News

వ్యవసాయంలో నూతన సాంకేతిక యంత్రాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిర్ణయం...!

KJ Staff
KJ Staff

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి రైతుల ఆర్థిక స్థితిని మెరుగు పరిచే దిశగా పలు విభిన్న పథకాలను రూపొందిస్తూ అమలు చేస్తున్నారు.తాజాగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆధునిక యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చి రైతులకు ఆర్థిక భారాన్ని తగ్గించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం
"వైఎస్సార్ యంత్రసేవ" పధకాన్ని ప్రారంభించి అమలు చేస్తోంది.

రైతు భరోసా కేంద్రాల పరిధిలోని గ్రామాల్లోని రైతులకు వ్యవసాయంలో తోడుగా నిలవడానికి నూతన సాంకేతిక పరిజ్ఞానం గల యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చి వారి జీవన ప్రమాణాలను మెరుగు పరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.రైతు భరోసా కేంద్రాల పరిధిలో తొలివిడతగా కస్టమ్ హైరింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి తక్కువ అద్దెకే వ్యవసాయ పనిముట్లు, ఆధునిక యంత్రాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

ఇందులో భాగంగా కస్టమ్ హైరింగ్ కేంద్రాల్లో ఉంచనున్న ఆధునికయంత్రాల బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం రైతు సంఘాలకే అప్పగించింది. ఒక్కో గ్రూపులో ఐదుగురుసభ్యులు ఉండి అందులో ఒకరు అధ్యక్షుడు, మరొ కరు ఉపాధ్యక్షుడిగా ఉంటారు. మిగతా ముగ్గురు కమిటీ సభ్యులుగా ఉంటారు.ఒక్కో సంఘానికి రూ.12 లక్షల నుంచి రూ 15 లక్షల వరకు రాయితీతో యంత్ర పరికరాలు కేటాయిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యంత్ర పరికరాలపై ప్రభుత్వం 40 శాతం రాయితీ ఇవ్వనుండగా, రైతు వాటాగా 10 శాతం. మిగతా 50 శాతం బ్యాంకుల నుంచి రుణంగా ఇప్పిస్తారు.

వైఎస్సార్ యంత్ర సేవా పథకంలో భాగంగా రైతుభరోసా కేంద్రానికి ఒకటి చొప్పున కస్టమ్ హైరింగ్ కేంద్రం,రెవెన్యూ డివిజన్ కు ఒకటి చొప్పున హైటెక్ హబ్ ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లోని అవసరాలను బట్టి రైతు సభ్యుల సూచనలకు అనుగుణంగా మూడు దశల్లో ఆధునిక వ్యవసాయ యంత్రపరికరాలను అందుబాటులో ఉంచే విధంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది.

Share your comments

Subscribe Magazine