మైదా దీనినే ఆల్ పర్పస్ ఫ్లోర్ అని కూడా పిలుస్తారు. దీని వాడకం కేకులు, పేస్టరీ, బిస్కెట్ల తయారిలో ఉపయోగిస్తారు. మనమంతా ఎంతో ఇష్టంగా తినే పరోటాలు, చాల రకాల స్వీట్లు, సమోసాలు మైదాను ఉపయోగించి తయారుచేస్తారు. ఇలా చాల విధాలుగా ఏదో ఒక విధంగా మైదాను తింటూనే ఉన్నాం. మైదా తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని చాల మంది ప్రజలు వారిస్తారు. మైదాకు బదులు గోధుమపిండిని వాడమని చెబుతుంటారు.
మనలో చాల మందికి గోధుమ పిండిని మరియు మైదా పిండికి మధ్య వ్యత్యాసం ఏమిటనే సందేహం వస్తుంది. సాధారణంగా గోధుముల మీద రెండు పొరలుంటాయి. పై పొరను ఉకాగా, లోపలి పొరను బ్రాన్ అంటారు. కేవలం ఊకను మాత్రమే తొలగిస్తే అటువంటి ధాన్యాన్ని గోధుమలుగా మరియు వీటిని నుండి తయారుచేసిన పిండిని గోధుమ పిండిగా పిలుస్తారు. అదేవిధంగా గోధుముల పై ఊకను, బ్రాన్ రెండిటిని తొలగించి మెత్తగా పిండిలాగా ఆడితే దానిని మైదా అని పిలుస్తారు. ఉప్మా తయారీలో వాడే రవ్వను కూడా ఇలా బ్రాన్ తొలగించిన గోధుముల నుండే తయారుచేస్తారు, అయితే మైదా లాగా పిండిని మెత్తగా గ్రైండ్ చెయ్యకుండా, ఉప్మా రవ్వ కోసం బరకగా మరపట్టిస్తారు.
దీని ద్వారా మైదాను కూడా గోధుముల నుండే తయారుచేస్తారనే విష్యం అర్ధమౌతుంది. మైదాలో పిండి పదార్ధాలు అధికంగా ఉంటాయి. దీనిలో ఫైబర్, ప్రోటీన్లు, కెలోరీలు కూడా ఎక్కువుగా ఉంటాయి. ఒక 100 గ్రాముల మైదాలో 351 క్యాలోరీలు, 10.3 గ్రాముల ప్రోటీన్, 0.7 గ్రాముల కొవ్వు పదార్ధాలు. 2.76 గ్రాముల ఫైబర్,74.27 గ్రాముల స్టార్చ్ మైదా ద్వారా లభిస్తుంది. క్యాలోరీలు అధికంగా ఉంటాయి కావున మైదాతో చేసిన పదార్ధాలు అధికంగా తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. గోధుమ పిండి కాస్త ఎర్రగా మరియు మైదా తెల్లగా ఎందుకు ఉంటుందన్న ఆలోచన మనకి వచ్చి ఉండవచ్చు. దీనికి కారణం మైదా తయారీలో తెలుపురంగు రావడం కోసం బ్లీచ్ వాడతారు, బ్లీచ్ ద్వారా ఆక్సీకరణ జరిగి గోధుమలు లేత ఎరుపు రంగు నుండి తెలుపు రంగులోకి మారతాయి. కాకపోతే బ్లీచింగ్ పద్దతి ద్వారా తయారుచేసిన మైదాలో దీని అవశేషాలు లేకుండా జాగ్రత్తలు పాటిస్తారు.
Share your comments