రోజూ మనం పీల్చే గాలి చాలా కలుషితమైపోతోంది. గాలిలో ఆక్సిజన్ స్థాయులు రోజురోజుకీ తగ్గుతున్నాయి. ప్రస్తుతం కరోనాతో ఇబ్బంది పడుతున్న వేళల్లో రక్తంలో ఆక్సిజన్ స్థాయులు తగ్గిపోవడం చాలామందిలో కనిపిస్తోంది. మీరు కూడా ఈ సమస్య బారిన పడకూడదంటే ముందు నుంచే రక్తంలో ఆక్సిజన్ స్థాయులు పెంచుకునేందుకు ప్రయత్నించాలి. ఇందుకు ఆల్కలైన్ ఆహారాలను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయులు తగ్గకుండా ఉంటాయి.
ఆల్కలైన్ రిచ్ డైట్ తీసుకోవడం వల్ల ప్రయోజనాలు
* ఇది రక్తంలోని ఆక్సిజన్ స్థాయులను పెంచుతుంది.
* శరీరంలో లాక్టిక్ యాసిడ్ నిల్వ ఉండడాన్ని తగ్గిస్తుంది.
* ఆరోగ్యకరంగా శరీరంలో అన్ని జీవక్రియలు జరిగేందుకు తోడ్పడుతుంది.
* కణాల పునర్నిర్మాణంలో సహాయపడుతుంది.
* శరీరంలో పీహెచ్ లెవల్స్ ని సాధారణ స్థాయులో ఉంచుతుంది.
* విటమిన్లు, మినరల్స్ ని శరీరం పీల్చుకునేందుకు సహాయపడుతుంది.
ఆక్సిజన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల వల్ల పూర్తి ఆరోగ్యం బాగుపడుతుంది. మనం తీసుకునే ఆహారంలో ఎసిడిక్ ఆహార పదార్థాలు ఎక్కువగా ఉంటే గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా మారుతుందట. అందుకే రక్తంలో ఆక్సిజన్ తగ్గుతుంది. అందుకే ఆల్కలైన్ ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఈ ఆహార పదార్థాలేంటంటే..
1. నీళ్లు
ఆహారం అని చెప్పి నీటి గురించి చెప్పడమేంటని భావిస్తున్నారా? మనం ఎన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకున్నా నీళ్లు సరిగ్గా అందకపోతే పోషకాలన్నీ రక్తంలో చేరవు. అందుకే రోజూ మూడు లీటర్ల నీరు తప్పకుండా తీసుకోవాలి. వ్యాయామం చేసేవారు ఇంకా ఎక్కువగా తీసుకోవాలి.
2. ముదురు ఆకుపచ్చ కూరలు
రోజూ తప్పనిసరిగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలను తీసుకోవాలి. పాలకూర, కేల్, వాటర్ క్రెస్, వంటివే కాదు.. అన్ని రకాల ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె కూడా ఎక్కువగా ఉంటాయి.
3. నిమ్మకాయ
ఐరన్ ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు మన శరీరం దాన్ని పీల్చుకోవడానికి వీలుగా విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. దీని కోసం నిమ్మరసాన్ని తరచూ తీసుకోవడం, నిమ్మకాయను కూరల్లో ఉపయోగించడం చేస్తుండాలి. అంతేకాదు.. ఇందులో నెగెటివ్ అయాన్లు ఉండడం వల్ల మెదడుకు ఆక్సిజన్ సప్లై పెంచడంలో ఇది ఎంతగానో తోడ్పడుతుందట.
4. క్యాప్సికమ్, మిర్చి
క్యాప్సికమ్, మిరప కాయల వంటి వాటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి ఆక్సిజన్ ని అందిస్తుంది. వీటిలో విటమిన్ ఎ కూడా ఎక్కువగా ఉంటుంది. అంతే కాదు.. ఇవి యాంటీ ఆక్సిడెంట్లు కూడా కాబట్టి ఫ్రీ రాడికల్స్ ని దూరం చేస్తాయి. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థను కూడా ఇవి కాపాడతాయి.
