చూస్తుండగానే వేసవికాలం పోయి వర్షాకాలం రానే వచ్చింది. అయితే, వర్షకాలంలో అనేక రకాల వ్యాధలు సంక్రమిస్తాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఒక్కోసారి ఆరోగ్యం మరింతగా క్షీణించి ప్రాణాలు సైతం పోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు రాకుండా కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే వానకాలంలో వచ్చే అనేక రకాల వ్యాధులను మన దరిచేరకుండా అడ్డుకోవచ్చు. వర్షాకాలంలో అధికంగా వ్యాప్తి చెందే వ్యాధుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది డెంగ్యూ వ్యాధి.
డెంగ్యూ వ్యాధి లక్షణాలు, వస్తే తీసుకోవాల్సిన నివారణ చర్యలు, డెంగ్యూ రాకుండా ముందస్తుగా తీసుకునే చర్యల గురించి వైద్యారోగ్య నిపుణులు చెబుతున్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. డెంగ్యూ వ్యాధి డెంగ్యూ వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్ ను దోమలు వ్యాప్తి చేస్తాయి. డెంగ్యూ ఈడెన్ జాతులు/రకానికి చెందిన పలు ఆడ దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ వ్యాధి సంక్రమిస్తుంది. డెంగ్యూ వ్యాధి కారణంగా తీవ్ర జ్వరం వస్తుంది. అధికంగా తలనొప్పి, వాంతులు, విరేచనాలు, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, చర్మపు దద్దుర్లు వస్తాయి. డెంగ్యూ కారణంగా రక్తంలో ప్లేట్ లెట్స్ తగ్గిపోతాయి. శరీర రోగ నిరోధక వ్యవస్థ క్షీణిస్తుంది. దీని లక్షణాలు దాదాపు మూడు రోజుల నుంచి రెండు వారాల వరకు కనిపిస్తాయి. డెంగ్యూను గుర్తించడానికి రక్త పరీక్షలు చేస్తారు.
డెంగ్యూ వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత చికిత్సను అందిస్తారు. ప్రస్తుతం డెంగ్యూ వ్యాధి చికిత్సకు మందులు, ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. కోలుకోవడానికి దాదాపు వారం రోజులకు పైనే సమయం పడుతుంది. అయితే, డెంగ్యూ వ్యాధి బారినపడకుండా కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. దోమల వల్ల ఇది సంక్రమిస్తుంది కాబట్టి నివాస ప్రాంతాల్లో దోమలు లేకుండా చర్యలు తీసుకోవాలి. నివాస పరిసరాల్లో మురుగు నీరు, చెత్త చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉండే విధంగా ఉంచుకోవాలి. దీని వల్ల దోమలు పెరిగే అవకాశం ఉండదు. వర్షాకాలంలో వివిధ రోగాల బారినపడకుండా శరీర రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Share your comments