Health & Lifestyle

బటన్ మష్రూమ్స్ పంటతో భారీ లాభాలు.. సులువుగా ఇలా పండించండి..

KJ Staff
KJ Staff
Mushroom cultivation
Mushroom cultivation

మన దేశంలో తాజాగా ఎక్కువ మంది పోషకాహారం తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. తక్కువ క్యాలరీలతో ఎక్కువ పోషకాలు అందేలా చూడాలని భావిస్తున్నారు.

ఇలాంటివారు ఎక్కువగా పుట్టగొడుగులను ఎంచుకుంటున్నారు. అందుకే వీటిని డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. మరో వైపు దీన్ని పెంచే సంస్థలు కూడా తక్కువగా ఉండడంతో చాలామంది రైతులు పుట్టగొడుగుల పెంపకాన్ని చేపట్టి సులువుగా అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. దీనికి చాలా తక్కువ స్థలం ఉన్నా సరిపోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. బటన్ మష్రూమ్స్ రకానికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. వీటిని పెంచడం కూడా సులువు. వీటికి ప్రత్యేకమైన సీజన్ అంటూ లేదు. సంవత్సరమంతా ఇవి పండించే వీలుంటుంది. వీటికి పెంపకం పద్ధతి తెలుసుకుందాం.

ఈ పుట్టగొడుగులకు ఎక్కువగా ఎండ ఉండాల్సిన అవసరం లేదు. నీడలోనే తక్కువ నీటితో ఇవి పెరుగుతాయి. ఇందుకోసం స్పోర్స్ లేదా స్పాన్ విత్తనాలు అమ్మే దుకాణాల్లో లభిస్తాయి. వీటితో పాటు పెద్ద పెద్ద ట్రేలను కొనడం మంచిది. ఇవి పన్నెండు నుంచి పద్నాలుగు అంగుళాల పొడుగుతో ఆరు అంగుళాల లోతు ఉన్నవైతే మంచిది. ఒకసారి వీటిని నాటితే ఆరు నెలల వరకు పంట పొందవచ్చు. ఈ ట్రేలను తీసుకొని వాటిలో కొద్దిగా సేంద్రియ ఎరువు పోయాలి. ఆ తర్వాత అందులోనే చిన్న చిన్న ముక్కలు చేసిన గడ్డిని ఉడకబెట్టి నీరు మొత్తం తీసేసి దాని పైన వేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్పోర్స్ చల్లి మరోసారి కాస్త గడ్డిని, సేంద్రియ ఎరువును జల్లుకోవాలి. ఇలా మూడు అంగుళాల పాటు నింపుకొని దానిపై పేపర్ పరిచి కవర్ తో ఈ ట్రేలను కప్పి ఉంచాలి .ఈ కవర్ కి కొన్ని రంధ్రాలు పొడిచి ఉంచాలి. రోజూ ఒకసారి తీసి దీన్ని కొద్దిగా తడిపి తిరిగి కవర్ మూసేసి ఉంచాలి. కావాలంటే దానిపై ఓ గోనె సంచి కూడా కప్పి ఉంచవచ్చు.

