Horticulture

సుస్థిర వ్యవసాయ పద్దతుల ద్వారా బొప్పాయి సాగు.

KJ Staff
KJ Staff

బొప్పాయి మొక్క ఉష్ణ మండల వాతావరణంలో అధికంగా పెరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలలోను అలాగే తమిళనాడు, కర్ణాటక ప్రాంతంలో బొప్పాయి అధిక మొత్తంలో సాగు చేస్తారు. మిగిలిని పండ్ల మొక్కల యాజమాన్య పద్దతులతో పోలిస్తే బొప్పాయి సాగు కొంచెం తేలిక. ఒకప్పుడు పెరటి మొక్కగా ఉన్న బొప్పాయిని ఇప్పుడు వాణిజ్య పంటగా సాగుచేస్తున్నారు. మన దగ్గర పండిన బొప్పాయిని, భారత దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు బయట దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు.

సాగులో తేలికగా ఉండే బొప్పాయి పంటలో స్థిరవ్యవసాయ పద్దతులను పాటించడం ద్వారా అధిక దిగుబడులతో పాటు, పర్యావరణ హితంగా పంట సాగు చెయ్యవచ్చు. బొప్పాయి పంట మొదలుపెట్టే ముందు బొప్పాయిలో మేలైన రకాన్ని ఎంచుకోవడం ఎంతో కీలకం. తెలుగు రాష్ట్రలో ప్రాముఖ్యం ఉన్న 'తైవాన్ రెడ్ లేడీ- 786' మంచి నాణ్యతను మరియు అధిక దిగుబడిని ఇస్తుంది కానీ రింగ్ స్పాట్ వైరస్ వ్యాధికి వేగంగా గురవుతుంది. ఈ రకానికి ప్రత్యామ్నాయంగా, వైరస్ ని తట్టుకుని నిలబడగలిగేలా ఉండే రకాలైన 'కో-15' వంటి వాటిని వాడటం శ్రేయస్కరం. గైనోడైఏసియస్ రకాలైన ఆర్కా ప్రభ, సూర్య, సన్ రైజ్ సోలో, రకాలను సాగు చెయ్యడం ద్వారా పరాగసంపర్కానికి సులువుగా జరిగి మంచి దిగుబడి వస్తుంది.

బొప్పాయి సాగుకు సారవంతమైన నేలలు ఎంచుకోవాలి. తేలిక భూముల్లో బొప్పాయి సాగు లాభదాయకంగా ఉంటుంది. ముందుగా నేలను దున్ని చదును చేసుకోవాలి ఒక ఎకరానికి 2 టన్నుల చొప్పున పశువుల ఎరువును వేసి కలియదున్నుకోవాలి. పశువుల ఎరువు భూమిలో సారాన్ని పెంచడమే కాక, మట్టిలోని ఉపయోగకరమైన పరాన్నజీవులు పెరగడానికి ఉపయోగపడుతుంది. పశువుల ఎరువు వాడటం ద్వారా అదనంగా వాడే రసాయన ఎరువుల వాడకాన్ని కొంత మేరకు తగ్గించవచ్చు.

బొప్పాయి నారు మొక్కల పెంపకానికి, నర్సరీ బ్యాగులు తీసుకుని వాటిలో ఎర్రమట్టి+పశువుల ఎరువు+ ఇసుక సమపాలలో కలిపినా మట్టిని నింపాలి. ఒక ఎకరం బొప్పాయి సాగుకు, 20 గ్రాముల విత్తనాలు సరిపోతాయి. విత్తనాలను ముందుగా సిద్ధం చేసుకున్న నర్సరీ బ్యాగులలో ఒక సెంటీమీటర్ లోతున నాటాలి. ఈ బ్యాగులను నీడగా ఉన్న ప్రదేశాల్లో కానీ షేడ్ నెట్ పందిరి క్రింది కానీ 40-60 రోజుల వరకు నారు పెంచుకోవాలి. మొక్కలు ఈ విధంగా పెంచుకోవడం ద్వారా రసం పీల్చే పురుగుల మరియు వైరస్ భారీ నుండి మొక్కలను కాపాడుకోవచ్చు.

