మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ సి కీలక పాత్ర పోషిస్తుంది. మనం తీసుకునే ఆహారంలో విటమిన్ సి లోపిస్తే ఇమ్యూనిటీ పవర్ తగ్గి ప్రమాదకర వ్యాధులకు కారణమవుతుంది .ముఖ్యంగా మనం తీసుకునే ఐరన్ వినియోగం తగ్గి ప్రమాదకర రక్తహీనత సమస్య , చిగుళ్ల నుంచి రక్తస్రావం కావడం, గాయాలు త్వరగా మానకపోవడం, దంతక్షయం జీవక్రియ రేటు తగ్గడం వంటి సమస్యలతో సతమతం అవ్వాల్సి ఉంటుంది.
సాధారణంగా విటమిన్ సి మూలకం మన శరీరంలో నిల్వ ఉండటం జరగదు. కావున ప్రతిరోజు విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లు కూరగాయలు తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా రుచికి పుల్లగా ఉన్నటువంటి నారింజ,బత్తాయి, కివి,జామ, యాపిల్,బ్రోకలీ, స్ట్రాబెర్రీ, ద్రాక్ష,ఉసిరి వంటి పండ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన విటమిన్ సి సమృద్ధిగా లభించి వివిధ రకాల సీజనల్ వ్యాధులతో పాటు దీర్ఘకాలిక రోగాలను సైతం ఎదుర్కొనేలా వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడతాయి.
సాధారణంగా మన రోజువారీ జీవక్రియలకు అవసరమైన విటమిన్-సి మోతాదు వివరాలు చూసినట్లయితే పురుషులకు 90 మి.గ్రా, మహిళలకు 75 మి.గ్రా,గర్భిణీ స్త్రీలకు 85, మి.గ్రా, పాలిచ్చే తల్లులకు 120 మి.గ్రా ప్రతిరోజూ ఆహారంలో తీసుకోవడం తప్పనిసరి.
అలాగని విటమిన్-సి మూలకాన్ని మోతాదుకు మించి తీసుకున్న శరీరంలో ఐరన్ నిల్వలు పెరిగి మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావం చూపడమే కాకుండా, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, గుండెల్లో మంట, తలనొప్పి, నిద్రలేమి వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.
Share your comments