మనిషి ఆహారం లేకుండా బ్రతకగలడేమో కానీ నీరు లేకుండా మాత్రం బ్రతకలేడు. మన శరీరంలో దాదాపు 80% నీటితోనే నిండి ఉంటుంది. అయితే ప్రస్తుతం కాలుష్యం పెరుగుతున్న కారణంగా, నీటిలో కలుషితాలు కూడా పెరిగిపోతున్నాయి. శుభ్రమైన నీరే ఆరోగ్యానికి మూలకారణం, నీరు మంచిదైతే ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. నీరు శుభ్రంగా కనిపించినంత మాత్రం అది శుభ్రమైనదని చెప్పలేము, అటువంటి నీటిలోకూడా హానికారకమైన బాక్టీరియా లేదా ఇతర పరాన్నజీవులు ఉండటానికి ఆస్కారం ఉంది. మీరు తాగే నీరు శుభ్రమైనదో కాదో? కొన్ని కొన్ని పద్దతుల ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.
నీరులేని జీవితాన్ని ఊహించడం అసాధ్యం, భూమీద ఉన్న కొన్ని కోట్ల జీవాలకు నీరే ఆధారం, భూమి మీద పుట్టిన మొదటి జీవం కూడా నీటిలోనే పుట్టింది. ప్రపంచంలో 70% శాతం నీటితో నిండి ఉన్నపటికీ అందులో దానిలో 3% శాతం మాత్రమే తాగేందుకు ఉపయోగకరమైనది. మనిషి జీవించి ఉండటానికి నీరు ఎంత అవసరమో, ఆరోగ్యంగా ఉండటానికి స్వచ్ఛమైన నీటిని తాగడం కూడా అంతే అవసరం. మనం తాగే నీరు స్వచ్ఛమైనది మరియు పరిశుభ్రమైనదై ఉండాలి లేకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు రావటానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పటికి అభివృద్ధి చెందుతున్న ఎన్నో దేశాల్లో పరిశుభ్రమైన నీటి లభ్యత లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. మనుషులతో పాటు మొక్కలకు మరియు జంతువులకు కూడా నీటి అవసరం ఉంది.
నీరు నాణ్యమైనదా? లేదా? అన్న విషయాన్ని నిర్ధారించడానికి నీటిలో ఉన్న ఘనపదార్ధాలు మొత్తని ఆధారం చేసుకొని నీటి నాణ్యతను సూచిస్తారు. దీనినే టోటల్ డిసోల్వ్డ్ సాలీడ్స్(టీడిఎస్) అని కూడా పిలుస్తారు, ఈ టీడిఎస్ నీటిలో కరిగిన పదార్ధాల మొత్తం సాంద్రతను సూచిస్తుంది. మీరు తాగే నీటిలో టీడిఎస్ శాతాన్ని తనిఖీ చెయ్యడం ద్వారా నీటి నాణ్యతను గుర్తించవచ్చు. దీని కోసం మార్కెట్లో లేదంటే ఆన్లైన్ లో సులభంగా లభించే టీడిఎస్ మీటర్ వాడవలసి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదించిన ప్రకారం నీటిలోని టీడిఎస్ 100 నుండి 250 పిపిఎం మధ్యలో ఉండాలి. ఈ నీరు తాగడానికి అనువైనది, అయితే టీడిఎస్ పరిమాణం ఇంతకన్నా తక్కువున్నా లేదా ఎక్కువున్న ఆ నీరు తాగేందుకు సురక్షితమైంది కాదు.
Share your comments