Health & Lifestyle

అరటి ఆకులో తింటే ప్రయోజనాలివే..

KJ Staff
KJ Staff
A Traditional  Way Of Food Serving
A Traditional Way Of Food Serving

మన దేశంలో చాలా రకాల సంప్రదాయాలు శతాబ్దాల నుంచి కొనసాగుతూ వస్తున్నాయి. కొన్ని రోజూ పాటిస్తే కొన్నింటిని మాత్రం కేవలం అప్పుడప్పుడే మాత్రమే పాటిస్తూ కొనసాగిస్తూ వస్తున్నారు చాలామంది.

అందులో ఒకటి అరటాకులో భోజనం. రోజూ ప్లేట్లలో భోజనం చేసినా అప్పుడప్పుడూ పండగలు, పర్వదినాల సందర్భంగా అయినా అరిటాకులో భోజనాలు పెట్టడం మన ఆనవాయితీ. ఇలా చేయడం చేయడం సంప్రదాయమే కాదు.. ఆరోగ్యకరం కూడా. ఈ పద్ధతిని మనం దక్షిణాదిలో ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. దేవతా మూర్తులకు నైవేద్యాన్ని కూడా అరిటాకుల్లోనే అర్పిస్తూ ఉంటారు చాలామంది. ఈ ఆకులు చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి ఎన్ని రకాల వంటకాలనైనా సులువుగా వడ్డించే వీలుంటుంది. ఒకవేళ తక్కువ వెరైటీలుంటే చిన్నగా.. ఎక్కువ వెరైటీలుంటే పెద్దగా కట్ చేసుకునే వీలు కూడా ఉంటుంది. మన పెద్దలు అరటి ఆకుల్లో తినమని చెప్పడానికి కారణం అందులో ఎన్నో రకాల పోషకాలు ఉండడమే. వేడి వేడి ఆహారాన్ని అరటి ఆకుల్లో వడ్డించి తినడం వల్ల అందులోని పోషకాలు కూడా వేడి ఆహారంలో కలిసిపోయి మన శరీరంలోనికి ప్రవేశిస్తాయి. అరటి ఆకుల్లో ఎలాంటి పోషకాలు ఉంటాయంటే..

యాంటీ ఆక్సిడెంట్లు

అరటి ఆకులో సహజసిద్ధమైన పోషకాలు ఎన్నో ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఎన్నో రకాల ఆహారాల కంటే అరటి ఆకుల్లో ఉండే పాలీ ఫినాల్స్ ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఈ పాలీ ఫినాల్స్ చాలా రకాల వ్యాధులను రాకుండా కాపాడతాయి. ఇది యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కూడా కలిగి ఉంటుంది. ఇది ఆహారంలో ఏవైనా క్రిములు ఉంటే వాటిని సంహరిస్తుంది. పూర్వ కాలంలో ఒకవేళ ఆహారంలో విషం కలిపితే అరటాకు రంగును బట్టి తెలుసుకునే వారట. ఆహారం మామూలుగా ఉంటే రంగు మారదు కానీ అందులో ఏదైనా శరీరానికి హానిచేసే పదార్థాలు ఉంటే రంగు నీలంగా లేదా నల్లగా మారిపోతుందట. ఇందులో ఎపిగాల్లో కాటచిన్ గాలేట్ వంటి పాలీ ఫినాల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ని తగ్గించడానికి సాయపడుతాయి. అందుకే వీటిని ఏదైనా పదార్థాన్ని ఉడికించేందుకు కూడా ప్యాకెట్ లా కట్టి పెడతారు. వీటిని నేరుగా తింటే అరగడం కష్టమే. కానీ ఇలా ఉడికించడానికి ఉపయోగించడం లేదా అరటి ఆకుల్లో తినడం వల్ల పోషకాలన్నీ శరీరానికి అందుతాయి.

రుచి, శుభ్రత కూడా..

అరటి ఆకులపై ఒక రకమైన వ్యాక్స్ లాంటి కోటింగ్ ఉంటుంది. ఇది అందులో ఆహారం తింటున్నప్పుడు ఒక రకమైన ప్రత్యేకమైన వాసన, రుచిని అందిస్తుంది. అయితే ఇది కేవలం వేడి వేడి ఆహారం తిన్నప్పుడు మాత్రమే అందుతుంది. అరటి ఆకులను తరచూ కడగాల్సిన అవసరం లేదు. తినడానికి ముందు ఒకసారి కొద్దిగా నీటితో శుభ్రం చేస్తే సరిపోతుంది. అందుకే హోటళ్లలో తినేటప్పుడు ప్లేట్లలో తినడం కంటే అరటి ఆకుల్లో తినడం ఎంతో మంచిది. వీటి వల్ల మీరు ఒక్కరే అందులో తినే వీలుంటుంది. అంతేకాదు.. సబ్బు అవశేషాలు ఉన్న ప్లేట్లలో తినే అవసరం ఉండదు. మరొకరు తిన్న వాటిలో తినకూడదు అనుకుంటే ఇలా అరటి ఆకుల్లో తినడం మంచిది.

పర్యావరణానికి మంచిది.

మనం తినే యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ ప్లేట్లు లేదా స్టైరో ఫోమ్ ప్లేట్లు మట్టిలో కలిసి పోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అదే అరటి ఆకులను వీటి కోసం ఎంచుకోవడం వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందవచ్చు. అంతే కాదు.. ఇది నేలలో కూడా వేగంగా కలిసిపోతుంది. దీన్ని కొనేందుకు కూడా చాలా తక్కువ ఖర్చు అవుతుంది.

ఆకుపచ్చ రంగు మనల్ని ఆహారం ఎక్కువగా తీసుకునేలా కూడా చేస్తుందట. ఇందులో పెట్టిన వంటకాలన్నీ కంటికి చాలా ఇంపుగా కనిపిస్తాయి. మనం తినే ఆహారం ముందు కళ్లకు, తర్వాత ముక్కుకు నచ్చాలి.. అప్పుడే నాలుకకు కూడా నచ్చుతుందని పెద్దలు చెబుతారు. అంటే ముందు చూసేందుకు.. ఆ తర్వాత వాసన బాగుంటే రుచి కూడా బాగుంటుందని వారి ఉద్దేశం. అరటి ఆకులో పెట్టిన పదార్థాలు చూసేందుకు అద్భుతంగా.. చక్కటి ప్రత్యేకమైన ఫ్లేవర్ తో కనిపించడం వల్ల వాటిని నోరూరించేలా అందరికీ అందించే వీలుంటుంది.

https://krishijagran.com/success-story/this-mans-100-organic-biodegradable-technology-increases-shelf-life-of-banana-leaves-from-3-days-to-3-years/

https://krishijagran.com/news/indian-banana-leaves-to-be-exported-to-dubai/

Share your comments

Subscribe Magazine