Health & Lifestyle

మల్బరీతో ప్రయోజనాలెన్నో..

KJ Staff
KJ Staff

చూడ్డానికి చిన్న చిన్న పురుగులన్నీ కలిసి ఉన్నట్లుగా కనిపించే మల్బరీ పండ్లు చాలామందికి పరిచితమే.. వీటిని ఎక్కువగా పట్టు పురుగుల పరిశ్రమలో ఉపయోగిస్తుంటారు. అయితే ఈ చెట్టు ఆకులను మాత్రమే పట్టు పురుగులకు వేస్తారు. పండ్లను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.

అందుకే మీకు వీలున్నప్పుడల్లా ఈ పండ్లను తింటూ మీ ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోండి. ఇవి ఎక్కువగా మార్చి నుంచి మే వరకు తిరిగి అక్టోబర్ నుంచి నుంచి నవంబర్ వరకు లభిస్తాయి. ఇవి భారత్ తో పాటు ఎన్నో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న దేశాల్లో పండుతాయి. ఇవి చైనాలో పుట్టినట్లుగా ఆధారాలున్నాయి. అయితే ప్రపంచమంతా ఇవి వ్యాపించాయి. వీటి రుచి ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. తియ్యతియ్యగా పుల్లపుల్లగా ఆకట్టుకునేలా ఉంటాయి ఈ బెర్రీలు.

ఈ బెర్రీలు చాలా వేగంగా పెరుగుతాయి. చిన్నగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో ఉండే ఈ బెర్రీలు సైజ్ పెరిగిన కొద్దీ ముందు గులాబీ రంగులోకి, ఆ తర్వాత ఎరుపు, నలుపు రంగుల్లోకి మారతాయి. ఇవి ఎక్కువగా షర్బత్ లు, స్వ్కాష్ లు, జెల్లీలు, సలాడ్స్ వంటివాటిలో ఉపయోగించవచ్చు. ఇందులో పోషకాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఐరన్, విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం, క్యాల్షియం వంటివి ఎక్కువగా ఉంటాయి.

మల్బరీల వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే..

1. జీర్ణ శక్తి బాగుంటుంది.

మిగిలిన పండ్లు, కూరగాయల్లో ఉన్నట్లే మల్బరీల్లో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేందుకు సహాయం చేస్తుంది. ఆహారం జీర్ణ వ్యవస్థలో వేగంగా కదిలేలా చేస్తుంది. మల బద్ధకం, గ్యాస్, కడుపుబ్బరం, నొప్పి వంటివి రాకుండా కాపాడుతుంది.

2. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

మల్బరీల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల పెరుగుదలకు దోహదం చేస్తుంది. రక్త కణాలు మిగిలిన శరీర కణాలకు ఆక్సిజన్ వేగంగా సప్లై చేసేందుకు కూడా ఇది దోహదం చేస్తుంది. ఇది మెటబాలిజంని వేగవంతం చేయడంతో పాటు శరీరంలో అన్ని కణాలు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది.

3. రోగ నిరోధక వ్యవస్థ బలోపేతమవుతుంది.

మల్బరీ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరంలో ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా, ఏవైనా వైరస్, బ్యాక్టీరియాలు శరీరంలోకి ప్రవేశిస్తే వాటిని ఈ విటమిన్ సి నశింపజేస్తుంది. లోపలి నుంచి మిమ్మల్ని బలంగా మారుస్తుంది. అయితే ఇది మన శరీరంలో నిల్వ ఉండలేదు. నీటిలో కరిగే ఈ విటమిన్ శరీరం నుంచి వేగంగా బయటకు వెళ్లిపోతుంది. అందుకే దీన్ని రోజూ మన ఆహారం ద్వారా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఒక కప్పు మల్బరీలు తింటే ఒక రోజుకి కావాల్సిన విటమిన్ సి మన శరీరానికి అందుతుంది. ఇవన్నీ తినలేకపోతే ఒక గ్లాస్ మల్బరీ జ్యూస్ తాగినా సరిపోతుంది.

4. చర్మాన్ని కూడా కాపాడుతుంది.

మల్బరీ ఆకులు పొడి చర్మాన్ని, సెన్సిటివ్ చర్మాన్ని మామూలుగా మార్చేందుకు ఉపయోగపడుతాయి. ఇందుకోసం వాటిని కొబ్బరి లేదా ఆలివ్ నూనెలో వేసి కొన్ని రోజులు ఉంచి ఆ నూనె చర్మానికి అప్లై చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల చర్మం పొడిబారకుండా కాపాడుకోచ్చు. అంతే కాదు.. ఇవి ముడతలను కూడా తగ్గిస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల వీటిని తరచూ తినడం వల్ల మెరుస్తూ, యవ్వన కాంతితో ఉన్న చర్మం మీ సొంతమవుతుంది.

5. జుట్టుకు కూడా మంచిది.

మల్బరీని తరచూ తినడం వల్ల శరీరంలోని మెలనిన్ పెరుగుతుంది. ఇది మీ జుట్టు సహజసిద్ధంగా నల్లగా ఉండేలా చేస్తుంది. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతున్న వారికి ఇది బాగా పనిచేస్తుంది. ఇలాంటి వారు తరచూ మల్బరీ జ్యూస్ తాగుతుండాలి. దీనివల్ల మీ జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. ఈ జ్యూస్ ని జుట్టుకు కూడా పట్టించవచ్చు. దీనివల్ల మీ జుట్టు పట్టులా మెరుస్తుంది.

6. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

మల్బరీలు మీ గుండెకు ఎంతో మంచివి. ఇది మీ నరాలను బలంగా మారుస్తుంది. రక్త ప్రసరణ వ్యవస్థను కూడా మెరుగుపర్చి రక్త నాళాల్లోని చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి. దీనివల్ల గుండె పోటు వచ్చే ముప్పు తగ్గుతుంది. స్ట్రోక్, గుండె పోటు ముప్పును తగ్గించేందుకు ఇది తోడ్పడుతుంది.

7. కంటి చూపు మెరుగుపరుస్తుంది.

మల్బరీ మీ కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. ఇందులో విటమిన్ ఎ శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇది కంటి చూపును కూడా మెరుగుపర్చేందుకు సాయపడుతుంది. కళ్లు అలసిపోకుండా, కంటి చూపు లోపాలు లేకుండా చేస్తుంది. మల్బరీ కళ్లను ఫ్రీ రాడికల్స్ బారి నుంచి కూడా కాపాడుతుంది. దీనివల్ల మామూలుగా కంటి చూపు లోపాలు, రెటీనా డీజనరేషన్ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇవి ఎదురు కాకుండా ఉండాలంటే తరచూ మల్బరీని ఆహారంలో భాగంగా తీసుకోవాల్సి ఉంటుంది.

8. డయాబెటిస్ తగ్గిస్తుంది.

సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారు వివిధ రకాల పండ్లను తినాలని ఆశ ఉన్నా వాటిని తినడం సరైనదో కాదో అని ఆలోచిస్తుంటారు. కానీ టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు కూడా మల్బరీ తీసుకోవడం ఎంతో మంచిది. ఇందులోని ప్లాస్మా గ్లూకోజ్ ని తగ్గిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు దీన్ని వీలైనంతగా తీసుకోవాలని నిపుణులు వెల్లడిస్తారు.

https://krishijagran.com/health-lifestyle/amazing-health-benefits-of-mulberry-and-its-nutritional-facts/

https://krishijagran.com/agripedia/everything-about-the-scintillating-business-of-silk-industry/

Share your comments

Subscribe Magazine