సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.బయట ఎండలు మండుతున్నాయి. ఈ వేసవిని అధిగమించడానికి పండ్ల రసాలు మరియు చల్లటి మజ్జిగ తో పాటు సబ్జా గింజలు కూడా ఈ వేసవి నుండి ఉపశమనం అందిస్తాయి.
ఈ వేసవి తాపాన్ని తట్టుకోలేక మనం బయట మార్కెట్ లో అందుబాటులో ఉన్న పానీయాలు ఇష్టానుసారంగా తాగేస్తుంటాం. కూల్ డ్రింక్స్, నిల్వ ఉంచిన జ్యూస్లు, రంగు రంగుల షరబత్లు ఇలా రోడ్డు మీద నాణ్యత లేని ప్రతీది సేవిస్తుంటాం.అయితే ఈ వేసవి తాపాన్ని జయించడానికి మన ఇంట్లోనే ఒక పానీయం ఉంది, అదే సబ్జా గింజల పానీయం.
వేసవిలో సబ్జా గింజల పానీయం తాగితే ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు కూడా చెబుతున్నారు.ముఖ్యంగా శరీరంలో వేడిని తగ్గించడంలో సబ్జా గింజలు ఎంతో దోహద పడుతాయి.
అంతే కాకుండా వీటిని తీసుకోవడం వలన ఒంట్లో వేడిని తట్టుకునే శక్తి కూడా పెరుగుతుంది.అందుకే సబ్జా గింజలకి వేసవి లో ఎంతో ప్రత్యేకత ఉంది.
సబ్జా గింజల్లో ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలోని కొవ్వు కరిగించడానికి, బరువు తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే సబ్జల్లో ఉండే ఫైబర్ వల్ల కొవ్వు సులువుగా కరిగిపోతుంది.
ఈ సబ్జా గింజల పానీయం కేవలం ఒంట్లో వేడిని నియంత్రించడమే కాకుండా మన ఒంటికి ఎంతో మెరుగైన ఆరోగ్యాన్ని ఇస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక బరువు, మలబద్ధకం, మధుమేహం, డీహైడ్రేషన్ వంటి వ్యాధులను ఎదుర్కోవడం లో సబ్జా గింజలు సహకరిస్తాయి.
సబ్జా గింజలను కాసేపు నీళ్ళల్లో నానబెట్టి ఆ తర్వాత ఒక గ్లాసు లో కాస్త పంచదార కానీ ఉప్పుని కానీ వేసుకొని సేవించాలి. వీటిని మజ్జిగ ద్వారా కూడా తీసుకున్న కూడా మంచి పలితాలు ఉంటాయి.
సబ్జా గింజల్లో పీచు పదార్థం అధికంగా ఉండటం వలన మలబద్ధకం సమస్యని ఎదుర్కోవచ్చు .రోజూ ఒక గ్లాసు సబ్జా గింజల పానీయం తాగితే మలబద్ధక సమస్యని సునాయాసంగా అధిగమించవచ్చు.
మరిన్ని చదవండి.
Share your comments