ఈ మధ్యకాలంలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో దానిమ్మ సాగు బాగా పెరిగింది, ఈ పంటను వాణిజ్య పరంగా సాగు చేస్తున్న రైతులు మంచి దిగుబడి సాధించి లాభాలు ఆర్జిస్తున్నారు. ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు సూచించడంతో, దీనికి మార్కెట్లో గిరాకీ కూడా పెరిగింది. అయితే దానిమ్మ సాగు చేసే రైతులు ఈ పంటకు సోకే తెగుళ్ల గురించి అప్రమత్తంగా ఉండాలి. దానిమ్మలో వచ్చే ప్రాణాంతకమైన వ్యాధుల్లో మచ్చ తెగులు ఒకటి. రైతులు ఈ వ్యాధిని ముందుగానే గుర్తించి సరైన రక్షణ చర్యలు పాటించాలి.
దానిమ్మ ఉద్యాన పంట కనుక ఒకసారి నాటితే దాదాపు 30 ఏళ్ల వరకు దిగుబడి పొందవచ్చు. మొక్కలు నాటిన 3 సంవత్సరాల తరువాత కాయలు రావడం ప్రారంభమవుతుంది. దానిమ్మ గింజలు, తొక్కలు, రసం ఆకులు వేర్లు ఇలా అన్నిటికి ఆయుర్వేద ప్రయోజనాలు ఉన్నాయి. అయితే దానిమ్మ సాగు చేపట్టే రైతులు పంట కాలంలో కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. దానిమ్మలో వచ్చే ముఖ్యమైన రోగుల్లో మచ్చ తెగులు ఒకటి. ఇది క్సన్తోమోనాస్ ఆక్సీనోపొడిస్ అనే బాక్టీరియా వలన సంక్రమించే వ్యాధి. ఈ వ్యాధి వచ్చిన మొక్కలను కాపాడుకోవడం చాలా ముఖ్యం లేదంటే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది.
బాక్టీరియా సోకినా వెంటనే గుర్తించి నివారించడం చాలా ముఖ్యం, లేదంటే పొలం మొత్తం ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన ఆకులపై గోధుమ రంగు వలయాలు ఏర్పడి వాటి చుట్టూ పసుపు వలయాలు ఏర్పడతాయి. ఇలా ఆకులు క్రమేపి పచ్చదనం కోల్పోయి ఎండిపోయి రాలిపోతాయి. వ్యాధి సోకిన మొక్కల నుండి పువ్వులు మరియు కాయలకు కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. వ్యాధి వ్యాపించి పువ్వులు కాయలుగా మారవు, అంతేకాకుండా కాయలు కాసే దశలో ఈ వ్యాధి ఉదృతి మరింత ఎక్కువుగా ఉంటుంది.
వ్యాధి వచ్చిన కాయలపై గోధుమ రంగుల్లో వలయాల ఆకారంలో మచ్చలు ఏర్పడతాయి. వ్యాధి మరింత పెరిగే కొద్దీ ఈ మచ్చలు కాయ మొత్తం వ్యాపించి కాయలు కుళ్ళి ఎండిపోతాయి. ఇటువంటి మచ్చలు ఉన్న కాయలను మార్కెట్ చెయ్యడానికి కూడా పనికిరావు. మొదట వ్యాధి సోకిన కొమ్మలు ఎండిపోతాయి, 15 రోజుల తరువాత మిగిలిన కొమ్మలు కూడా ఎండిపోయి రాలిపోవడం గమనించవచ్చు.
వాతావర్ణ అనుకూలించకపోవడం, ఉష్ణోగ్రతలు అనుకూలంగా ఉండకపోవడం, మేఘావృత వాతావరణం ఏర్పడటం, వర్షాలు సరైన సమయంలో కురవకపోవడం, మరియు పోషక లోపం మొక్కను బలహీనపరుస్తాయి, ఇటువంటి సమయంలో మొక్కలు ఈ బాక్టీరియా వ్యాధి భారిన పడే అవకాశం చాలా ఎక్కువ. ఈ బాక్టీరియా గాలి మరియు వర్షపు జల్లుల ద్వారా వ్యాప్తి చెందుతుంది.
కాయమచ్చ తెగులు రాకుండా నివారించేందుకు, ముందుగా ఆరోగ్యకరమైన మరియు భిన్నమైన వాతావరణ పరిస్థులకు అనుకూలంగా ఉండే మొక్కలను ఎంచుకోవాలి. తోటలో పురుగు చేరకుండా ఉండేదుకు తోటను ఎల్లపుడు శుభ్రంగా ఉంచుకోవాలి. మొక్కలో వ్యాధిని గుర్తించిన వెంటనే ఆ భాగాలను కట్టించి వాటిని పూడ్చిపెట్టడం మరియు తగలబెట్టడం వంటివి చెయ్యాలి. వ్యాధిని సమగ్రంగా ఎదుర్కోవడానికి పుశువుల ఎరువును లేదంటే వెర్మికంపోస్టు వెయ్యాలి. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు బాసిల్లస్, ట్రైకోడెర్మా, సూడోమోనాస్ వంటి జీవన మందులను వాడటం ఉత్తమం.
Share your comments