మన పల్లె వాతావరణంలో, పొలం గట్ల మీద రోడ్ల వెంబడి ఎక్కువగా కనిపించే ఉత్తరేణి మొక్కలో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే.ఈ మొక్కలోని ఆకులు, కాండం మరియు వేర్లలో అనేక రకాల వ్యాధులను నయం చేసే అద్భుతమైన ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఆయుర్వేద వైద్యంలో ఉత్తరేణి విశిష్ట స్థానం పొందిందని చెప్పొచ్చు. ఉత్తరేణి మొక్కలను ప్రాంతాలనుబట్టి వివిధ పేర్లతో పిలుస్తుంటారు.తెలుగులో ఉత్తరేణి ,దుచ్చెన చెట్టు అని, సంస్కృతంలో అపామార్గ, ఖరమంజరి అని కూడా పిలుస్తారు.
ఉత్తరేణి మొక్కలలో ఉన్న ఔషధ గుణాలు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయో ఇప్పుడు చూద్దాం... పాము,తేలు, జెర్రీ వంటి విష ప్రాణులు కుట్టినప్పుడు ప్రాథమిక చికిత్సలో భాగంగా విష ప్రభావాన్ని తగ్గించడానికి, బాధ నుంచి ఉపశమనం పొందడానికి ఉత్తరేణి ఆకులను మెత్తగా నూరి గాయంపై పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది.ఉబ్బసం, అజీర్తి సమస్యలకు ఉత్తరేణి భస్మం ఒక గ్రాము తేనెలో కలిపి తీసుకుంటే బాధ నుంచి విముక్తి కలుగుతుంది.
దంత సమస్యలకు ఉత్తరేణి చక్కటి పరిష్కార మార్గం. ఇప్పటికీ మన పల్లెల్లో కొంతమంది ఉత్తరేణి కొమ్మలతో ఉదయాన్నే దంతాలను శుభ్రం చేసుకుంటారు. ఉత్తరేణి ఆకులను కషాయంగా చేసుకుని ప్రతి రోజు తాగితే కిడ్నీ సమస్యలు, చర్మ సమస్యలు, కుష్టు వంటి వ్యాధులను నివారిస్తుంది.సోరియాసిస్ మచ్చలతో బాధపడేవారు ఉత్తరేణి ఆకురసంలో ముల్లంగి గింజలు కలిపి నూరి సొరియాసిస్ మచ్చలు పైన 40 రోజుల్లో వరసగా చేసిన యెడల మచ్చలు తగ్గి చర్మ సౌందర్యం మెరుగు పడుతుంది.
Share your comments