ఈ పుట్టగొడుగులను పెంచేందుకు చీకటిగా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అందుకే ట్రేలన్నింటినీ ఒక గదిలో ఉంచి ఆ గదిలోకి వెలుతురు పోకుండా జాగ్రత్త పడాలి. ఉష్ణోగ్రత కూడా మరీ ఎక్కువగా లేదా మరీ తక్కువగా లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత రెండు వారాల పాటు రోజూ ఒకసారి లేదా రెండు సార్లు కొద్దిగా ఈ ట్రేలను తడపాలి. నీళ్లు మరీ ఎక్కువగా పోస్తే బూజు పట్టే ప్రమాదం ఉంటుంది. మూడు నాలుగు రోజుల్లో తెల్లగా రావడం ప్రారంభించి రెండు వారాల్లో ట్రే మొత్తం తెల్లగా ముత్యాల్లా పుట్టగొడుగులు పరుచుకుంటాయి. ఎక్కడైనా తెలుపు కాకుండా వేరే రంగు కనిపిస్తే వాటిని తీసి పడేయండి. పుట్టగొడుగులు రావడం ప్రారంభమైన తర్వాత కొద్దికొద్ది మోతాదులోనే రోజుకు నాలుగు సార్లు నీటిని చిలకరించాలి. దీనివల్ల పుట్టగొడుగుల్లో తేమ తగ్గకుండా ఉంటుంది. ఇలా పుట్టగొడుగులు మూడు నుంచి ఐదు వారాల పాటు పెరిగిన తర్వాత వాటి బుడిపెలు కాస్త పెద్దగా అయ్యాయి అనిపించగానే వాటిని కట్ చేసి ప్యాక్ చేయవచ్చు. కట్ చేయడానికి వాటిని సర్కిల్ గా తిప్పడం లేదా పుట్టగొడుగు కాండం కలిసే దగ్గర కత్తితో కట్ చేయడం చేయవచ్చు. రెండున్నర నుంచి నాలుగు సెంటీమీటర్ల వరకు బటన్స్ పెరిగిన తర్వాతే వాటిని కట్ చేసుకోవాల్సి ఉంటుంది.

పుట్టగొడుగులకు వచ్చే సాధారణ సమస్యలు.
పుట్టగొడుగులకు వచ్చే సాధారణ సమస్యలు.

డక్టీలియం

తెల్లగా సాలీడు గూడులా దారాలు పెరగడాన్ని డక్టీలియం వ్యాధిగా చెప్పుకోవచ్చు. కొన్ని రోజులకు ఇది గులాబీ లేదా బూడిద రంగులోకి కూడా మారే ప్రమాదం ఉంటుంది. ఈ వ్యాధి రాకుండా ఉండేందుకు శుభ్రత చాలా ముఖ్యం. అంతే కాదు కేసింగ్ చేర్చడం కూడా దీనికి విరుగుడుగా చెప్పుకోవచ్చు. రెండు వారాల తర్వాత తెల్లగా కనిపిస్తున్నప్పుడు ట్రే మీద కప్పిన ప్లాస్టిక్ షీట్, పేపర్లు తీసేసి మరో అంగుళం మేర కంపోస్ట్, వర్మిక్యులేట్ మిక్చర్ కలిపి దాన్ని నింపుకోవాలి. కావాలంటే కోకోపీట్ కూడా చేర్చుకోవచ్చు.

ఆకుపచ్చ శిలీంధ్రం

తెలుపు రంగులో ఉండాల్సిన లేయర్ అక్కడక్కడ ఆకుపచ్చగా దాన్ని ఆకుపచ్చ శిలీంధ్రం అని చెప్పుకోవచ్చు. దీనివల్ల పుట్టగొడుగులు ఆకుపచ్చగా లేదా బ్రౌన్ రంగులోకి మారిపోతాయి. దీనికోసం కంపోస్ట్ ని జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ సమస్య వస్తే అక్కడి వరకు కంపోస్ట్ తో సహా తీసేసి తిరిగి కొత్తగా నింపడం మంచిది.

వర్టిసిల్లియం స్పాట్

దీనివల్ల పుట్టగొడుగులపై మచ్చలు ఏర్పడి వాటి డిమాండ్ తగ్గుతుంది. దీనివల్ల పుట్టగొడుగులు పొడిగా కూడా కనిపిస్తాయి. దీన్ని నివారించేందుకు కంపోస్ట్ లో కొద్దిగా ఉప్పు కూడా కలిపి వేసుకోవచ్చు లేదా ఉప్పుతో నింపిన చిన్న బాటిల్ మూతను వీటి దగ్గర పెట్టినా పలితం ఉంటుంది.

 

https://krishijagran.com/health-lifestyle/nutritional-value-and-health-benefits-of-mushroom/

https://krishijagran.com/agripedia/how-to-start-mushroom-farming-business/

Share your comments

Subscribe Magazine