Health & Lifestyle

క్యారెట్ కంటికే కాదు... గుండెను కూడా కాపాడుతుంది.. ఎలాగంటే?

KJ Staff
KJ Staff

సాధారణంగా మనం మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలంటే తాజా పండ్లు కూరగాయలు తినాలని నిపుణులు తెలియజేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజా కూరగాయలలో ఒకటైన క్యారెట్లు తినడం వల్ల కంటిచూపు ఎంతో మెరుగు పడుతుందని మన అందరికీ తెలిసిన విషయమే.క్యారెట్లో విటమిన్ ఏ అధికంగా ఉండటం వల్ల కంటిలో ఏర్పడే సమస్యలను తొలగించడమే కాకుండా రేచీకటి వంటి వ్యాధులను దూరంగా ఉంచుతూ కంటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.

క్యారెట్ కేవలం కంటిని మాత్రమే కాకుండా గుండెను కూడా కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తుందని తాజాగా ఇల్లినాయిస్‌ యూనివర్సిటీకి చెందిన నిపుణులు వెల్లడిస్తున్నారు. క్యారెట్ లో అధిక భాగం బీటా కెరోటిన్‌ ఉంటుంది. మనం తీసుకుని ఆహారంలో భాగంగా క్యారెట్ తీసుకున్నప్పుడు ఇందులో ఉన్నటువంటి బీటా-కెరోటిన్ మన శరీరంలోకి చేరిన తర్వాత విటమిన్ ఎ గా మార్పు చెందుతుంది.

ఈ విధంగా క్యారెట్లో ఉండే బీటా-కెరోటిన్ విటమిన్ ఎ గా మార్పు చెందే సమయంలో మన రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుందని పరిశోధకులు వారి అధ్యయనంలో తెలియజేశారు. అదే విధంగా గుండె జబ్బులకు కారణమయ్యే అథెరోస్కెలెరోసిస్‌ వృద్ధి చెందకుండా బీటా-కెరోటిన్ దోహదపడుతుంది.

అథెరోస్కెలెరోసిస్‌ అనగా గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోతుంది. ఈ విధంగా రక్తనాళాలలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా, గుండెను అనారోగ్యాన్నికి గురి కాకుండా క్యారేట్ కాపాడుతుంది. ఈ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు ఎలుకలపై మనుషులపై ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో 18 నుంచి 25 సంవత్సరాల వయసున్న యువకుల బ్లడ్, డీఎన్ఏ నమూనాలను సేకరించి పరిశోధనలు నిర్వహించారు.

ఈ పరిశోధనలో భాగంగా బీటాకెరోటిన్ విటమిన్ ఏ గా మార్పు చెందుతున్న సమయంలో శరీరంలో ఏర్పడిన చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతున్నట్లు పరిశోధకులు గుర్తించారని ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు వెల్లడించారు. కనక ఇప్పటినుంచి కంటితో పాటు గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా మన డైట్ లో క్యారెట్ ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

Share your comments

Subscribe Magazine