Health & Lifestyle

ప్రకృతే మనం..

CH Krupadevi
CH Krupadevi
prakrute manam
prakrute manam

అందమైన ప్రకృతి ,ఈ మాట వింటేనే మనిషికీ-మనసుకి ఏదో తెలియని ఆనందం. అంటే, మనిషి మనసు ప్రకృతిలో ఓ భాగం. అందుకే ప్రకృతి ఒడిలో నివసించే  మనం కలుషితం కాని గాలి , నీరు, ఆహారం కోసం ప్రతిక్షణం పరితపిస్తూ ఉంటాం. అంటే ప్రకృతి అంటే ఎక్కడో లేదు మనమే ప్రకృతి, ప్రకృతే మనం. కాబట్టి, మానవ మనుగడకు హాని చేసే,ఏ  అంశంలో నైనా, ప్రకృతి ప్రమేయం లేకుండా, మానవ కృత్రిమ మేధస్సుతో అంకురించే వాటి పర్యవసానాలు ప్రకృతి జీవన విధానాలకు భిన్నంగా మారిపోతున్నాయి. అందుకే ప్రకృతిని పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రపంచ  మానవాళి పైన ఉందని, 1970 జూలై 28న గ్లోబల్ కన్సర్వేషన్ ఆర్గనైజేషన్ వరల్డ్ వైల్డ్ లైఫ్ పౌండేషన్ వారు ఒక నివేదికను తయారుచేసి విడుదల చేయడం జరిగింది.అప్పటినుండి ప్రతీ సంవత్సరం ప్రపంచ  సహజ వనరుల పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకోవడం మొదలైయింది. భూగ్రహం మీద మానవ అసహజ కృత్యాల వలన ఒత్తిడి  పెరిగిపోతుందని, మానవుడు ఆధారపడి జీవించే సహజ వనరులు 33శాతం తగ్గుతున్నాయని, భవిష్యత్ తరాలకు ఈ భూగ్రహం పైన మనుగడ  ఉండాలంటే,  నేటి తరాలు ప్రకృతిని ప్రేమించి, పరిరక్షించాల్సిన అవసరం ఉందనేది ఆ నివేధిక సారాంశం.

సాంకేతికత, మానవ జీవన విధానాల అభివృద్ధి పేరుతో ఈ ప్రపంచాన్ని ప్రకృతి నుండి వేరు చేసే ప్రయత్నంలో  మానవ మేధస్సు ముందడుగులు వేస్తుంది.ఈ నయా పోకడ  మంచి పరిణామం కాదు. ప్రకృతిలో వివిధ జీవులు, జీవరాసుల మధ్య, మానవ మనుగడ మధ్య అసమానతలు పెరిగిపోతున్నాయి. మానవ మనుగడే ఈ భూగ్రహం పైన ప్రశ్నార్ధకంగా మారే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా మానవ సహజ పరిశీలన, క్రియాశీలత, అంతరించిపోతున్నాయి. కృత్రిమ పదార్థాల పైన , జీవన విధానాలపైన, ప్రకృతి వినాశన కరమైన ఆలోచనల పైన ఆధునిక మానవుడి మేధస్సు పరుగులు పెడుతోంది. మానవులం ఎక్కడ నుండి ఉద్భవించాము. దాని ఉనికినే మర్చిపోతే, మనకు మూలమైన ప్రకృతి కూడా మనలను  మరిచిపోదా? అన్న మాటకు ఆధారం వాస్తవం కాదా? అభివృద్ధి అంటే ఏమిటి? ఎవరి మనుగడ కోసం సాంకేతికాభివృద్ధి? నేడు

గాలిని కలుషితంచేసి,గాలినికొంటున్నాము.అవసరంలేని ఉత్పాదకతకీ పెద్దపీటవేసి పరిశ్రమలలో నీటి  వాడకంతో పోటీపడి నీటినికొంటున్నాము. నేలతల్లి ఎదపై హద్దులు గీసీ, భాగాలుగా పంచుకుంటున్నాం. ఆకాశవీధినే సొంతం చేసుకోవాలని ఆరాటపడుతున్నాం. ప్రకృతిలోని సహజ వనరులను కృత్రిమ వనరులుగా మార్చి మురిసిపోతున్నాం. మానవ మనుగడనే మరిచిపోతున్నాం.మరి చివరికి "జీవమే" ప్రకృతిలో అంతమైతే? దానిని ఎక్కడ నుండి, ఎవరి దగ్గర నుండి తీసుకుంటాం? ప్రకృతి సమాజంలో, మానవ మనుగడలో భాగమైన, ప్రతి మనిషి ఆలోచించాల్సిన అవసరం ఉంది. తరతరాలుగా ఈ భూగ్రహం పైన ఆరోగ్యంగా,  ఆనందంగా, సంచరించి, జీవించి ప్రకృతి ఒడిలోకి చేరిన  మన ముందు తరాల బాటసారులకు వారసులం. ప్రకృతికే సొంతమైన సహజ వనరుల దోపిడి పైన మనకెందుకో ఈ వ్యామోహం?

