ప్రకృతి రకరకాల పండ్లకు నెలవు. పండ్ల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా వీటిని తినడం వల్ల శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు అందుతాయి. అలాగే, వివిధ రకాల సీజన్లలో లభించే పండ్లు ప్రత్యేకం. అందుకే చాలా మంది వివిధ కాలాల్లో లభించే అన్ని రకాల పండ్లు తినడానికి ఇష్టపడతారు. అలాంటి పండ్లల్లో నేరేడు పండ్లు కూడా ఒకటి. బెర్రీ జాతికి చెందిన నేరేడు పండ్లు దేశంలో తక్కువ పరిమాణంలో అందుబాటులో ఉన్నాయి.
వర్షాకాలం ప్రారంభం నుంచి పండ్లు కొతకు వస్తాయి. చూడ్డానికి చిన్నగా.. పండినవి నలుపు రంగులో ఉంటాయి. ఎంతో రుచికరంగానూ ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వీటి ధర కాస్తా ఎక్కువే అయినప్పటికీ.. మంచి రుచితో పాటు శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు వీటిల్లో ఉంటాయి. వానకాలం సీజన్ లో దొరికే ఈ పండ్లతో కలిగే లాభాల గురించి వైద్యారోగ్య నిపుణులు చెబుతున్న వివరాలు గమనిస్తే..
నేరేడు పండ్లలో అనేక రకాల ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టి వీటిని చిన్నలు పెద్దలు అనే తేడా లేకుండా అన్ని వయస్సుల వారు తినవచ్చు. వీటిని తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. నేరేడు పండ్లలో సీ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
దీంతో అనేక రకాల రోగాలు మన దరిచేరకుండా ఉంటాయి. అలాగే, నేరేడు పండ్లల్లో ఐరన్ (ఇనుము) సైతం అధికంగా ఉంటుంది కాబట్టి రక్త పెరుగుదలతో పాటు బ్లడ్ లో హేమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. అలాగే, రక్తనాళాల పనితీరు మెరుగుపడి.. రక్త సరఫరా మంచిగా అవుతుంది. నేరేడు పండ్లు తినడం వల్ల బ్లడ్ ప్రెజర్ (బీపీ) సైతం కంట్రోల్ లో ఉంటుందని ఇటీవల నిర్వహించిన పలు పరిశోధన ద్వారా వెల్లడైంది. షుగర్ వ్యాధి ఉన్నవారు కూడా ఈ నేరేడు పండ్లను తింటే రక్తంలో షుగర్ శాతం సాధారణ స్థాయికి చేరుతుందని పలు పరిశోధనలు ఇప్పటికే వెల్లడించాయి. ఎందుకుంటే నేరేడు పండ్లు ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. చర్మ సంబంధ వ్యాధులు సైతం రాకుండా ఉండటంతో పాటు కోమలంగా చర్మం మారుతుంది. ఈ పండ్లను తింటే నోటి పళ్లు, చిగుళ్లు సైతం గట్టిగా ఉంటాయి. నేరేడు పండ్లతో జ్యూస్ చేసుకుని కూడా తాగవచ్చు.
Share your comments