విటమిన్లు శరీర సంరక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. అందువల్ల సరైన స్థాయిలో శరీరానికి విటమిన్లను అందించకపోతే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కే విటమిన్ శరీరానికి అందాల్సిన వాటిల్లో ప్రధానమైనదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే విటమిన్ కే లోపం కారణంగా గాయాలు అయినప్పుడు రక్తం గడ్డే కట్టే స్వభావం తగ్గిపోతుందని పేర్కొంటున్నారు. చిగుళ్ల నుంచి రక్తం కారడం చిన్న గాయం అయినా బాగా రక్తస్రావం అవడం రక్తం బాగా పోవడం జరుగుతుంది. అలాగే, స్త్రీలకు రుతు సమయంలో తీవ్ర రక్త స్రావం అవడం మూత్రం లేదా మలంలో రక్తం రావడం వంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయని వెల్లడిస్తున్నారు. చర్మం సైతం సహజ రంగును కోల్పోతుందనీ, చర్మ సంబంధ వ్యాధులు సైతం వస్తాయని చెబుతున్నారు.
ఇలాంటి అనేక రకాల అనారోగ్య సమస్యలు రాకుండా కే విటమిన్ ను పుష్కలంగా అందించే ఆహార పదర్థాలు తీసుకోవాలని చెబుతున్నారు. కే విటమిన్ ను అందించే కొన్ని ఆహార పదర్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. విటమిన్ కే పాటు ఇతర విటమిన్లు ఆకుకూరల్లో పుష్కలంగా ఉంటాయి. పండ్లలోనూ అధికంగానే ఉంటాయి. ఆకుకూరల విషయానికి వస్తే.. పాలకూర, తోటకూర, గోంగూర, బచ్చలి కూర వంటి ఆకుకూరల్లో విటమిన్ కేతో పాటు శరీరానికి అవసరమైన ఇతర పోషకాలు అనేకం ఉంటాయి. కాబట్టి వీటిని ఆహారంగా తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
విటమిన్ కే కలిగిన పండ్లలో కివి పండు ముందు వరుసలో ఉంటుంది. కివి పండ్లలో శరీర రోగ నిరోధక శక్తి పెంచే అనేక రకాలు పోషకాలు ఉంటాయి. దానిమ్మలోనూ పోషకాలు పుష్కలంగానే ఉంటాయి. విటమిన్ కే అధికంగా ఉన్న దానిమ్మ తినడం వల్ల శరీరంలో రక్తం శాతం కూడా పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుదలలో కీలకంగా ఉంటుంది. వీటితో పాటు మస్టర్డ్ గ్రీన్, క్యాబేజీ, తులసి, పార్లేలలో కూడా విటమిన్ కే అధికంగా ఉంటుంది. కాబట్టి మనం నిత్యం తీసుకునే ఆహారంలో కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Share your comments