శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు, మినరల్స్ అందించడంలో పండ్లు, ఆకుకూరగాయలు కీలకంగా ఉంటాయి. అందులో గుమ్మడికాయ కూడా శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తూ.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలుగజేస్తుంది. గుమ్మడి కాయలు దాదాపు ప్రపపంచ వ్యాప్తంగా సాగు చేయబడుతున్నాయి. మన దేశంలోనూ పలు చోట్ల అధికంగానే పండిస్తున్నారు. గుమ్మడికాయతో తయారు చేసిన వంటకాలు రుచిగా ఉండటంతో పాటు మంచి పోషకాలు శరీరానికి అందిస్తాయి. అలాంటి గుమ్మడికాయలు అందించే పలు అద్భుతమైన ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం..
గుమ్మడికాయలలో విటమిన్ ఏ, మిటమిన్ సీ, పిండిపదర్థాలు, ఫైబర్, తక్కువ మొత్తంలో కొవ్వులు, పొటాషియం, రాగి, మాంగనీస్, విటమిన్ బీ2, విటమిన్ ఈ, ఇనుము తో పాటు అతి సూక్ష్మ స్థాయిలో మెగ్నీషియం, భాస్వరం, జింక్, ఫోలేట్, ఇతర ఖనిజ లవణాలు ఉంటాయి. అందువల్ల రోగ నిరోధక శక్తిని పెంచడంలో తొడ్పడతాయి. అధిక యాంటీఆక్సిడెంట్ కంటెంట్ దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియ ప్రక్రియలో హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేయడంలో తోడ్పడుతుంది. గుమ్మడికాయలో ఆల్ఫా కెరోటిన్, బీటా కెరోటిన్, బీటా-క్రిప్టోక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అందువల్ల సూర్యరశ్మీ కారణంగా చర్మం దెబ్బతినకుండా రక్షణ కల్పిస్తుంది. అలాగే, గుండె, కంటి సంబంధ వ్యాధులు సైతం దరిచేరకుండా ఉంటాయి. వీటి ప్రమాద ప్రభావాన్ని సైతం తగ్గిస్తాయి.
గుమ్మడిలో అధికంగా సీ విటమిన్ ఉంటుంది. ఇది తెల్లరక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో రోగ నిరోధక కణాల పనితీరు మెరుగుపడి.. శరీరం వ్యాధుల బారినపడకుండా ఉంటుంది. విటమిన్ సీ తో పాటు గుమ్మడికాయలో ఉండే విటమిన్ ఇ, ఐరన్, ఫోలేట్ కారణంగా రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. గుమ్మడిలో ఉండే విటమిన్ ఏ, లుటిన్, జియాక్సంతిన్ కంటి చూపును మెరుగు పరుస్తుంది. గుమ్మడిలో పోషకాలు అధికంగా ఉండటంతో పాటు ఆకలిని అరికట్టి.. బరువు తగ్గాలనుకునే వారికి మెరుగైన ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే, ఇందులో ఉండే పలు రకాల కేరోటినాయిడ్లు గొంతు, క్లోమం, రొమ్ము సహా పలు క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయని ఇటీవలి పలు పరిశోధనల్లో వెల్లడైంది. కాబట్టి గుమ్మడిని ఆహారంగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Share your comments