ఎదిగిన నారు మొక్కలను ప్రధాన పొలంలో నాటుకునేందుకు, ఒకటిన్నర అడుగుల మట్టిని తవ్వి ప్రతి గుంతకు 1కిలో వేపపిండి, 250గ్రాముల సింగల్ సూపర్ ఫాస్ఫేట్, 20 గ్రాముల అజాటోబాక్టర్ మరియు 20 గ్రాముల సూడోమోనాస్, 20 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి మిశ్రమాన్ని వేసి మొక్కలు నాటుకోవాలి. ఇలా చెయ్యడం ద్వారా వేరు ద్వారా మొక్కకు వచ్చే తెగుళ్లు అరికట్టవచ్చు. ప్రతీ వరుసకు మరియు మొక్కలకు మధ్య 6 అడుగుల దూరం ఉండేలా చూడాలి. బొప్పాయి సస్యరక్షణలో భాగంగా, సాగునీటిని బిందు సేద్యం ద్వారా అందించడం ద్వారా నీటి వృథాను తగ్గించవచ్చు. అలాగే అధిక వలన మొక్కకు వచ్చే వేరు కుళ్ళును అరికట్టవచ్చు.

మొక్కలు అధిక దిగుబడి ఇవ్వడానికి, సేంద్రియ ఎరువులతో పాటు, రసాయన ఎరువులు కూడా అవసరం. ప్రతీ మొక్కకు 500 గ్రాముల యూరియా, 1.6 కిలోల సింగల్ సూపర్ ఫాస్ఫేట్, 800 గ్రాముల మ్యురేట్ ఆఫ్ పోటాష్ ఒక సంవత్సరానికి అవసరం. నిర్ధేశించిన మొత్తాన్ని ఆరు భాగాలుగా విభజించి ప్రతీ రెండు నెలలకు ఒకసారి మొక్కలకు అందిచాలి. తేలికపాటి నేలల్లో సూక్ష్మపోషక లోపాలు అధికంగా ఉంటాయి. సూక్ష్మపోషక లోపల్లో కాయ సరిగ్గా ఏర్పడకపోవడం, క్రింది ఆకులు ఎండిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని నివారించేందుకు జింక్ సల్ఫేట్ 2 గ్రాములు+ బొరాక్స్ ఒక గ్రాము చొప్పున లీటర్ నీటికి కలిపి ప్రతీ నెలా మొక్కలపై పిచికారీ చెయ్యాలి.

బొప్పాయి సాగులో రైతులను ప్రధానంగా పీడించే సమస్య రింగ్ స్పాట్ వైరస్ మరియు లీఫ్ కర్ల్ వైరస్ (ఆకు ముడత తెగులు). ఈ రెండు వైరస్ లు పురుగుల నుండి మొక్కలకు సంక్రమిస్తాయి. పురుగులను సమగ్ర చర్యల ద్వారా నియంత్రించేందుకు పొలం చుట్టూ కంచే పంటలను నాటుకోవాలి. వీటిలో ఎత్తుగా పెరిగే సూపర్ నేపియర్, జొన్నలు, సజ్జలు మొక్కలు నాటుకోవడం ద్వారా పురుగులు బొప్పాయి పంటను ఆశించకుండా నియంత్రించవచ్చు. పురుగుల సమస్య మరిఎక్కువుగా ఉంటె లీటర్ నీటికి 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా 2 మిల్లీలీటర్ల మిథైల్ డెమాటోన్ పొలంలో పిచికారి చెయ్యడం ద్వారా పురుగుల నుండి కాపాడుకోవచ్చు. మొక్కలో వైరస్ తెగులు గమనించిన వెంటనే తీసి నాశనం చెయ్యడం ద్వారా మిగతా మొక్కలకు వైరస్ సోకకుండా కాపాడుకోవచ్చు.

Read More:

Share your comments

Subscribe Magazine