మారుతున్న కాలంతోపాటు మనం కూడా మరవలసి ఉంటుంది. మరీముఖ్యంగా వ్యవసాయంలో ఈ మార్పు ఎంతగానో అవసరం, పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలను తీర్చడానికి వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి, ఈ మార్పు యాంత్రికరణతో సాధ్యపడుతుంది. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న కూలీలా కొరతను కూడా యంత్రాలు భర్తీ చెయ్యగలవు. వీటి ద్వారా లభించే ఉపయోగాలను అర్ధం చేసుకున్న రైతులు, మునుపెన్నడూ లేని విధంగా, వ్యవసాయ యంత్రాలకు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం, మార్కెట్లో ఎన్నో రకాల యంత్రాలు రైతుల కోసం అందుబాటులో ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పవర్ వీడర్:
ఒకప్పుడు రైతులు పొలంలో కలుపు నివారణకు, కూలీలమీద లేదంటే కలుపు మందుల మీద ఆధారపడేవారు, వీటి కోసం ఎక్కువుగా పెట్టుబడి పెట్టవలసి వచ్చేది, అయితే ప్రస్తుతం ఈ సమస్యకు పరిస్కారంగా పవర్ వీడర్లు అందుబాటులోకి వచ్చాయి. పవర్ వీడర్లు రెండు రకాలు, కలుపు తీసేది ఒకటి మట్టిని దున్నేవి ఒకటి. ట్రాక్టర్ పోవడానికి వీలు లేని ప్రదేశాల్లో ఈ పవర్ వీడర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిని ఉపయోగించి, జొన్న, పత్తి, మొదలగు పొలాల్లో కలుపును నివారించుకోవచ్చు. గ్రామాల్లోని రైతులు వీటిని ఎక్కువుగా వినియోగిస్తున్నారు, పవర్ వీడర్ సహాయంతో కలుపు తియ్యడం ద్వారా డబ్బు మరియు సమయం రెండు ఆదా అవుతాయి. వీటి ధర వాటి సామర్ధ్యాన్ని బట్టి మారుతూ ఉంటాయి, ఒక్క వీడర్ ధర 2-3 లక్షల రూపాయిలు ఉండొచ్చు.
కల్టివేటర్:
ఇదివరకు పొలం దున్నాలంటే, ఎడ్ల సహాయంతో నాగలితో పొలాన్ని దున్నేవారు, అయితే మట్టిని దున్నడానికి ఎన్నో రకాల యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కల్టివేటర్ ఒకటి, దీనిని ట్రాక్టరుకు అనుసంధానించి ఉపయోగించవలసి ఉంటుంది. ఎడ్ల సహాయంతో రోజంతా దున్నే పొలాన్ని ఇప్పుడు కల్టివేటర్ సహాయంతో ఒక గంటలోనే దున్నేయచ్చు. కల్టివేటర్ కొనుగోలు చేసేందుకు వ్యవసాయ శాఖ సబ్సిడీ కూడా అందిస్తుంది.
మేజ్-సెల్లార్:
ఈ యంత్రాన్ని మొక్కజొన్న కంకులు వేరు చెయ్యడానికి వాడతారు. ఈ యంత్రం కంకి పొట్టు తియ్యకుండానే మక్కలను వేరు చేస్తుంది. ఇంతకు ముందు కూడా కంకి పొట్టు తీసే యంత్రం ఉండేది, అయితే ఆ యంత్రాలతో 50 క్వింటాళ్లను పట్టాలంటే 4 గంటల వరకు సమయం పట్టేది, అయితే ఇప్పిడు ఈ యంత్రాలతో ఒక గంటలోనే పనిమొత్తం పూర్తివవుతుంది. దీని యొక్క ధర సుమారు మూడు లక్షల రూపాయిలు ఉండచ్చు.
బెలర్:
ఈ బెలర్ గడ్డిని కట్టలుగా కట్టే యంత్రం. సాధారణంగా వారి కోత కోసిన రైతులు, మిగిలిన గడ్డిని పన్నలుగా పేర్చి, మోపుగా చేసేవారు ఇలా చెయ్యడం వలన ఒక్కోసారి గడ్డిమోపు తగలబడేందుకు అవకాశం ఉంటుంది. అదే ఈ బేలర్ గడ్డిని సులభంగా కట్టలుగా కడుతుంది. ఇలా కట్టలు కట్టిన గడ్డిని కొనేళ్లపాటు సులభంగా నిల్వ చేసి పశువులకు ఆహారంగా అందించవచ్చు. బెలర్ సహాయంతో కట్టలు కట్టిన గడ్డిని రవాణా చెయ్యడం కూడా సులభం.
రోటవేటర్:
ఈ యంత్రాన్ని, పంట కోత కోసిన తరువాత మిగిలే కొయ్యలు మరియు మొక్కల అవశేషాలను భూమిలో కలియదున్నెందుకు ఉపయోగిస్తారు. సాధారణంగా రైతులు పంట అవశేషాలను తగలబెడుతూ ఉంటారు, అయితే ఇలా చెయ్యడం మట్టికి మరియు వాతావరణానికి ఎంతో ప్రమాదకరం. దీనివలన మట్టిలో సారం తగ్గిపోతుంది, అదే రోటవేటర్ ఉపయోగిస్తే ఈ ఆవేశాలను మట్టిలో కలియదున్ని, మట్టిని మెత్తగా చేస్తుంది. పంట అవశేషాలు మట్టిలో కలిసి భూమికి మరింత సారవంతం చేస్తాయి.
సీడ్&ఫెర్టిలైజర్ డ్రిల్ల్:
ఈ యంత్రాన్ని ట్రాక్టరుకు అనుసంధానించి ఉపయోగించవచ్చు, ఈ యంత్రం విత్తనాలను ఒక క్రమపద్ధతిలో, మొక్కలకు మరియు వరుసలకు మధ్య దూరాన్ని పాటిస్తూ నాటుతుంది. విత్తనాలతోపాటు, ఎరువుల్ని కూడా ఒకేసారి అదించడం వలన విత్తనం మొలకశాతం, మొక్కఎదుగుదల బాగుటుంది. ఈ యంత్రం యొక్క ధర సుమారు 48 వేల రూపాయిలవరకు ఉంటుంది.
Share your comments