5. మటన్, చేపలు
మన శరీరంలో ఐరన్ స్థాయులు పెరగడం వల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. ఎందుకంటే ఐరన్ ఆక్సిజన్ ని పట్టి ఉంచుతుంది. మన శరీరంలో ఐరన్ తక్కువగా ఉంటే ఆక్సిజన్ స్థాయులు కూడా తక్కువగానే ఉంటాయి. ఐరన్ ని పెంచడానికి చేపలు, మటన్ చాలా మంచి జంతు సంబంధిత ఆహారాలుగా చెప్పుకోవచ్చు. ఇవి ఆక్సిజన్ ఫ్లో ని కూడా పెంచుతాయి.
6. పప్పు ధాన్యాలు
పప్పు ధాన్యాల్లో లాఘమోగ్లోబిన్ అనే కంపౌండ్ ఉంటుంది. ఇది ఆక్సిజన్ ని మోసుకెళ్తుంది. ఇది పప్పు ధాన్యాల మొక్కల నాడ్యూల్స్ లో ఎక్కువగా దొరుకుతుందని ఎన్నో పరిశోధనల్లో తేలింది. పప్పుధాన్యాల్లో కూడా ఇది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయులు కూడా పెరుగుతాయి.
7. పుచ్చకాయ
పుచ్చకాయలో నీరు, ఆల్కలైన్ శాతం ఎక్కువగా ఉంటుంది. పీహెచ్ 9 కంటే ఎక్కువగా ఉంటుంది. అంతే కాదు.. ఇందులో బీటా కెరోటిన్, లైకోపీన్ కూడా ఉంటాయి. వీటి వల్ల శరీరంలో ఆక్సిజన్ సప్లై పెరుగుతుంది. అందుకే పుచ్చకాయను వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి.
8. బ్రొకలీ
బ్రొకలీ లో ఎన్నో పోషకాలు ఉంటాయి. దీనివల్ల మనకు ఎన్నో మెడిసినల్ ప్రయోజనాలు కూడా అందుతాయి. ఇది శరీరానికి ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తుంది. శరీరంలో ఆక్సిజన్ మెటబాలిజాన్ని కొనసాగించేలా చేస్తుంది. రోజూ బ్రొకలీ తినేవారిలో రక్తంలో ఆక్సిజన్ స్థాయులు చాలా మంచి స్థాయిలో ఉంటాయని అధ్యయనాల్లో కూడా తేలింది.
9. ఆల్ఫాల్ఫా స్ప్రౌట్స్
ఈ గింజలను మొలకలెత్తిన తర్వాత తీసుకోవడం వల్ల శరీరానికి ఎక్కువ మొత్తంలో క్లోరోఫిల్ అందుతుంది. తద్వారా శరీరానికి ఎక్కువ మోతాదులో ఆక్సిజన్ కూడా అందుతుంది. ఇందులో అత్యధిక స్థాయిలో పోషకాలు ఉంటాయి. ఇందులో ఎంజైమ్స్ శరీర జీవక్రియలు సక్రమంగా సాగేలా చేస్తాయి. మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. వీటిని రోజువారీ డైట్ లో తీసుకోవాలి.
10. ఫ్రూట్ జ్యూసులు
దాదాపు అన్ని రకాల పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఫ్లేవనాయిడ్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ బారి నుంచి శరీరాన్ని కాపాడతాయి. ముఖ్యంగా ద్రాక్ష పండ్లు, పైనాపిల్, కివీ, చికోరీ, పాషన్ ఫ్రూట్, బెర్రీలు వంటివి పండ్లు తీసుకోవడం లేదా జ్యూస్ చేసి తీసుకోవడం చేయాలి. వీటిలో నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి శరీరంలో ఆక్సిజన్ సప్లైని ఇది కాపాడుతుంది.
Share your comments