వర్షాకాలం రావడంతో, ఉన్నటుంది వాతావరణ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. వాతావరణ ఉష్ణోగ్రతల్లో మార్పుల వలన ఆస్తమా లాంటి దీర్ఘకాలిక సమస్యలున్నవాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో కదా. విలువైన ప్రొడక్టివ్ డేస్ ఎన్నింటినో నష్టపోతారు ఆస్తమా పేషెంట్లు. గాలి పీల్చుకోకుండా ఎవరైనా ఒక్క నిమిషమైనా ఉండగలరా ? కానీ ఆస్తమా పేషెంట్లకు గాలి పీల్చుకోవడమే పెద్ద టాస్క్. ఆస్తమా పేషెంట్లు ఇంట్లో ఒక్కరుంటే చాలు. ఇక పేషెంటుతో పాటు ఆ ఇంట్లో వాళ్లకి నరకమే. ముక్కు ద్వారా పీల్చుకున్న గాలిని ఊపిరి తిత్తుల వరకూ తీసుకెళ్లేవి శ్వాస నాళాలు లేదా గాలి గొట్టాలు. ఇవి దుమ్ము, ధూళి, పూల పుప్పొడి లాంటి కొన్ని రకాల పదార్థాలతో ప్రభావితం అయినప్పుడు గాలి గొట్టాలు వాచిపోయి, గాలి లోపలికి సరిగా వెళ్లలేదు.
చలిలో అందరూ తిరుగుతారు. కొందరికి మాత్రమే జలుబు చేస్తుంది. దుమ్ము అందరి మీద పడ్డా కొందరికి మాత్రమే ఎక్కువ తుమ్ములు వస్తాయి. వారి జన్యుపరమైన స్వభావమే ఇందుకు కారణం. కొన్ని పదార్థాలు వీళ్లకి పడవు. అలా అలర్జీకి సంబంధించిన జన్యువులు ఉన్నవాళ్లలోనే ఆస్తమా కనిపిస్తుంది. తల్లిదండ్రులిద్దరిలోనూ ఆస్తమా జన్యువులు ఉంటే బిడ్డకు వచ్చే అవకాశం 90 శాతం ఉంటుంది. ఇద్దరిలో ఒక్కరికే ఉంటే పిల్లలకు ఆస్తమా వచ్చే అవకాశం 45 శాతం కన్నా ఎక్కువే ఉంటుంది. తల్లిదండ్రులకు ఎవరికీ లేకపోయినా వారి పిల్లలు ఆస్తమాకు గురయ్యే అవకాశం 25 శాతం ఉంటుంది.
సాధారణ జలుబు, బ్రాంకైటిస్‌లకూ, ఆస్తమాకూ తేడా ఏంటో తెలిసినప్పుడే ఆస్తమాకు సరైన చికిత్స ఇవ్వడం సాధ్యమవుతుంది. అందుకే అది ఆస్తమానో కాదో నిర్ధారించుకోవడం అవసరం. అలర్జీ కారక పదార్థాలకు గురైనప్పుడు మాత్రమే ఆస్తమాకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయి. లేకుంటే నార్మల్ గానే ఉంటారు. అయితే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఏ శ్వాసకోశ వ్యాధిలో అయినా ఉంటుంది. దగ్గు అంతే. అందుకే ఆస్తమాను కేవలం లక్షణాలతో మాత్రమే నిర్ధారించలేము. శ్వాసనాళాలు, ఊపిరితిత్తుల పనితీరు ఎలా ఉందో తెలుసుకునే పరీక్షలు కూడా అవసరం అవుతాయి. చిన్నపిల్లలకు మాత్రమే ఉబ్బస వ్యాధి ఉంటుందనుకుంటే పొరపాటు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఎవరికైనా ఆస్తమా రావొచ్చు. ప్రెగ్నెంట్ గా ఉన్నవాళ్లలో కూడా ఆస్తమా దాడి చేయొచ్చు. ఇలాంటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి.
సకాలంలో సరైన చికిత్స ఇవ్వగలిగితే ఆస్తమాను కంట్రోల్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఇన్ హేలర్లను మించిన మంచి చికిత్స లేదంటున్నారు నిపుణులు. ఆస్తమా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. శ్వాసనాళాలు కుంచించుకుపోవడం వల్ల తగినంత గాలి ఊపిరితిత్తులకు వెళ్లడం కష్టమవుతుంది. కాబట్టి దీనికి నోటి ద్వారా వేసుకునే మాత్రల కన్నా డైరెక్ట్ గా శ్వాసనాళాల్లోకి వెళ్లగలిగే ఇన్హేలర్లే మంచి పరిష్కారం. ఇన్ హేలర్లు ఆస్తమా ముదిరిపోయిన తరువాత వాడే చికిత్స కాదు. ఆస్తమాకు ఉన్న మేలైన చికిత్స ఇన్ హేలర్లే.
Share your comments