Horticulture

భారీ వర్షాల సమయంలో బొప్పాయి తోటల్లో పాటించవలసిన చర్యలు:

KJ Staff
KJ Staff

మన దేశంలోని ఎన్నో వ్యవసాయ క్షేత్రాలు వర్షాల మీదే ఆధారపడి ఉన్నాయి. వర్షాలు పంటల సాగుకి అవసరమైనప్పటికీ, అధిక వర్షాలు పంట నష్టాన్ని మిగల్చవచ్చు, అధిక వర్షాలకు పొలంలో నీరు నిలిచి మొక్కలో అనేక సమస్యలు తలెత్తవచ్చు. వర్షాలకు గాలిలో తేమ శాతం పెరిగి చీడపీడలు ఆశించడానికి ఎంతో ఆస్కారం ఉంది. తోటల్లో ఈ వర్షపు నీరు బయటకు పోవడానికి మార్గం లేకుంటే నీరు తోటలో నిలిచి వేరు కుళ్ళు మొదలైన తెగుళ్లు రావడానికి ఆస్కారం ఉంటుంది.

ఒకప్పుడు కేవలం పెరటి తోటగానే ఉన్న బొప్పాయి ప్రస్తుతం వాణిజ్య పంటగా మారింది. బొప్పాయి తోట నుండి దాదాపు 3 సంవత్సరాల వరకు దిగుబడి ఆశించవచ్చు. ప్రస్తుతం బొప్పాయిలో అధిక దిగుబడిని ఇచ్చే హైబ్రిడ్ రకాలు ఎన్నో అందుబాటులో ఉన్నందున రైతులు బొప్పాయిని విస్తృతంగా సాగుచేస్తున్నారు. అయితే బొప్పాయి పంట మాత్రం తరచు చీడపీడలకు గురవుతూ ఉంది, ముఖ్యంగా ఈ వర్షాకాలంలో రోగాల భారిన పడే అవకాశం ఎక్కువుగా ఉంటుంది కనుక రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలి, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వర్షాకాలం రాకముందే చెట్ల మధ్య దున్నడం ద్వారా వర్షపు నీరు భూమిలోకి త్వరగా ఇంకిపోయి నీరు నిలబడకుండా ఉంటుంది. వర్షాకాలంలో రైతులను ప్రధానంగా వేదించే సమస్య కలుపు, ఈ కాలంలో కలుపు ఏపుగా పెరిగి మొక్కలకు అందవలసిన పోషకాలను మరియు నీటిని తీసుకుంటాయి, అంతేకాకుండా కలుపు మొక్కలు కొన్ని రకాల చీడపీడలను కూడా ఆకర్షిస్తాయి దీని వలన దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉంది. కలుపును నివారించడానికి, వర్షాలు తగ్గిన వెంటనే మొక్కల మధ్య అంతర్ సేద్యం చేసి కలుపును నివారించుకోవాలి. కోతకు సిద్ధంగా ఉండే పళ్ళను వీలైనంత త్వరగా కోసుకోవాలి లేకుంటే రాలిపోయి కుళ్లిపోయే ప్రమాదం ఉంటుంది.

వర్షాలకు నేలరాలిన పళ్ళను తొందరగా ఏరి బయట పడెయ్యాలి లేదంటే, వాటి మీద పురుగులు చేరి ప్రధాన పంటను ఆశించే అవకాశం ఉంటుంది. వర్షం కురిసిన తరువాత నేల ఆరేవరకు ఎటువంటి ఎరువులను ఇవ్వకూడదు, నేల కాస్త పొడిగా అయ్యిన తరువాత 200 గ్రాముల యూరియా, 100 గ్రాముల పోటాష్ మొక్కలు వెయ్యాలి.

బొప్పాయి తోటల్లో నీరు ఎక్కువ కాలం నిలిచినట్లైతే కాండం కుళ్ళు తెగులు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఈ వ్యాధిని సోకిన మొక్కలు నేలకొరిగి చనిపోతాయి, ఈ వ్యాధిని ఎదుర్కొనేందుకు మెటలాక్సిల్ ఎం.జెడ్ 3 గ్రా లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా ఒక లీటర్ నీటికి కలిపి కాండం మరియు మొదళ్ళలో తడిచేలా పిచికారీ చెయ్యాలి. కాయకుళ్లు తెగులు నివారణకు హెక్సకోనోజోల్ 2మి.లి + 0.5 మి.లి . స్టికర్ ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చెయ్యాలి. మొక్కలో సూక్ష్మ పోషకాలు లోపం తలెత్తకుండా 5 గ్రా సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని ఒక లీటర్ నీటికి కలిపి ఆకులు మొత్తం తడిచేలా పిచికారీ చెయ్యాలి.

Share your comments

Subscribe Magazine