వేసవి కాలంలో సూర్యుని ప్రతాపంతో, శారీరం వేగంగా డిహైడ్రాట్ అవుతుంది. శరీరంలో నీటితో పాటు, ఇతర లవణాలను కోల్పోతుంటాం, తద్వారా కళ్ళు తిరగడం, వడ దెబ్బ భారిన పడటం వంటివి జరుగుతాయి. కనుక శరీరానికి అవసరమైనంత నీటిని తాగడం ఉత్తమంగా, నీటితో పాటుగా, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం వలన శరీరానికి అవసరమైన నీటితో పాటు, ఖనిజాలు కూడా లభ్యమవుతాయి. ముఖ్యంగా విటమిన్-సి అధికం ఉండే ఫలాలను తీసుకోవడం ఎంతో అవసరం. దానిమ్మ, కివి, ద్రాక్ష, నారింజ, బత్తాయి, మరియు చెర్రీలలో విటమిన్- సి పుష్కలంగా దొరుకుతుంది. విటమిన్-సి ఉన్న ఫలాలను తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమయ్యే శక్తి లభిస్తుంది. వేసవి కాలంలో రోగాల భారిన పడే అవకాశం ఎక్కువ, విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడుతుంది.కొన్ని అధ్యయనాల ప్రకారం రోజుకి కనీసం 80-90 మిల్లీగ్రాముల విటమిన్-సి తీసుకోవాల్సిన అవసరం ఉంది. విటమిన్-సి అధికంగా ఉన్న పళ్ళు తీసుకోడం వల్ల లాభాలు ఇప్పుడు తెలుసుకుందాం.
శరీర ఉషోగ్రతలు నియంత్రించడం:
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు కారణంగా, సాధారణ శరీర ఉష్ణోగ్రత కంటే రెండు-మూడు డిగ్రీలు ఎక్కువుగా ఉంటుంది. చెమట అధికంగా పట్టడం ద్వారా శరీర ఉష్ణోగ్రత నియంత్రించబడుతుంది. శరీరంలోని నీటి శాతాన్ని కాపాడేందుకు విటమిన్-సి అధికంగా దొరికే పైన్ఆపిల్, పుచ్చకాయ, మరియు నారింజ తోడ్పడతాయి. వీటి ద్వారా అదనంగా లభించే ఎలెక్ట్రోలైట్లు, యాంటీఆక్సిడాంట్లు ఎండా వేడి నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి.
సూర్య కిరణాల నుండి రక్షణ:
చాలా మంది సన్ ఎలర్జీతో భాదపడుతూ ఉంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో సన్ అలెర్జిస్ చర్మంపై, రాషెస్ రావడానికి, చర్మం నల్లబడటానికి కారణం అవుతాయి. అలాగే సూర్యుని నుండి వచ్చే యూవీ కిరణాలూ చర్మానికి అధిక నష్టాన్ని కలిగిస్తాయి. వీటి నుండి చర్మాన్ని కాపాడుకునేందుకు విటమిన్-సి ఉన్న బొప్పాయి, జామ,మరియు బత్తాయి సహాయపడతాయి. విటమిన్-సి యూవీ కిరణాల నుండి శరీరానికి రక్షణ కల్పించడంతో పాటుగా, చర్మానికి మంచి నిగారింపుని అధిస్తుంది.
మెరుగైన జీర్ణవ్యవస్థ:
సాధారణంగా వేసవి కాలంలో ఆకలి మందగిస్తుంది. అధికంగా నీరు తాగడం మరియు జీర్ణవ్యవస్థలో జరిగే కొన్ని మార్పుల కారణంగా ఆకలి తగ్గుతుంది. విటమిన్-సి అధికంగా ఉన్న పళ్లలో ఉండే ఎంజైములు మరియు పీచు పదార్ధాలు జీర్ణవ్యవస్థ మెరుగుపడటానికి దోహదపడతాయి. వేసవిలో అధికంగా దొరికే మామిడి పళ్లలో విటమిన్- సి దొరుకుంటుంది, మామిడి పండులో ఉండే ఫైబర్ తీసుకున్న ఆహరం సరిగ్గా జీర్ణం అయ్యేలా చేస్తుంది.
శక్తిని పెంపొందించడం:
ఎండలు ముదిరేకొద్దీ, వాతావరణంలోని వేడి, మరియు తేమ శాతం అధికమవుతుంది. ఈ రెండిటి కారణంగా చమట అధికంగా పట్టి ఎక్కువ అలసటగా ఉంటుంది. విటమిన్-సి అధికంగా లభించే పళ్లలో దొరికే యాంటీఆక్సిడెంట్లు, శక్తిని అందించి, శరిరం మరియు మెదడు ఉత్సహంగా ఉండేందుకు సహాయపడతాయి. విటమిన్-సి అధికంగా ఉండే పళ్లలో పులుపు ఎక్కువుగా ఉండటం వల్ల పరగడుపున లేదా కాళీ కడుపుతో తినడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఆహరం తిన్న వెంటనే కూడా వీటిని తినకూడదు అలాచేయడం ద్వారా అసిడిటీ వచ్చే అవకాశం ఉంది కనుక భోజనానికి అరగంట ముందు లేదా తరువాత తీసుకోవడం మంచిదని నిపుణుల సూచన.
Share your comments