మన శరీరం ఆరోగ్యం బాగుండాలంటే కాలేయ పనితీరు బాగుండాలి. లివర్ మన తీసుకునే ఆహారంలో గ్లూకోస్, విటమిన్లు మరియు ప్రోటీన్లు వంటి పోషకాలను, శరీరానికి అవసరమైన విధంగా మారేలా చేస్తుంది. అంతేకాకుండా శరీరానికి హానికారకమైన అమోనియాని యూరియాగా మార్చుతుంది, ఇది మూత్రం రూపంలో బయటకు పోతుంది. ధూమపానం మరియు మద్యపానం చేసే వ్యక్తుల్లో వాటి ద్వారా కలిగే హానికారక ప్రభావం నుండి శరీరాన్ని రక్షిస్తుంది. ఇలా లివర్ ఎన్నో విధాలుగా మనకు తోడ్పడుతుంది, దీనిని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. కాలేయ ఆరోగ్యానికి పాటించవలసిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పీచు పదర్ధాలు మన ఆరోగ్యానికి ఎంతో మంచివి. మన ప్రతిరోజు తీసుకునే ఆహారంలో పీచు పదర్ధాలు కూడా సమపాలలో ఉండేలా చూసుకోవాలి. పీచు పదార్ధాలు కాలేయం ఆరోగ్యాన్ని రక్షించి దీని పనితీరు మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. పీచు పదర్ధాలు ఎక్కువుగా ఉన్న ఆహారాన్ని ఉదయానే తింటే మరింత ఎక్కువ మేలు జరుగుతుంది, ఇందుకోసం ప్రతిరోజు జొన్నలు, రాగులు, సజ్జలు వంటి పొట్టుతీయ్యని చిరుధాన్యాలు ఉదయానే అల్పాహారంగా తీసుకోవడం మంచిది. వీటితోపాటు పండ్లు, కాయగూరలు మరియు మెంతుల్లో కూడా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
ప్రస్తుత కాలంలో యువత జంక్ ఫుడ్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కాలేయం ఆరోగ్యం దెబ్బతియ్యడంలో జంక్ ఫుడ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. జంక్ ఫుడ్ లోని సంతృప్త కొవ్వులు, ఎక్కువగా తీసుకుంటే కాలేయం ఆరోగ్యం దెబ్బతిని, పనితీరు మందగిస్తుంది. కాబట్టి బర్గర్, పిజ్జా, ఫ్రైస్ వంటివాటికి వీలైనంత దూరంగా ఉండటం మంచిది. ఫ్యాటీ లివర్ ఉందంటే లివర్ ఆరోగ్యం దెబ్బతింది అని అర్ధం, ఈ సమస్యతో బాధపడేవారు ఉడికించిన బ్రొకోలీని తినడం మంచిది. దీనిని నీటిలో కొద్దిసేపు ఉడికించి, ముక్కలుగా చేసి, కొంచెం నూనెలో వేయించి తింటే లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
లివర్ ఆరోగ్యం దెబ్బతినడానికి ఊబకాయం మరొక్క ముఖ్యమైన కారణం. బరువు పెరగడానికి చెక్కర కూడా ఒక కారణం కావచ్చు. బరువును నియంత్రణలో ఉంచుకుంటే లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి చెక్కర ఎక్కువ ఆహారం, శీతల పానీయాలు వంటివి తగ్గించి నీటిని తాగడం ప్రారంభించాలి. నీరు తాగడం వలన లివర్ శుభ్రమవుతుంది. నీరు బరువు తగ్గించడంలో కూడా సహాయం చేస్తుంది. లివర్ ఆరోగ్యానికి ఆకుకూరలు కూడా ఎంతో తోడ్పడతాయి. పాలకూర, బచ్చలికూర, మెంతికూర, తోటకూర, వంటి మొదలైన ఆకుకూరల్లో గ్లూటాతియోన్ అనే యాంటీఆక్సిడెంట్ మరియు పీచు పదార్ధాలు పుష్కలంగా ఉండటం వలన లివర్ సాఫీగా పనిచేయడానికి తోడ్పడుతుంది. అలాగే ఉప్పు ఎక్కువుగా తినేవారు దీనిని తినడం కాస్త తగ్గించడం మంచిది. ఉప్పులో సోడియం కాలేయంలో సెల్స్ గట్టిపడటానికి మరియు వాపుకు కారణమవుతుంది కాబట్టి వీలైనంత మేరకు ఉప్పు తక్కువుగా తినడానికి ప్రయత్నించాలి.
కాలేయం ఆరోగ్యానికి అతి పెద్ద శత్రువు మద్యపానం, మరియు ధూమపానం. వీటిలోని కొన్ని హానికరకాలు లివర్ లోని కణాలు గట్టిపడేలా చేస్తాయి. అంతేకాకుండా కాలేయాన్ని కలుషితం చేసి దాని నుండి వెలువడే ఎంజైములను తగ్గిస్తుంది, దీనివలన ప్రోటీన్లు మరియు ఇతర పోషకాలు జీర్ణం కావు. కాబట్టి మద్యపానానికి దూరంగా ఉండటం ఉత్తమం.
Share your comments