర్ల ఇమిడాక్లోరోఫిడ్ లేదా రెండు మిల్లి లీటర్ల డైమిథోయేట్ కలిపి పొలం మొత్తం స్ప్రే చెయ్యాలి. ఈ విధంగా మెరుగైన యాజమాన్య పద్దతులు పాటిస్తూ కీరా సాగు ద్వారా అధిక లాభాలు పొందవచ్చు, కీరా సాగులో మరొక్క ప్రత్యేకత ఏమిటంటే పంట ప్రారంభించిన 50-60 రోజుల తర్వాత దిగుబడి పొందవచ్చు.

Share your comments

Subscribe Magazine