ఏదైనా ఆహారాన్ని సిద్ధం చెయ్యడానికి, అవసరమైనవాటిలో ముఖ్యమైనది వంట నూనె. వంట నూనె లేకుండా వంట చెయ్యడం దాదాపు అసాధ్యం. వంటగదిలో దీని అవసరం ఎక్కువ కాబట్టి దీనిని అందుబాటులో ఉంచుకోవాలనుకుంటారు, ఇలా కొంతమంది వంట నూనెను గ్యాస్ స్టవ్ కి దగ్గరగా ఉంచుతారు, ఇలా చెయ్యడం చాలా ప్రమాదకరం, గ్యాస్ నుండి వచ్చే వేడి నూనె త్వరగా ఆక్సీకరణ చెందేలా చేస్తుంది. ఆక్సీకరణ చెందిన నూనెలో కొన్ని కీలకమైన విటమిన్లు నశిస్తాయి. అంతేకాకుండా క్యాన్సర్ కారకమైన ఫ్రీ రాడికల్స్ కూడా ఇటువంటి నూనెలో తయారై ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.
చాలామంది వంట నూనెను కొన్న తరువాత, ప్లాస్టిక్ సీసాల్లో, లేదా ప్లాస్టిక్ ప్యాకెట్లో నిల్వ చేస్తూ ఉంటారు. ఇలా చెయ్యడం వలన నూనె నాణ్యత దెబ్బతింటుంది, మైక్రోప్లాస్టిక్ కణాలు నూనెలో కలిసి ఉదరసంబంధమైన వ్యాధులకు దారి తొయ్యవచ్చు. కాబట్టి నూనెని నిల్వచెయ్యడానికి ప్లాస్టిక్ సీసాల బదులు గాజు సీసాలను వినియోగించాలి. ఆయిల్ నిల్వచేసిన బాటిల్ మూతను ఎక్కువసేపు తెరిచి ఉంచకూడదు, ఇలా చేస్తే బాటిల్ లోకి గాలి ప్రవేశించి నూనె పాడయ్యే ప్రమాదం ఉంటుంది. నూనెను వేడి మరియు వెలుతురు ఎక్కువుగా ఉన్న ప్రదేశాల్లో నిల్వచెయ్యకూడదు, దీని వలన నూనె రసాయన ప్రతిచర్యలకు గురవుతుంది, దీని వలన ఫ్రీ రాడికల్స్ ఏర్పడతాయి.
ఫ్రీ రాడికల్స్ ఏర్పడిన నూనెని తరచూ తినడం ద్వారా ఊబకాయం, అకాల వృద్యాప్యం, భారీగా కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతుంది. వీటితోపాటు టైప్- 2 డయాబెటిస్ మరియు ఆల్జీమర్స్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక నూనెను వంటగదిలోని క్యాబిన్లు, మరియు వెలుతురు మరియు వేడి తక్కువుగా ఉండే ప్రదేశాల్లో నిల్వచెయ్యడం ఉత్తమం. చాలా ఆహార వర్తకులు మరియు ఇంటివద్ద వారుకూడా వాడిన నూనెనే తిరిగి మల్లి వాడుతూ ఉంటారు, ఇటువంటి నూనెలో చేసిన ఆహారాన్ని తరచూ తినడం వలన ఊబకాయం మరియు జీర్ణ సమస్యలు తలెత్తేందుకు అవకాశం ఉంటుంది.
నూనెను ఎక్కువ కాలం నిల్వ చెయ్యడం చాలా ప్రమాదకరం. ఛాలా మంది 5 లీటర్లు మరియు పది లీటర్ల డబ్బాలు కొనుగోలు చేస్తారు. హోటల్లవారు ఇలా ఎక్కువ మొత్తం కొనుగోలు చేసిన పర్వాలేదు కానీ ఇంటికి అవసరాలకు కొనుగోలు చేసేవారు మాత్రం నెలకు సరిపడా వంట నూనెను కొనుగోలు చెయ్యడం మంచిది. నూనె కొనుగోలు చేసే ముందు దానిమీదున్న గడువు తేదీని రెండు-మూడు సార్లు పరీక్షించుకొని కొనుగోలు చెయ్యాలి. ఆలివ్ నూనె ఉపయోగించేవారు, కాంతి మరియు వేడి నుండి దూరంగా ఉంచగలిగితే కనీసం మూడు నెలల వరకు నిల్వచేసుకోవచ్చు. వీటితోపాటు ఈ మధ్యకాలంలో మార్కెట్లోకి కల్తీ నూనె ఎక్కువుగా సరఫరా అవుతుంది. బ్రాండెడ్ ఆయిల్ పేరుతో ఈ కల్తీ నూనె విక్రయాలు చాలా ఎక్కువుగా ఉంది. ఇటువంటి నూనె వాడటం వలన ప్రజల ఆరోగ్యం దెబ్బతినవచ్చు. కాబట్టి వినియోగదారులు జాగ్రత్త వహిస్తూ సరైన నూనెను ఎంచుకోవాలి, అవసరమైతే ఒకటికి రెండుసార్లు పరీక్షించిన తరువైతే కొనుగోలు చెయ్యాలి.
Share your comments