వ్యవసాయం చేయడమంటే సులభమైన విషయం కాదు. మండుటెండలో కష్టపడి పనిచేయాలి. ఎండ, వాన, చలి అనేది చూసుకోకుండా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. నాటు వేయడం దగ్గర నుంచి పంట చేతికొచ్చేంతవరకు పెట్టుబడి చాలా పెట్టాల్సి ఉంటుంది. మందులు, కూలీల ఖర్చులు చాలా అవుతుంది. ఇక ట్రాక్టర్ అద్దె, వ్యవసాయ యంత్రాల ఖర్చులు ఉంటాయి. ఇలా పంట మీద పెట్టుబడి పెడితేనే దిగుబడి వస్తుంది. రైతులకు లాభాలు వస్తాయి.
అయితే రైతుల అందరి దగ్గర వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు ఉండవు. ఇవి కొనుగోలు చేయాలంటే చిన్న, సన్నకారు రైతుల దగ్గర డబ్బులు ఉండవు. ఆర్థిక పరిస్థితి బాలేకపోవడం వల్ల రైతులు ట్రాక్టర్, ఇతర యత్రాలను అద్దెకు తీసుకొచ్చి వాడకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు రైతులకు ఊరట కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. వ్యవసాయ పనిముట్లను అద్దెకు ఇచ్చే విధంగా సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. ఈ సెంటర్లలో వ్యవసాయ యంత్రాలను అందుబాటులో ఉంచుతారు.
రైతులకు అవసరమైనప్పుడు వ్యవసాయ యంత్రాలను అద్దెకు తీసుకుని వినియోగించుకోవచ్చు. దానికి కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి మండల కేంద్రంలో కస్టమ్ హైరింగ్ కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ నిధులో వీటిని ఏర్పాటు చేస్తోంది. తెలంగాణకు ఇప్పటికే 31 కస్టమ్ హైరింగ్ కేంద్రాలు మంజూరు కాగా.. 29 ప్రాంతాల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో సెంటర్ కోసం రూ.22 లక్షల నిధులు కేటాయించారు.
ఈ నిధుల ద్వారా వ్యవసాయ యంత్రాలను కొనుగోలు చేయనున్నారు. హైదరాబాద్ మినహా తెలంగాణలో అన్ని జిల్లాలోని ఒక మండలం చొప్పున ప్రస్తుతానికి ఫైలట్ ప్రాజెక్టుగా కేంద్ర ప్రారంభించనుంది. త్వరలో అన్ని మండల కేంద్రాల్లో ఏర్పాటు కానున్నాయి. మహిళా సంఘాల్లోని వ్యవసాయంపై ఆధారపడిన మహిళా సభ్యులకు ఈ కస్టమ్ హైరింగ్ కేంద్రాల బాధ్యతలు అప్పగించనున్నారు. మహిళా సంఘాల సభ్యులుగా ఉన్న రైతులకు మార్కెట్ ధరలో 50 శాతానికి, సన్న, చిన్నకారు రైతులకు కొంత తక్కువ ధరకు ఈ పనిముట్లను అద్దెకు ఇవ్వనున్నారు.
అందుబాటులో ఉండే పనిముట్లు
ట్రాక్టర్, కల్టివేటర్, పవర్ వీడర్, పవర్ టిల్లర్, టార్పాలిన్లు , పవర్ స్ర్పేయర్లు, సోయింగ్ అండ్ ఫెర్టిలైజర్, డ్రిల్లర్, ట్రాక్టర్ ఆపరేటర్, ఇతర పనిముట్లు అందుబాటులో ఉండనున్నాయి.
పర్యవేక్షణ ఎలా?
ఆరుగురు సభ్యులతో ప్రతి కేంద్రానికి వ్యవసాయ ఉత్పత్తిదారుల గ్రూపు ఏర్పాటు చేస్తారు. ఈ ఆరుగురు సభ్యులు కలిసి ఒక సీసీ, ఒక అకౌంటెంట్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్లు పనిముట్లు అద్దె ఇవ్వడం ద్వారా వచ్చిన డబ్బులను పర్యవేక్షిస్తారు.
Share your comments