సాధారణంగా కొంతమంది హఠాత్తుగా రోడ్డుపై వెళ్తు వెళ్తు మూర్చ వచ్చి కింద పడిపోతుంటారు.ఈ వ్యాధిని ఫిట్స్ లేదా మూర్ఛ వ్యాధి అంటారు. ఫిట్స్ వచ్చినప్పుడు నోటి నుంచి నురుగరావడాన్ని గమనించవచ్చు.మూర్ఛ వ్యాధి అంటువ్యాధి కాదు.అలాగే మానసిక వ్యాధికాదు. మనలో ఫిట్స్ రాకుండా అడ్డుకునే ఒక యంత్రాంగం ఉంటుంది. దీన్నే థ్రెష్హోల్డ్ అని వైద్యపరిభాషలో పిలుస్తారు.ఎవరిలోనైతే ఈ థ్రెష్హోల్డ్ తక్కువగా ఉందో, వారికి ఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువ.
మూర్ఛ వ్యాధి రావడానికి ప్రధాన కారణాలు తలకు దెబ్బ తగలడం, మద్యపాన అలవాటు ఎక్కువగా ఉండటం, తీవ్రమైన మానసిక ఒత్తిడి వంటి కారణాల వల్ల కొందరిలో ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా మూర్ఛ వచ్చినప్పుడు నోటి నుండి నురగ ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కువ మందిలో మూర్ఛ వచ్చినప్పుడు మింగడం ప్రక్రియ ఆగిపోతుంది.కానీ నోట్లో ఊరే లాలాజలం మాత్రం యథావిధిగా ఊరుతూనే ఉంటుంది.ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ.
సాధారణంగా నోట్లో ఊరే లాలాజలం నిత్యం గుటక వేయడం వల్ల కడుపులోకి వెళ్తుంది.అయితే మూర్ఛ వచ్చిన వారిలో లాలాజలం నోటి నుంచి బయటకు రావడానికి కారణం వారు ఆ సమయంలో గుటక వేయలేకపోవడమే అదే సమయంలో ఊపిరితిత్తుల్లోంచి వచ్చే గాలి లాలాజలంలో బుడగలను సృష్టిస్తుంది. అందుకే ఫిట్స్ వచ్చినప్పుడు ఈ బుడగలతో కూడిన లాలాజలం కారణంగా నోట్లోంచి నురగ వస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది చూడడానికి అత్యంత ప్రమాదకరంగా అనిపించినప్పటికీ కంగారు పడవలసిన అవసరం లేదు. కావున మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న వారిని మానవతా దృక్పథంతో వీలైనంత త్వరగా ఆసుపత్రిలో చేర్పించడం ఉత్తమం.
Share your comments