టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ప్రతి రంగంలోనూ కొత్త కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. వ్యవసాయంలో కూడా మెషీన్లను ఉపయోగిస్తూ పంటలు పండించడం రోజురోజుకీ పెరుగుతోంది.
కూలీల కొరత, తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో పూర్తి కావడం వంటివి ఈ మెషినరీ పట్ల రైతులు ఆసక్తి చూపించేందుకు కారణమవుతున్నాయి. చాలామంది రైతులు వీటిని కొనుగోలు చేస్తూ అటు వ్యవసాయంతో పాటు ఇటు వీటిపై కూడా అదనపు లాభాలను పొందుతున్నారు. ఇలా వ్యవసాయంలో ఎక్కువగా ఉపయోగించే, వ్యవసాయాన్ని సులువుగా మార్చే కొన్ని మెషీన్ల గురించి.. వాటి వల్ల ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
స్ట్రా రీపర్ మెషీన్
ఈ మెషీన్ మూడు రకాల పనులు చేస్తుంది. వరిని కోయడం, నూర్పిడి, గడ్డిని కట్టలు కట్టడం వంటివి చేస్తుంది. దీన్ని ట్రాక్టర్ సాయంతో ఉపయోగించవచ్చు. దీనికి తక్కువ ఇంధనమే ఖర్చవుతుంది. ఒక ఎకరం పని చేయడానికి ఒక లీటర్ డీజిల్ సరిపోతుంది. ఈ మెషీన్ ని తీసుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ కూడా అందిస్తున్నాయి. యాభై శాతం వరకు సబ్సిడీని అందుకోవచ్చు. మరో యాభై శాతం మొత్తానికి కూడా బ్యాంక్ లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ పరికరంతో గంట సమయంలోనే ఎనిమిది నుంచి పది క్వింటాళ్ల గడ్డిని కట్టలు కట్టే వీలుంటుంది. దీని ద్వారా తీసుకున్న గడ్డిలో చెత్త, దుమ్ము వంటివేవీ ఉండవు. అందుకే అటు డబ్బు ఇటు సమయం రెండు ఆదా అవుతాయి. గడ్డిని కింద వరకు కట్ చేయడం వల్ల ఏమాత్రం వేస్టేజ్ ఉండదు. అంతేకాదు.. గడ్డిని కాల్చేయాల్సిన అవసరం కూడా రైతులకు పెద్దగా ఉండదు.
రౌండ్ బేలర్:
ఈ మెషీన్ ని కూడా ట్రాక్టర్ సాయంతోనే నడపాల్సి ఉంటుంది. దీనికి పెద్దగా, గుండ్రని షేప్ లో ఉన్న ఈ మెషీన్ పంటను కట్ చేసి గుండ్రని బేల్స్ ని తయారుచేస్తుంది. ఆ తర్వాత వాటిని ఎండనిచ్చి ఆ తర్వాత వాటిని ఉపయోగించవచ్చు. పంటల్లో ఎలాంటి వేస్టేజ్ లేకుండా వరి, గోధుమ, అరటి, చెరుకు లాంటి పంటలను కట్టలు కట్టి ఉంచుతుంది. దీని ద్వారా కట్టే కట్టలు ఒక ఫిక్స్ సైజ్ కలిగి ఉంటాయి. చిన్న స్థలంలో కూడా ఈ మెషీన్ ని ఉపయోగించవచ్చు. దీని ద్వారా పంటల వేస్టేజ్ చాలా వరకు తగ్గుతుంది. దాన్ని తరలించడం కూడా చాలా సులువు అవుతుంది.
కంబైన్డ్ హార్వెస్టర్:
మిగిలినవన్నీ చేసే పనులను ఈ మెషీన్ ఒక్కటే చేస్తుంది. దీని సాయంతో కోతలు, నూర్పిడి వంటివి సులువుగా జరుగుతాయి. ధాన్యంలోనూ ఎలాంటి చెత్త లేకుండా ఇదే వడపోస్తుంది. కత్తరించేందుకు రంపం, నూర్పిడి కోసం డ్రమ్, శుభ్రపరిచేందుకు జల్లెడ, శుభ్రపర్చిన గింజల కోసం ఓ బాక్స్, ధాన్యాన్ని తీసుకెళ్లేందుకు కన్వేయర్ కూడా ఉంటాయి. దీని ద్వారా కూలీల అవసరం లేకుండా పంటను కోసి బస్తాల్లోకి ఎక్కించవచ్చు. శుభ్రమైన ధాన్యం లభిస్తుంది. గడ్డి కూడా ఏమాత్రం పాడవ్వదు. ఖర్చు, సమయం రెండు చాలా మిగులుతాయి.
రొటవేటర్:
ఇది నాటు వేయడానికి సీడ్ బెడ్ ని తయారుచేసే మెషీన్ అని చెప్పుకోవచ్చు. దీన్ని కూడా ట్రాక్టర్ సాయంతోనే నడపాలి. ఇది పంట అవశేషాలను తీసేయడం, తిరిగి భూమిలో కలిపేయడం చేస్తుంది. తద్వారా భూమిలో పోషకాలు పెరుగుతాయి. ఎరువుల అవసరం తక్కువగా ఉంటుంది. మొక్కజొన్న, చెరుకు, గోధుమ వంటి పంటలకు ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. దీనిద్వారా మొత్తం అవశేషాల తొలగింపు, దున్నడం రెండూ ఒకేసారి పూర్తి చేయవచ్చు. దీని వల్ల ఖర్చు తగ్గుతుంది. చెత్త, గడ్డి ఏదైనా ఉంటే అది పూర్తిగా మట్టిలో కలిసి పోతుంది. దీనితో పాటు పిచ్చి మొక్కలు కూడా పూర్తిగా మట్టిలో కలవడం వల్ల మట్టిలోని కార్బన్ శాతం పెరుగుతుంది. అంతే కాదు.. ఇలా చేయడం వల్ల పంట వేళ్లు కూడా లోపలికి బలంగా పాకేందుకు ఇది సాయ పడుతుంది.
రివర్సిబుల్ ప్లవ్:
ఇది సామాన్యంగా వేసవిలో ఉపయోగించడానికి వీలుగా ఉండే మెషీన్ అని చెప్పుకోవచ్చు. ఇది మట్టిని కింది నుంచి పైకి తీసి మట్టిని పూర్తిగా కలిపే మెషీన్. దీనికి ఉన్న బాటమ్స్, బీమ్స్ సాయంతో ఇది మట్టిని చాలా లోతు నుంచి దున్నుతుంది. దాదాపు పది అంగుళాల లోతు వరకు ఇది వెళ్తుంది. కాబట్టి లోతుగా తవ్వే వీలుంటుంది. దీని వల్ల దున్నడానికి చాలా తక్కువ సమయం పడుతుంది.
https://krishijagran.com/agriculture-machinery-uses-types-and-subsidies/
https://krishijagran.com/state-wise-subsidies-on-selected-agriculture-machinery-in-india
Share your comments