ప్రకృతిలో భాగమై ఉన్న అడవులను, వివిధ జాతులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ఆధునికత పేరుతో రోజు రోజుకి ఈ భూమిపైన చెట్లను నరికి విలాసవంతమైన, సాంకేతిక భవనాల నిర్మాణాలు ఎక్కువైపోతున్నాయి. ఇలాంటి కృత్రిమ నిర్మాణాల వలన జీవ వైవిధ్యం లోపించి, భూమి ఉష్ణోగ్రతలు పెరిగిపోయి, ప్రకృతి విపత్తులకు దారితీసే అవకాశం ఉంది. సముద్ర మట్టం పెరిగి పోయి భూగ్రహం జలసమాధి అయ్యే అవకాశాలు లేకపోలేదు. మంచి నీటిని అందించే హిమనీనదాలు కరిగిపోయి సముద్రంలో కలిస్తే, మంచినీటి కోసం జీవకోటి పోరాటం చేయాల్సి వస్తుంది.  ఈ విధంగా ప్రకృతి పరిరక్షణ అందరి బాధ్యతగా తీసుకోకపోతే రాబోయే తరాలు గాలి కోసం, నీటి కోసం, ప్రకృతికోసం యుద్దాలు చేసుకోక తప్పదు.

ప్రకృతిలో ప్రాణం పోసుకున్న ప్రతి జీవి ఓ ప్రత్యేకతను కలిగి ఉంటుంది. జీవకోటి మనుగడ అనేది ఒకదానిపై మరొకటి ఆధారపడి బతికేలా రూపుదిద్దుకొని సృష్టించబడింది. ఎందుకంటే,  మనం తినే ఆహారమొక్కలు, పక్షులు,  తేనెటీగలు ఇతర కీటకాల, రవాణా సంచారం వలన

 పరాగసంపర్కం చెందుతాయి. వీటితోనే ఆ మొక్కలకు పోషకాలు లభిస్తాయి. వీటినే ఆహారంగా తీసుకుంటాము. మన జీవన విధానం, ప్రకృతిలో నివసించే ప్రాణులతో ముడిపడి ఉంటుంది.

ఈ విశ్వంలో మానవుడు తన సొంతగా దేనిని తయారు చేయలేదు. ప్రకృతిలో జనించిన దాన్ని వేల సంవత్సరాల తరువాత పుట్టిన మానవుడు ప్రకృతిలో సహజంగా ఉండే ఖనిజాలను, సహజ వనరులను, పోషకాలను గుర్తించి, సహజంగా, ఆరోగ్యంగా జీవించడం నేర్చుకున్నాడు. కానీ,  నేటి ఆధునిక మానవుడు డబ్బు అనే ప్రకృతికి అవసరం లేని ఒక వింత వస్తువును ప్రతి సృష్టి చేసి, ప్రకృతిని దానితో వేలం వేయాలని ప్రయత్నించి, ఓడిపోతున్నాడు. ప్రకృతిలో భాగమై, ప్రకృతిలో సహజంగా లభించే ప్రతి ఆహారానికి ధరకట్టి మానవ మనుగడకే అర్దాన్ని 'అర్థం' (ధనం)గా మార్చుతున్నాడు. ఇలాంటి వినాశనకరమైన ప్రయోగాల వలనే ప్రకృతికి,  మానవాళి పైన కోపం వస్తుంది. తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో మనిషిని సైతం మర్చిపోయే ప్రయత్నంచేస్తుంది. ప్రపంచం ఓ చిన్న సమాజంగా మారిన, వివిధ దేశాలు, రాష్ట్రాలు, ప్రాంతాల మధ్య ఉండే భిన్నమైన జీవన విధానాల వైరుధ్యాల వలన ప్రపంచవ్యాప్తంగా నష్టమే కానీ లాభాలు తక్కువే. ప్రకృతి మనలను సృష్టించి కాపాడుతుంది. దానిని పరిరక్షించడం ప్రపంచ మానవాళి అందరి బాధ్యత, హక్కు.  మనకు ఎంత కావాలో ప్రకృతి నుండి అంతే తీసుకుంటే ఏ సమస్య ఉండదు. కానీ అత్యాశ ధోరణితో ముందుకు పోతే ప్రకృతి ఒడిలో వనాలు,  జనాలు అన్ని సమానమై పోతాయి.                

కృపాదేవి చింతా (ఐ)

28-07-2020

Related Topics

prakrute manam

Share your comments

Subscribe Magazine